- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
- అధికారుల సమావేశాలను బహిష్కరించిన గిరిజనులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాథమిక అవసరాలలో ఒకటైన తాగునీరు అందించడంలోనూ చిత్తశుద్ధి కొరవడింది. కొండమొదలు పంచాయతీలోని కొండమొదలు, తాడివాడ, మెట్టగూడెం, కొక్కిరగూడెం, నడిపూడి, తెలిపేరు, సోమర్లపాడు కొత్తగూడెం, పెద్ద గూడెం, కథనాపల్లి పది గ్రామాల నుంచి 500 గిరిజన కుటుంబాలను గంగవరం మండలం నేలదోనెలపాడులో నిర్మించిన పునరావాస కాలనీకి గతేడాది ఆగస్టులో ప్రభుత్వం పంపించింది. ఈ కాలనీలో రెండు బోర్లు ఉండగా, వాటిలో కొండమొదలు, తాడివాడ, మెట్టగూడెం, కొక్కిరగూడెం, నడిపూడి, తెలిపేరు ఐదు గ్రామాల ప్రజలకు సరఫరా చేసే బోరు ఒట్టిపోయింది. గత ఆరు నెలలుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారుల చొరవ లోపించింది. బోర్లు వేసే క్రమంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నిర్వాసితులు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గతేడాది ఆగస్టులో వచ్చిన వరదలకు బ్యాక్ వాటర్ దేవీపట్నం మండలంలోని అనేక గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో, కుటుంబాలతో సహా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండమొదలు ప్రజలు పునరావాస కాలనీకి చేరారు. ఇప్పటికీ కనీస వసతులు, సౌకర్యాలు లేవు.
తాగునీటి సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి లేమి
తాగునీటి ఎద్దడిని పరిష్కరించాల్సిన అధికారులు వేసవి కాలం కావడంతో భూగర్భ జలాలు అడుగంటాయంటూ సాకు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న రెండు చేతి పంపులు సైతం పనిచేయడం లేదు. పంపులు మరమ్మతులు చేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడం లేదు. దీంతో, తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని ట్రస్టు నుంచి క్యానుల ద్వారా కొన్ని గిరిజన కుటుంబాలు నీరు తెచ్చుకుని దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వృద్ధులు, వాహన సౌకర్యంలేని అత్యధికమంది దీనావస్థలో జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇటీవల సమీపంలో ఎండిపోయిన చెరువు పక్కన నిర్వాసిత గ్రామస్తులే చెలమను తవ్వుకున్నారు. ఆ నీటినే బకెట్లు, బిందెలతో కిలోమీటరు దూరం నుంచి తెచ్చు కుని గత కొన్ని రోజులుగా తమ అవసరాలకు విని యోగించుకుంటున్నారు. తాగేందుకు కాచి చల్లార్చి వినియోగిస్తున్నారు. పునరావాస కాలనీలో పంచాయతీ నిధులు ఖర్చు పెట్టేందుకు తమకు అనుమతులు లేవని పంచాయతీ సిబ్బంది తేల్చి చెబుతున్నారు. గిరిజనులు గత ఆరు నెలలుగా దశల వారీ ఆందోళనలు నిర్వహించినా, సబ్ కలెక్టర్‌కు, ఐటిడిఎ పిఒకు తెలియచేసినా పాలనా యంత్రాంగం చొరవ చూపించకపోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.
అభివృద్ధి కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన నిర్వాసితులు
అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి గత కొన్ని నెలలుగా ప్రతి శుక్రవారమూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాలనీలో నివసించే గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుని మినిట్స్ రాసుకున్నారు. గత ఆరు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ పరిష్కారం చూపించకపోవడంతో ఈ నెల 16న నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశాన్ని గిరిజనులు బహిష్కరించారు. ఆ మేరకు గిరిజనులు సంతకాలు చేసి పంపించారు. ఈ పరిణామంతో బోర్లు మరమ్మతులు చేస్తామంటూ అధికారులు ఎట్టకేలకు సమాధానం ఇచ్చారు. నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పోలవరం పునరావాస కాలనీల్లో 25 రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి. అవన్నీ పేపర్లు దాటి ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ఆర్ అండ్ ఆర్ నిధులు, ఐటిడిఎ నిధులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
దాహార్తికి... చెలమ నీరే దిక్కు
గతేడాది ఆగస్టులో ఈ కాలనీకి వచ్చాము. అప్పటి నుంచీ తాగునీటికి అవస్థలే. మోటార్లు పని చేయడం లేదు. బాగు చేస్తామంటున్నారు. చేయడం లేదు. మా ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులం ఉన్నాము. బట్టలు ఉతుకునేందుకు, వంటకు, స్నానాలతో పాటు తాగేందుకు చెలమ నీరే మాకు దిక్కవుతోంది.
- నడిపూడి వెంకటలక్ష్మి, నేలదోనెలపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ
పంచాయతీ నిధులున్నా ఖర్చు చేయలేని దుస్థితి
కొండమొదలు పంచాయతీలో సుమారు రూ.10 లక్షల నగదు ఉన్నట్లు ఇటీవల అధికారులు తెలిపారు. ఈ పంచాయతీ దేవీపట్నం మండలంలో ఉంది. ప్రస్తుతం మా పునరావాస కాలనీ గంగవరం మండలంలో ఉంది. ఆ నిధులు ఇక్కడ ఖర్చు చేస్తే ఆడిట్‌లో టెక్నికల్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులకు రాతపూర్వక హామీలు ఇవ్వాలని పలుమార్లు కోరాం. ఖర్చు చేయండి అని మౌఖికంగా చెబుతున్నారు. పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు వస్తాయని వెనకడుగు వేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. సమస్య పరిష్కరించాలి.
- వేట్ల విజయ, సర్పంచ్, కొండమొదలు పంచాయతీ










