ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : పచ్చని పొలాలకు కార్పొరేట్ కంపెనీల ముప్పు పొంచి ఉంది. సేద్యాన్ని కార్పొరేట్లకు స్వాధీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు రైతులు అడ్డం తిరిగి వెనక్కి కొట్టినా, దొడ్డిదారిన వాటిని అమలు చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. రైతు పండించిన పంటలకు అస్తవ్యస్తమైన మద్దతు ధరలు నిర్ణయించింది. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని ఉట్టికెక్కించి, పెట్టిన పెట్టుబడి కూడా అందకుండా చేస్తోంది. ఫలితంగా రైతు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. పత్తి కొనుగోలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తే, ధాన్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ తటపటాయిస్తుంటే, రైతులు మధ్యదళారీల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు.
పత్తి రైతుల ఆత్మహత్యలు
ఉదాహరణకు పత్తికి మద్దతు ధర రూ.6600 నిర్ణయించారు. కానీ ఆ ధర అమలు కావడం లేదు. పత్తిని కొనాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పడకేసింది. ఒక్క తెలంగాణలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, సిసిఐ కొనకపోవడంతో రైతులు దళారులకు అడ్డికి పావుశేరు తీరున అమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా తిరిగిరాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పంటల రైతుల పరిస్థితి ఇంతకు భిన్నంగా ఏమీ లేదు.
పెట్టుబడి ఎక్కువ...లాభం తక్కువ
సాధారణంగా పత్తి సాగులో ఎకరాకు పెట్టుబడి రూ. 36,610 అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతున్న డీజిల్, పెట్రోల్, ఎరువులు, యంత్రాల ధరలతో రైతుపై మరో పదివేల అదనపు భారం పడుతోంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ళ పత్తి వస్తుంది. దీని ప్రకారం ఎకరాకు రూ. 60వేల ఆదాయం అనుకున్నా...పెట్టుబడిపోను రైతుకు మిగిలేది రూ. 14వేలు మాత్రమే. ఆరునెలలు కష్టపడితే నెలకు రూ. 2,333 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. రైతు కుటుంబం బతకడమే గగనంగా మారింది.
లెక్కలో లేని కౌలు రైతు
కౌలు రైతుల పేరిట కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టింది. కార్పొరేట్ల ఒత్తిడిమేరకు ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేసింది. ఆత్మహత్య చేసుకుంటే పరిహారం కూడా దక్కని దయనీయపరిస్థితి. ఆత్మహత్యల్లో కౌలు రైతులే ఎక్కువ. అర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న పిఎం కిసాన్ సమ్మాన్ పథకం కూడా అమలులో ఎన్నో ఆటంకాలు సృష్టించి చేతులు దులిపేసుకుంటున్నారు.
సహకార సంఘాలకూ బిజెపి సర్కారు ఎసరు
రైతులకు చేదోడు, వాదోడుగా ఉంటున్న సహకార సంఘాలకు కూడా కేంద్రం ఎసరు పెట్టింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాల బిల్లు-2022 తెచ్చింది. ఆ గొడుకు కిందకు అన్ని సంఘాలను తీసుకొచ్చి లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్న సహకార సంఘాలను కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా ఉమ్మడి జాబితాలో ఉన్న వీటిని కేంద్రం తన గుప్పిట్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది.










