Oct 26,2022 10:53

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : చిన్న వయసులోనే కాలికి అయిన గాయం కారణంగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి కర్నూలు కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన మృదులాస్థి మార్పిడి శస్త్రచికిత్స చేసి ఊరట కల్పించారు. శస్త్రచికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పి.కిరణ్‌ కుమార్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. కర్నూలుకు చెందిన 30 ఏళ్ల యువకుడు తీవ్రమైన మోకాలినొప్పితో కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చాడు. ఎంఆర్‌ఐ తీస్తే మృదులాస్థి కొంతభాగం పోయినట్లు గుర్తించారు. మృదులాస్థి పోయినప్పుడు ఆ ప్రాంతం మీద బరువు పడితే మోకాళ్ల నొప్పులు వస్తాయి. సాధారణంగా పెద్దవయసు వారికైతే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. వయసు తక్కువ కావడంతో మోకాలిని కాపాడేందుకు ఓట్స్‌ అనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సాధారణంగా మన కీళ్ల వద్ద మృదులాస్థి చుట్టూ ఉంటుంది. కొన్నిచోట్ల మాత్రమే బరువు పడుతుంది. మిగిలిన చోట్ల పడదు. బరువు పడని ప్రదేశం నుంచి మృదులాస్థిని సేకరించి, దాన్ని దెబ్బతిన్నచోట పెట్టాలని నిర్ణయించారు. ఇలాంటి శస్త్రచికిత్సను ఓట్స్‌ అంటారు. ఇది సాంకేతికంగా చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స, ముందుగా దీనికి ఆర్థ్రోస్కోపిక్‌ పరీక్ష ద్వారా మోకాలిని పూర్తిగా పరిశీలిస్తామని డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. తర్వాత మోకాలిపై రంధ్రం చేసి, దెబ్బతిన్న ప్రాంతంలో ఎంత మృదులాస్థి అవసరం అవుతుందో తెలుసుకున్నారు. తర్వాత మోకాలిపై బరువుపడని చోటు నుంచి ఎముకను, మృదులాస్థిని సేకరించి.. దాన్ని మోకాలిలో పాడైన ప్రాంతానికి చేర్చారు. ఇక్కడ 8 మిల్లీమీటర్ల ప్లగ్స్‌తో గ్రాఫ్ట్‌ తీసుకుని, అదే కాలికి.. అదే ఎముకలో అమర్చారు. ఇలా తీసిన చోట మృదులాస్థి మళ్లీ ఏర్పడేందుకు ఆరు వారాలు పడుతుందని కిరణ్‌ తెలిపారు. ఆరు వారాలు విశ్రాంతి అనంతరం పరీక్షించగా ఆ యువకుడు చక్కగా నడుస్తూ, తన పనులన్నీ తాను చేసుకుంటున్నాడని చెప్పారు. కర్నూలులో ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు.