May 28,2022 06:56

    ప్రధాని నరేంద్ర మోడీ గురువారంనాడు హైదరాబాద్‌, చెన్నై పర్యటనల సందర్భంగా చేసిన ఉపన్యాసాలు, తమిళనాడు సిఎం స్టాలిన్‌ రాష్ట్రాల హక్కుల కోసం గళాన్ని బలంగా వినిపించడం రెండు భిన్న రీతులకు ప్రతిరూపాలు. ప్రధాని హైదరాబాద్‌ పర్యటనలో బిజెపి కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపైన, దాని అధినేతపైనా కుటుంబ పార్టీ మొదలు మూఢ నమ్మకాల గురించిన విమర్శలు గుప్పించడం ఆయన స్థాయికి తగవు. అంతేగాక ఆయన, తన అనుంగు శిష్యుడైన యుపి ముఖ్యమంత్రి శాస్త్ర సాంకేతికతనే నమ్ముతాం తప్ప తమకు మూఢ నమ్మకాలు లేవని స్వీయ ధ్రువీకరణకు పూనుకోవడం హాస్యాస్పదం. ఆవు శ్వాసించి, కార్బన్‌ డై ఆక్సైడ్‌ కాకుండా ఆక్సిజన్‌ విడుస్తుందన్న మూఢులను వెనకేసుకొచ్చే సంఘపరివార్‌ కుదురుకు అగ్ర స్థానానవున్న పెద్దలా ఈ మాటన్నది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలు మూఢత్వంలో మునిగిపోవాలంటే శాస్త్రీయ భావాలు పెరగనివ్వరాదని వారు అధికారంలో వున్న రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాలను తిరగరాయించి బాల్యంలోనే పసి మనస్సులను కలుషితం చేస్తున్న శక్తులకు నాయకత్వం వహించేవారికి ఇలాంటి లక్షణాలుంటాయా అన్నది ప్రజల ప్రశ్న. హేతువాదులైన దబోల్కర్‌, పన్సారే, గౌరీ లంకేష్‌ తదితరుల హత్యలకు సంఫ్‌ు పరివార్‌ ఎందుకు పాల్పడిందన్నది వారి సందేహం. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ఆయన దేశంలో మూడు దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత కారణంగా సంస్కరణలు అమలు చేయలేకపోయారంటూ వినాశకర ఉదారవాద ఆర్థిక విధానాలను సమర్థించారు. ప్రస్తుతం దృఢమైన రాజకీయ సంకల్పంతో వాటిని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారేతప్ప దేశంలో పెరుగుతున్న పేదరికం, ఆర్థిక అసమానతలను, నిరుద్యోగాన్ని, అధికధరలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం దారుణం.
     కేంద్రం రాష్ట్రాల పట్ల మరీ ముఖ్యంగా తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ ప్రధాని మొహం మీదనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. హిందీలాగే మద్రాస్‌ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా మార్చాలని, ప్రాంతీయ భాషలకు గుర్తింపునివ్వాలని గట్టిగా కోరారు. మత్స్యకారులు స్వేచ్ఛగా చేపలు పట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని సూచించారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడం ప్రజల మన్ననలు పొందింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తికి సహకరించాలని, రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని, నీట్‌ నుంచి తమిళనాడు మినహాయింపునివ్వాలన్న స్టాలిన్‌ డిమాండ్‌ తమిళ ప్రజల మనోభావాల ప్రతిబింబమే! తమిళనాడు ముఖ్యమంత్రి ఇన్ని సమస్యలను వివరించినా తమిళ భాష ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందని, వారణాసి విశ్వవిద్యాలయంలో సుబ్రమణ్య భారతి పీఠాన్ని ఏర్పాటు చేశామనడం తప్ప ప్రధాని మోడీ వాటిని దాటవేయడం సబబు కాదు.
    తాము సహకార ఫెడరలిజాన్ని అనుసరిస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన బిజెపి అధికారానికి వచ్చాక రాష్ట్రాల హక్కులు, అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రానికి దఖలు పరుస్తోంది. మరోవైపు రాష్ట్రాలకివ్వవలసిన నిధులకు కోత పెడుతోంది. మోడీ రెండవసారి గద్దెనెక్కాక పరిస్థితి మరింత దిగజారడంతో అనేకమంది ముఖ్యమంత్రులు, వివిధ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల కోసం నిలదీయడం హర్షణీయం. గురువారంనాటి స్టాలిన్‌ ప్రసంగం అందులో భాగమే! ఇలాంటి వైఖరిని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీలూ చేపట్టి విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి. ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తేవాలి.