- అర్హులను నిర్ణయించే విధానం లోపభూయిష్టం
- 2017 జూన్ నెలాఖరుకు 18 ఏళ్లు నిండిన వారికే పరిహారమట!
- ఈ ఆరేళ్లలో మేజర్లుగా మారిన యువత ఏలూరు జిల్లాలో 20 వేల మందిపైనే
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న కుటుంబాల్లోని యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం... గ్రామాలను ఖాళీ చేయించే సమయానికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను కుటుంబంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతోపాటు, ఇంటిని నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా తేల్చడంలో లోపభూయిష్టమైన విధానాలను అవలంభిస్తూ తీరని అన్యాయం చేస్తోంది. 2017 జూన్ నెలాఖరుకు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు మాత్రమే పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం చెపుతోంది. ప్రస్తుతం 2023 సంవత్సరం నడుస్తోంది. ఇప్పటి వరకూ ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంగానీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంగానీ, భూములకు ప్రకటించిన పరిహారం ఇవ్వడంగానీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం నిర్మాణంతో వరదలు గ్రామాలను ముంచెత్తుతున్నప్పటికీ నిర్వాసితులంతా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీ 2017 జూన్ తర్వాత గడిచిన ఆరేళ్లలో 18 ఏళ్లు నిండిన యువత ఏలూరు జిల్లాలోనే వేల సంఖ్యలో ఉంది. వీరందరికీ పరిహారం ఇవ్వాలంటూ నిర్వాసితులంతా కోరుతున్నారు. పోలవరం నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపై సిపిఎం పోలవరం పోరుకేక పేరుతో పోలవరం ముంపు గ్రామాల్లో పాదయాత్ర చేస్తోంది. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలంలో 41.15, 45.72 కాంటూర్ల పరిధిలో 59 గ్రామాలు ముంపునకు గురవుతుండగా 13,565 నిర్వాసిత కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 48 గ్రామాలు ముంపు పరిధిలో ఉండగా 8,205 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో మొత్తంగా 21,770 కుటుంబాలను గ్రామాల నుంచి తరలించాల్సి ఉంది. 2017 జూన్ తర్వాత 18 ఏళ్లు నిండిన యువత ప్రతి కుటుంబంలోనూ ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఉన్నారు. ఆ ప్రకారం చూస్తే, ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ తర్వాత 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు 20 వేల మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంపు గ్రామాల లెక్కలు కూడా కలిపితే ఈ సంఖ్య 50 వేలు దాటే అవకాశం ఉంది. వీరందరినీ ప్రత్యేక కుటుంబంగా గుర్తించి చట్టప్రకారం ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రూ.పది లక్షలు, ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాల్సి ఉంది. గ్రామాలను ఖాళీ చేయించే రోజు వరకూ 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. లేకపోతే వేల సంఖ్యలో యువతీ, యువకులకు తీరని నష్టం.

- ప్రస్తుతం 22 ఏళ్లు... పరిహారం ఇవ్వకపోతే ఎలా
నేను 2001లో పుట్టాను. 2017 నాటికి నాకు 18 ఏళ్లు నిండలేదని పరిహారం ఇచ్చే అర్హుల జాబితాలో చేర్చలేదు. అప్పటి నుంచి మాధవరం గ్రామంలోనే ఉంటున్నాము. ఇప్పుడు నాకు 22 ఏళ్లు వచ్చాయి. అయినా, పరిహారం రాదని చెబుతున్నారు. పరిహారం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటి? వివాహం చేసుకున్న తర్వాత ఎలా బతకాలి? గ్రామాన్ని ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం ఇవ్వాలి.
- కోట పూజిత, మాధవరం గ్రామం, కుక్కునూరు మండలం

- కటాఫ్ తేదీ మార్చి పరిహారం ఇవ్వాలి
2017 జూన్‌కు నాకు 17 ఏళ్లు ఉన్నాయి. 18 ఏళ్లు నిండలేదని పరిహారపు అర్హుల జాబితాలో చేర్చలేదు. ఇప్పుడు 23 ఏళ్లు వచ్చాయి. పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ, ఎటువంటి సమాధానమూ లేదు. ఇప్పటికీ గ్రామాలను ఖాళీ చేసి వెళ్లలేదు. అటువంటప్పుడు పరిహారం ఇవ్వకుండా వట్టిచేతులతో పంపిస్తే అన్ని కోల్పోయి ఎలా బతకాలి? గ్రామాలను ఖాళీ చేసిన రోజు ప్రాతిపదికన కటాఫ్ తేదీ మార్చి యువతీ, యువకులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
- సంగేపు ప్రేమ్‌కుమార్, రజక బజార్, కుక్కునూరు










