- నేడు కందుకూరి వీరేశలింగం వర్థంతి
వితంతువుల పేర సాగుతున్న సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలు చేసేందుకు 1870ల లోనే కందుకూరి వీరేశలింగం తెలుగునాట సంస్కరణ ఉద్యమం నడిపాడు. కష్టాలు, వ్యతిరేకతలు, ఛీత్కారాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. హేతువాది, రచయిత, కవితా వైతాళికుడు అయిన కందుకూరి వీరేశలింగం వితంతువుల పునరావాస, శరణాలయాలు స్థాపించాడు. బాలికలకు ప్రత్యేకంగా రాజమండ్రిలో పాఠశాల స్థాపించి తెలుగునాట సంస్కరణోద్యమ 'వేగుచుక్క'గా వెలుగొందాడు.
చిన్ననాటి నుంచే మూఢనమ్మకాలకు వ్యతిరేకం
చిన్నారి బాలికలకు ముసలి వారితో వివాహాలు చేసే రోజులవి. వితంతువులు మరలా పెళ్లి చేసుకోరాదనే మూఢాచారం అమలులో వున్న సాంఘిక పరిస్థితులలో కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. బడిలో పాఠాలు ఒక్కసారి చదివితే చాలు కంఠతా వచ్చేసేవి. ఇంట్లో అటక మీద వున్న తాటాకు పుస్తకాలు తీసి చదివేవాడు. దాంతో తెలుగు మీద అభిమానం పెంచుకున్నాడు. బడిలో చదువు, సత్ప్రవర్తనలో వీరేశలింగందే అగ్రస్థానం. తాము ఎన్ని ఇబ్బందుల్లో వున్నా తల్లిదండ్రులు వీరేశలింగం చదువును మాత్రం మాన్పించలేదు.
వీరేశలింగానికి జబ్బు చేస్తే ఎవరో తన కుమారుడికి చేతబడి చేశారని భూతవైద్యుని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నించింది తల్లి. ఆ భూత వైద్యుడిని వీరేశలింగం వివిధ ప్రశ్నలు వేయడంతో అతను భయపడి పారిపోయాడు. ఇంటికి వెళ్లాక అనారోగ్యం పాలయ్యాడు. పైగా వీరేశలింగం తనకే చేతబడి చేశాడని భయపడిపోయాడు. దీంతో అతని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఆరోగ్యం కుదుటపర్చాడు వీరేశలింగం. దెయ్యాలు, భూతాలు లేవంటూ వాదించేవాడు. తోటి వారితో సవాలు చేసి, అమావాస్యనాడు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి తెల్లవారి తిరిగొచ్చి... ఒక్క దెయ్యం కూడా కనపడలేదని దెయ్యాల పేరుతో భయాలు అనవసరం అని చాటి చెప్పాడు.
వీరేశలింగానికి 13వ ఏట ఏడేళ్ల రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారిద్దరూ తెలుగు నాట సంస్కరణోద్యమాలకు తోడ్పడ్డారు. వీరేశలింగం రాజమండ్రిలో ఒక సంవత్సరం పాటు ఉపాధ్యాయుడిగా పని చేశాడు. 1872వ సంవత్సరంలో కోరంగిలో ఇంగ్లీషు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. మూఢ నమ్మకాలు, ఆచారాల మీద నమ్మకాలు మారిపోయాయి. కోరంగి స్కూలులో చేరటానికి అమావాస్య నాడు వెళ్లే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. భూమి సూర్యుడు చుట్టు తిరగడం వల్ల ఏర్పడే సంవత్సరం లోని రోజులలో మంచి రోజులు, చెడు రోజులు అనే తేడాలు చూడడం మూఢత్వం, అజ్ఞానమని తన చర్య ద్వారా తెలియచెప్పాడు.
సంఘ సంస్కరణలు-వితంతు వివాహాలు
సనాతన భావాలు, మత సాంప్రదాయ కుటుంబానికి చెందిన వీరేశలింగం విద్యార్థి దశ లోనే ముఖానికి విభూది రేఖలు, మెడలో లింగకాయ తీసివేశాడు. మత చిహ్నాలను తొలగించుకోవడం ద్వారా ప్రారంభమైన సంస్కరణ కార్యక్రమం... జీవితాంతం అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా నిరంతరం కొనసాగింది. 1874లో మిత్రులతో కలిసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రచారం చేసేందుకు 'వివేకవర్ధని' పత్రికను స్థాపించాడు. తెలుగు ప్రజా సమాజంలో వున్న అవలక్షణాలకు, అధికారుల లంచగొండితనానికి, మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
చిన్నప్పుడే పెళ్లయిన అమ్మాయిలు, భర్త చనిపోతే జీవితాంతం వితంతువుగానే పడి ఉండాల్సిందేననే దురాచారం అమలులో వుండేది. దీనిపై చలించిన వీరేశలింగం తన మిత్రులతో కలసి స్త్రీల పునర్వివాహాలను గూర్చి బహిరంగ సభల ద్వారా ప్రచారం చేశాడు. రాజమండ్రిలో మిత్రులతో కలసి 1878 సెప్టెంబరు 8న 'సంఘ సంస్కరణ' సమాజం స్థాపించాడు.
మూఢాచారాలకు వ్యతిరేకంగా కృషి
స్త్రీల పునర్వివాహం కోసం వీరేశలింగం జరిపిన కృషిని, ప్రచారాలను మొదటి నుండి అనేక మంది వ్యతిరేకించారు. కొన్ని సందర్భాలలో మూర్ఖులు వీరేశలింగంపై ప్రత్యక్ష దాడులకు సిద్ధపడిన సంఘటనలూ వున్నాయి. అభ్యుదయ వాదులైన కొందరు విద్యార్థులు, యువకులు ఆయనకు తోడ్పడేవారు. వితంతు పునర్వివాహాల గురించి ప్రజలలో బాగా స్పందన వచ్చింది. వధూవరుల కోసం రాత్రిళ్లు ప్రయాణాలు చేయడం, ఆడపిల్లలకు మగవేషాలు వేయడం, వాళ్లను ఎత్తుకొని మైళ్ల కొద్దీ నడవడం వంటి తెగువ చూపాడు. అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదుర్కొన్నాడు. తన ఇంటికి చేరిన వితంతువులను భార్య రాజ్యలక్ష్మితో కలసి కాపాడి వివాహాలు చేశాడు. బంధువులు, మిత్రులు, ఆప్తులు వ్యతిరేకించినా ఇబ్బందులొచ్చినా ఏనాడూ ఒక్కడుగు వెనక్కి వేయలేదు. కొద్ది సంవత్సరాల కాలంలోనే 112 వితంతు వివాహాలు జరిపించాడంటారు. అంతేగాక, స్త్రీ విద్య కోసం బాలికల పాఠశాలలు, కళాశాల నిర్మించాడు. రాత్రి పాఠశాలలు కూడా నడిపాడు. ఆయన జీవితాంతం స్త్రీల అభ్యున్నతి కోసం జరిపిన కృషి ఉత్తుంగ తరంగ సముద్రంలో ఎదురీతగా చెప్పవచ్చు.
నేడు దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వరకట్న హత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో విద్యార్థులు, యువతరం అభ్యుదయ వాదులుగా వ్యవహరించాలి. కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో నేటి దురాచార రూపాలకు వ్యతిరేకంగా పని చేయడం ఎంతైనా అవసరం.
(వ్యాసకర్త సెల్ : 9490098559)
గుడిపాటి నరసింహారావు










