- 40 కోట్లు తగ్గింపు
- పంపిణీ చేసే విత్తనాలు, లబ్ధిదారులు కుదింపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతులకు పంపిణీ చేసే విత్తనాల రాయితీని ప్రభుత్వం ఈ ఏడాది కుదించింది. ముందుగా వేసిన అంచనాలో దాదాపు రూ.40 కోట్లు తగ్గించింది. తొలుత విత్తన సబ్సిడీకి రూ.240 కోట్లు కావాలనుకోగా, అనంతరం రూ.200 కోట్లకే పరిమితం కావాలని దిశా నిర్దేశం చేసింది. వాస్తవ అంచనాలను కాకుండా ఉజ్జాయింపుగా వేసే బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వం భరించే సబ్సిడీ నిధులు తగ్గినపక్షంలో ఆ మేరకు రైతులకు పంపిణీ చేసే విత్తనాల పరిమాణం తగ్గుతుంది. లబ్దిదారుల సంఖ్యకూ కోత పడుతుంది. తగ్గిన విత్తనాలను బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆ వారా రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. అసలే సంక్షోభంలో ఉన్న రైతన్నలు ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నారు.
చిక్కిపోతున్న రాయితీ
జాతీయ ఆహార భద్రత మిషన్, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం ఇత్యాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో సబ్సిడీపై విత్తనాలిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని పంటల విత్తనాలనూ సరిపడా పంపిణీ చేయట్లేదు. మొత్తం అవసరంలో 30 శాతం కూడా రాయితీ విత్తనాలుండవు. కొన్ని పంటల విత్తనాలకే 50 శాతం సబ్సిడీ. వేరుశనగ సహా పలు పంటలకు 40 శాతమే. పంపిణీ చేసే విత్తనాల పరిమాణం అంతకంతకూ తగ్గుతోంది. 2020-21 ఖరీఫ్‌లో 6.99 లక్షల క్వింటాళ్లు, 2021-22లో 6.17 లక్షల క్వింటాళ్లు, నిరుడు 5.35 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. తుపాన్లు, వరదలు, కరువు వంటి ప్రత్యేక సందర్భాల్లో కంటింజెన్సీ ప్లాన్ల కింద రబీలో అరకొర విత్తనాలిస్తున్నారు. ఖరీఫ్, రబీ కలుపుకొని 2020-21లో రూ.216 కోట్లు, 2021-22లో రూ.265 కోట్లు, నిరుడు రూ.175 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం రెండు సీజన్లూ కలుపుకొని రూ.200 కోట్లు మాత్రమేనంటున్నారు. ఒక వైపు అమ్మకపు ధర (సేల్ ప్రైస్) పెంచేసి మరోవైపు ప్రభుత్వం భరించే రాయితీ అమౌంట్ తగ్గిస్తే అంతిమంగా రైతుపైనే భారం పడుతుంది. వేరుశనగ సేల్ ప్రైస్ నిరుటికంటే క్వింటాలుకు రూ.850 పెంచారు. సబ్సిడీని కుదించడంతో గతేడాది రైతుకు గరిష్టంగా 150 కిలోలు (ఐదు మూటలు) ఇవ్వగా ఈ తడవ 90 కిలోలకు (మూడు మూటలు) తగ్గించారు.
ఇండెంట్లకు కత్తెర
సర్కారు సరఫరా చేసే విత్తనాల్లో 70 శాతం వరకు వేరుశనగ విత్తనాలే. వాటి పంపిణీ సైతం ఏడాదేడాది తగ్గిపోతోంది. ఈ సంవత్సరం ఖరీఫ్ కోసం చివరి నిమిషంలో ఆదరాబాదరాగా టెండర్లపై వ్యాపారుల నుంచి సేకరించారు. పెద్దగా నిబంధనలేమీ పాటించలేదు. ఇంకా వర్షాలు జోరందుకోకముందే విత్తన పంపిణీ పూర్తి చేశారు. రాష్ట్రం మొత్తానికీ 2.92 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలనుకోగా అందులో 30 వేల క్వింటాళ్లు పంపిణీ చేయలేదని తెలుస్తోంది. వేరుశనగ అధికంగా సాగు చేసే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలుత 1.88 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలనుకోగా లక్ష్యం ఇంకా చేరకుండానే పంపిణీ నిలిపేశారని ఆరోపణలొస్తున్నాయి. ఆర్‌బికెలలో డి-క్రిషి యాప్‌లో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పి, ఆఫ్‌లైన్‌కు కూడా అనుమతిచ్చారు. దాంతో పంపిణీ లెక్కలు తారుమారయ్యాయని, కాగితాలపై పేర్కొన్న మేరకు కూడా రైతులకు విత్తనాలు చేరలేదని విమర్శలొస్తున్నాయి. వరి, పప్పులు, గ్రీన్ మెన్యూర్ ఇలా అన్ని పంటల విత్తనాలూ ఇంతేనని అన్నదాతలు వాపోతున్నారు.










