Jun 28,2023 10:53
  • సా..గుతున్న పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీల నిర్మాణం
  • నేటికీ పూర్తికాని పరిస్థితి
  • నామమాత్రంగా మౌలిక వసతులు
  • జీవనోపాధి లేక అవస్థలు
  • అద్దె ఇళ్లల్లో మగ్గుతున్న పలు కుటుంబాలు
  • అసంపూర్తిగా తాడువాయిలో నిర్మాణాలు

ప్రజాశక్తి- జంగారెడ్డిగూడెం : 'పోలవరం ప్రాజెక్టు కోసం ఉన్నపళంగా గ్రామాలను ఖాళీ చేయమన్నారు.. లేకుంటే బలవంతంగానైనా తరలిస్తామని అధికారులు బెదించారు.. మా కోసం అన్ని వసతులతో పునరావాస కాలనీలు నిర్మించామని చెప్పారు.. కానీ ఇప్పటికి 15 ఏళ్లు అవుతుంది. మాకు కేటాయించిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో కూడా కొందరికి తెలియడం లేదు. ఏళ్ల తరబడి దిక్కుతోచని స్థితిలో పునరావాసం కోసం ఎదురు చూస్తున్నాం. పూర్తయిన ఇళ్లల్లోకి వస్తే కనీస వసతుల్లేక నరకయాతన అనుభవిస్తున్నాం. కనీస వసతుల్లేవు. రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి' అంటూ పోలవరం నిర్వాసితులు వేడుకుంటున్నారు.
మండలంలోని తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇక్కడ 3905 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకూ 2452 ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. మిగతా ఇళ్లల్లో 411 ఇళ్లు బేస్‌మెంట్‌ పూర్తయ్యాయి. బేస్‌మెంట్‌ లెవిల్‌లోపు 462, శ్లాబు వరకూ నిర్మించినవి 568, అసలు ప్రారంభం కాని ఇళ్లు 12 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 62 శాతం మాత్రమే నిర్వాసిత కాలనీ ఇళ్లు పూర్తయినట్లు వెల్లడవుతుంది. సుమారు 15 ఏళ్లుగా పునరావాస ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నిర్వాసితులు ముంపుప్రాంతాల నుండి ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. అనేకమంది నిర్వాసితులు తమకు కేటాయించిన ఇళ్లు ఎక్కడున్నాయో తెలియని గందరగోళం నెలకొంది. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల నిర్వాసితులకు చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఇళ్లను కేటాయించారు. ఈ క్రమంలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలోకి వేలేరుపాడు, పోలవరం మండలాల నుండి సుమారు 500 కుటుంబాలు చేరుకున్నాయి. కానీ కాలనీవాసులకు మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. ఇళ్ల చుట్టూ గ్రావెల్‌ నింపకపోవడంతో చిన్నపాటి వర్షానికి కాలనీలోకి నీరుచేరుతోంది. వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. జీవనోపాధి కల్పించకపోవడంతో నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో కాలంగడుపుతున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణం కూడా అసంపూర్తిగానే చేపట్టారు. బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించి కాలనీకి పంపారని నిర్వాసితులు వాపోతున్నారు. చింతూరు మండల నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లల్లో గందరగోళం నెలకొందని పలవురు పేర్కొంటున్నారు. వారికి కేటాయించిన ఇళ్లకు సంబంధించి ఇంటి నెంబర్లతో కూడిన పత్రాలున్నప్పటికీ మరోచోట ఇళ్లను చూపుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వచ్చిన గోదావరి వరద ముంపునకు గురైన తమ బంధువులు సర్వం కోల్పోయినప్పటికీ పునరావాస ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అద్దె ఇళ్లల్లో కాలం గడుపుతున్నామని మరికొందరు నిర్వాసితులు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం సరైన పరిహారం అందించడం, ఉపాధి కల్పన, మౌలిక వసతులు, విద్యా, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు తీవ్రఅసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

                                            జీవనోపాధి కరువైంది : ఉమాసంతూషి, పోలవరం నిర్వాసితురాలు

పునావాస కాలనీలో నివాసం ఉంటున్న నిర్వాసితులకు జీవనోపాధి కరువైంది. ఏ పని చేసుకుని బతకాలో అయోమయంగా ఉంది. కాలనీ సమీపంలో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు. మా పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం దృష్టిసారించి కాలనీవాసులకు జీవనోపాధి కల్పించాలి.
 

                                  రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలి : కె.రమణ, వేలేరుపాడు మండలం, కరుటూరు నిర్వాసితుడు

పునరావాస కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. కొంతమేర మాత్రమే డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. వర్షం వచ్చినప్పుడు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నాము.
 

                                   వీధి దీపాలు ఏర్పాటు చేయాలి : బండి రాంబాబు, కుక్కునూరు మండల నిర్వాసితురాలు

పునరావాస కాలనీలో వీధి దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. రాత్రి సమయంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి. త్వరితగతిన వీధి దీపాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి.
 

                                  ఇళ్ల ప్రాంగణంలో గ్రావెల్‌ నింపాలి : బి.వీరబాబు, కుక్కునూరు మండల నిర్వాసితుడు

పునరావాస కాలనీల ఇళ్ల చుట్టూ గ్రావెల్‌ మట్టిని నింపాల్సి ఉంది. ఇళ్లల్లోకి వచ్చి ఏడాది దాటింది. కానీ ఇప్పటివరకూ ఇంటి చుట్టూ మట్టిని నింపే చర్యలు చేపట్టలేదు. అధికారులను అడుగుతున్నా స్పందించడం లేదు.
 

                           18 ఏళ్లు నిండిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలి : ఎస్‌కె.హన్ను, వేలేరుపాడు మండల నిర్వాసితుడు

18 ఏళ్లు నిండిన వారికి రూ.పది లక్షలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. కాలయాపన చేయకుండా ప్రభుత్వం దృష్టిసారించి పరిహారం అందించాలి.