న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలలో అడవుల నరికివేత పెరుగుతూనే ఉంది. అడవుల సంరక్షణకు ఇచ్చిన పాలకులు హామీలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ (జీఎఫ్‌డబ్ల్యూ) అనే సంస్థ అందించిన నివేదిక ప్రకారం బ్రెజిల్‌లో అమెజాన్ అడవుల నరికివేత యధేచ్ఛగా సాగుతోంది. గత సంవత్సరం 3,900 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని అడవులు అదృశ్యమయ్యాయి. ప్రతి ఐదు సెకన్లకు ఫుట్‌బాల్ పిచ్ విస్తీర్ణమంత అడవులు కనుమరుగవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే అడవుల నరికివేత ఈ ఏడాది 10% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంమీద గత సంవత్సరం 15,800 చదరపు మైళ్ల ఉష్ణ మండలపు వర్షాధార అడవులు అదృశ్యమయ్యాయని జీఎఫ్‌డబ్ల్యూ నివేదిక తెలిపింది. పురాతన అడవులు వాతావరణాన్ని పరిరక్షించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నివేదిక వివరించింది. ఈ దశాబ్దం చివరి నాటికి అడవుల నరికివేతను నిలువరిస్తామని గత సంవత్సరం 145 దేశాలు ప్రతినబూనాయి. అయితే అనుకున్నదొకటి అయింది మరొకటి అన్న చందంగా అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంది. బ్రెజిల్ తర్వాత కాంగో, బొలీవియా దేశాలలో అడవుల నరికివేత అధికంగా జరుగుతోంది. బొలీవియాలో వ్యవసాయాధారిత వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో అక్కడ అడవులను యధేచ్ఛగా నరుకుతున్నారు. ఈ నేపథ్యంలో అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










