Jul 07,2023 09:55
  • ఇప్పటి వరకు 8 శాతమే
  • లోటు వర్షపాతంతో ముందుకు పడని అడుగులు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లాలో సాగు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. లోటు వర్షపాతంతో విత్తనాలు వేసేందుకు అన్నదాతలు అడుగులు ముందుకు వేయడం లేదు. వరుసగా నష్టాలు మూటగట్టుకుంటుండడంతో విత్తనం విత్తాలా? వద్దా? అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి.
           వ్యవసాయమే ప్రధానంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు జిల్లా ఒకటి. తొలకరి వర్షాలు ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ఇప్పటివరకు ఖరీఫ్‌ సాగుకు అడుగులు ముందుకు పడడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ సాగులో కేవలం 8.2 శాతం మాత్రమే విత్తనాలు వేశారు. జిల్లాలో మొత్తం సాధారణ సాగు 10,53,900 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 86,770 ఎకరాల్లో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. జూన్‌ నెలలో 77.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 46.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. వర్షాలు ఆశించిన రీతిలో కురవకపోవడంతో విత్తనం విత్తేందుకు రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా ఉండే పత్తి సాధారణ సాగు 6,25,067.5 ఎకరాలు కాగా ఇప్పటివరకు 65,155 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 10.4 శాతం పంట మాత్రమే సాగయింది. వర్షం లేకపోవడం వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో పత్తి చెట్లు ఎండిపోతున్నాయి. వేరుశనగ సాధారణ సాగు 1,66,407.5 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 10,755 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. వరి సాధారణ సాగు 32,272.5 ఎకరాలు కాగా 30 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. కంది సాధారణ సాగు 59,822.5 ఎకరాలు కాగా 2,520 ఎకరాల్లో, పొద్దుతిరుగుడు సాధారణ సాగు 1,490 ఎకరాలు కాగా 287.5 ఎకరాల్లో విత్తనాలు విత్తారు. ఆముదం సాధారణ సాగు 20,357.5 ఎకరాలు కాగా 2,562.5 ఎకరాల్లో, మిరప సాధారణ సాగు 48,410 ఎకరాలు కాగా 1240 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది మిర్చి పంట తెగుళ్లతో భారీగా నష్టాలు మూటగట్టుకోవడంతో రైతులు ఈఏడాది మిరప సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉల్లి సాధారణ సాగు 38,582.5 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1267.5 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. టమోటా సాధారణ సాగు 5,257.5 ఎకరాలు కాగా 190 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. ఇతర పంటల సాధారణ సాగు విస్తీర్ణం 29,175 కాగా 1,967.5 ఎకరాల్లో సాగు చేశారు.
 

                                                                    చిరు ధాన్యాలపైనా ప్రభావం

లోటు వర్షపాతం ప్రభావం చిరు ధాన్యాల సాగుపైనా పడింది. జిల్లావ్యాప్తంగా సజ్జ సాధారణ సాగు 8,265 ఎకరాలు కాగా 165 ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ సాగు 10,810 ఎకరాలు కాగా 527.5 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. కొర్ర సాధారణ సాగు 4,080 ఎకరాలు కాగా కేవలం 110 ఎకరాల్లో సాగు చేశారు.