Jun 24,2023 07:55
  • నేటికీ అందని రూ.5 లక్షల పరిహారం
  • పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : వైసిపి అధికారంలోకి వస్తే 2006లో సేకరించిన భూమికి పోలవరం నిర్వాసితులకు ఎకరాకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో, నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు పోలవరం ముంపు ప్రాంతాల్లో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటించారు. 2006లో సేకరించిన భూములకు పరిహారం తక్కువగా ఇచ్చారని, ఎకరా ఒక్కంటికీ కొన్ని గ్రామాల్లో రూ.1.15 లక్షలు, మరికొన్ని గ్రామాల్లో రూ.1.30 లక్షలు, ఇంకొన్ని గ్రామాల్లో రూ.1.45 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. అందరికీ ఒకే మాదిరిగా ఎకరాకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని గత ఎన్నికల ముందు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీని ప్రకారం గతంలో ఇచ్చిన మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉన్నా, ఇది నేటికీ అమలుకు నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టు పనులకు 2005లో పునాది పడింది. ఈ ప్రాజెక్టు వల్ల 116 గ్రామాలకు చెందిన 20,946 కుటుంబాలు ముంపునకు గురవుతాయని అధికారులు లెక్కలు కట్టారు. పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో అసంతప్తి వెంటాడుతోంది. గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పసిగట్టి నిర్వాసితుల్లో ఆశలు కల్పించారు. పునరావాసం భూ పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలను పూర్తిగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయలేదు. గోదావరి వరదల సమయంలో సైతం బాధితులను మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ పట్టించుకోవడం లేదు. తాజాగా పరిహారం పేరుతో ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. ఇది కంటి తలుపు సర్వే అని పోలవరం నిర్వాసితులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.

                                                                    5 లక్షల పరిహారం అందలేదు

నాకు ఏడెకరాల భూమి ఉంది. మినుములు, వరి సాగు చేసే వాడిని. మూడు ఎకరాల భూమికి ఎకరా ఒక్కంటికీ రూ.1.15 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. రెండు ఎకరాల భూమికి భూమి ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఎకరాకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పడంతో మిగిలిన సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసిన భూమిని ప్రాజెక్టు కోసం ఇచ్చాము. ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
                      - పాయం సత్యనారాయణ,
               పెద ఆర్కూరు, కూనవరం మండలం


                                                             భూములిచ్చారు... సాగులో లేవు

పరిహారంగా రాయన్నపేటలో భూమిచ్చారు. అది సాగుకు అనుకూలంగా లేనప్పటికీ ప్రయత్నం చేద్దామని వెళ్లాం. అక్కడ ఆ భూ యజమాని తనకు ఇంకా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని, ఈ భూమిని సాగు చేయనిచ్చేదిలేదని అడ్డుకున్నాడు.
భూ పట్టాలైతే ఇచ్చారు. భూమి దక్కలేదు. గతేడాది వరదలకు అ భూమి కూడా ముంపునకు గురైంది. ఇదెక్కడి న్యాయం. కూనవరం మండలంలో ఉన్న మాకు ఎటపాకలో భూములిచ్చారు. వాటితో మాకు ఫలితం లేదు.
                                                                                              - ఎం.రామకృష్ణ,
                                                                                      బొజ్జరాయిగూడెం, కూనవరం