హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ శోకతప్తమయ్యింది. గద్దర్ చివరిచూపు కల్పించడం కోసం ... హైదరాబాద్ లోని ఎల్బీ స్డేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, పలు వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు చేరుకోనుంది. భౌతికకాయాన్ని గద్దర్ నివాసంలో కాసేపు ఉంచిన తర్వాత బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎపి మంత్రి బత్స సత్యనారాయణ, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సినీ ప్రముఖులు మంచు మోహన్‌బాబు, మనోజ్, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టిడిపి నేత పరిటాల శ్రీరామ్, తదితరులు గద్దర్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని పలువురు మంత్రులు స్మరించుకున్నారు.