Jan 31,2021 12:36

    తెలుగు ఇండిస్టీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి, స్టార్‌ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది జాబితాలో రవితేజ ఒకడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్‌ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రవితేజ.. 'సింధూరం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ. అంతకుముందు ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. రవితేజ అనగానే అందరికీ గుర్తొచ్చేది అతని సహజ నటన ఎనర్జీ. అనేక అపజయాల తరువాత విజయం సాధించి హీరోగా నిలిచాడు. తాజాగా 'క్రాక్‌' చిత్రం విడుదలై విజయం సాధించిన సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు.

అసలు పేరు : భూపతిరాజు రవిశంకర్‌ రాజు
పుట్టిన తేదీ : 1968, జనవరి 26
పుట్టిన ప్రాంతం : జగ్గంపేట, ఆంధ్రప్రదేశ్‌.
చదువు : బి.ఎ
భార్య : కళ్యాణి తేజ
పిల్లలు : మహాధన్‌, మోక్షదా
తల్లిదండ్రులు : రాజగోపాల్‌ రాజు, రాజ్యలక్ష్మి
సోదరులు : రఘు, భరత్‌

   మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు. 1997లో కృష్ణవంశీ తీసిన 'సింధూరం'లో బ్రహ్మాజీతో పాటు సెకండ్‌ హీరోగా చేశాడు. కానీ జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి 'అన్నయ్య' సినిమాలో కలిసి నటించిన రవితేజ.. అంతకు ముందు చిరంజీవి హిందీలో నటించిన 'గ్యాంగ్‌ లీడర్‌' హిందీ రీమేక్‌ 'ఆజ్‌ కా గూండారాజ్‌'లో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. అయితే ఎంత పెద్ద స్థాయికి చేరినా ఏమాత్రం గర్వం లేకుండా ఒదిగి ఉంటారు. 'భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోను. ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవిస్తుంటా. జయాప జయాల్ని సమంగా తీసుకుంటూ ముందుకు సాగడానికే ప్రయత్నిస్తుంటా' అని హీరో రవితేజ అన్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం 'క్రాక్‌'.. ఈ నెల 9వ తేదీన విడుదలై భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా హీరో రవితేజ పంచుకున్న ముచ్చట్లు...

  • భారీ బడ్జెట్‌ సినిమాల వసూళ్ల విషయంలో యాభై శాతం ఆక్యుపెన్సీ అనేది ప్రతిబంధకమవుతుందని అనుకుంటున్నారా?

    యాభై శాతం ఆక్యుపెన్సీకి సంబంధించి నాకు ఎలాంటి భయాలూ లేవు. ఈ నిబంధన ఉన్నా సినిమాలు చూడటానికి జనాలు వస్తారనే నమ్మకముంది.

  • సంక్రాంతికి భారీ పోటీ మధ్య సినిమాను విడుదల చేయడానికి కారణమేమిటి ?

    సాధారణ సమయాలతో పోలిస్తే సంక్రాంతి సినిమాలకు మంచి సీజన్‌గా ఉంటుంది. సంక్రాంతికి సినిమాల్ని చూడటానికి అందరూ ఆసక్తిని చూపుతుంటారు. నేనూ అలానే సినిమాల్ని చూసినవాడిని. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన ఐదారు చిత్రాలు ఆడిన దాఖలాలున్నాయి. మా సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకంతోనే పోటీని పట్టించుకోవడం లేదు.

  • మాస్‌ హంగులకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ సినిమా చేసినట్లుగా కనిపిస్తోంది ?

    పక్కా కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అభిమానులకు పరిపూర్ణ విందుభోజనంలా ఉంటుంది. పోలీస్‌ క్యారెక్టర్‌ను నేను చాలా ఎంజారు చేశాను. నా శైలి వినోదం మిస్‌ కాకుండా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోగా నాకు మంచి సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. గోపీచంద్‌తో నా కలయికలో హ్యాట్రిక్‌ హిట్‌ ఇది. నిజజీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొంది యథార్థ ఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది ఏ సినిమాకూ రీమేక్‌ కాదు.

  • పోలీస్‌ పాత్రల్లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంటారు ? పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌ అనిపించుకుంటున్నారు ? ఎలా సాధ్యమైంది ?

   ఆ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు రాజమౌళిదే. 'విక్రమార్కుడు'లో విక్రమ్‌సింగ్‌ రాథోడ్‌ క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ ఎనర్జీ ప్రతి సినిమాలో కనిపించేలా శ్రమిస్తుంటా. అలాగని 'విక్రమార్కుడు'తో ఈ సినిమాకు ఎలాంటి పోలికలూ ఉండవు.

  • గత సినిమాల ఫలితాల దృష్ట్యా ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే తపనపడ్డారా ?

   సినిమాల విషయంలో నేను ఎలాంటి లెక్కలూ వేసుకోను. కమర్షియల్‌ సినిమాలే చేయాలి. ప్రయోగాత్మక కథల్ని ఎంచుకోవాలి అనుకుంటూ సినిమాలు చేయడం నచ్చదు. నాకు నచ్చిందే చేస్తుంటా. ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. సినిమా బాగుంటే అన్నీ కలిసొస్తాయి. బాగోలేకపోతే ఏదీ వర్కవుట్‌ కాదు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నేనెప్పుడూ సంతోషంగానే కనిపిస్తా. నా వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పూ ఉండదు.

  • లాక్‌డౌన్‌ విరామం ఎలా గడిచింది ?  ఈ గ్యాప్‌ నుంచి ఏం నేర్చుకున్నారు ?

   లాక్‌డౌన్‌ చాలా అద్భుతంగా గడిచింది. వర్కవుట్స్‌ చేశాను. సినిమాలు చాలా చూశాను. చూడాల్సిన కంటెంట్‌ చాలా ఉందని అర్థంచేసుకున్నా. ఐ యామ్‌ ఏ ఫ్యామిలీ మ్యాన్‌. భార్యాపిల్లలతో సంతోషంగా ఈ విరామ సమయాన్ని ఆస్వాదించా. బోర్‌గా ఫీలైన క్షణం ఒక్కటీ లేదు.

  • మీ అబ్బాయిని సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉందా ?

    మహాధన్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వాడి దృష్టి చదువుపైనే. అనిల్‌ రావిపూడి బలవంతంతోనే 'రాజా ది గ్రేట్‌'లో నటించాడు. మళ్లీ సినిమాలు చేసే ఆలోచన మహాధన్‌కు లేదు. భవిష్యత్తులో నటనను కెరీర్‌గా ఎంచుకుంటాడో లేదో తెలియదు. నేను వాడిని బలవంతపెట్టను. పిల్లల అభీష్టానికే అన్నీ వదిలేస్తాను.

  • మీ పిల్లల నుంచి ఏం నేర్చుకున్నారు ?

   మా పిల్లలిద్దరూ నాకంటే చాలా ముదుర్లు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సోషల్‌మీడియాకు సంబంధించి కొత్త విషయాల్నీ వారి నుంచి తెలుసుకుంటుంటా.

  •  సినిమాల విషయంలో మీ పిల్లలు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు ?

సలహాలు ఉచితమే కాబట్టి ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ రెడీగా ఉంటారు. మా పిల్లలకు నేను ఎలాంటి సినిమా చేసినా ఇష్టమే. కొన్ని సందర్భాల్లో వారికి నచ్చింది చెబుతుంటారు.

  • కోవిడ్‌ ప్రభావం మధ్య షూటింగ్‌ చేయడానికి భయపడ్డారా ?

    కరోనా వ్యాప్తి చెందకుండా సెట్స్‌లో భద్రతా చర్యల్ని తీసుకున్నాం. అందువల్లే ఎలాంటి భయాలూ లేకుండా షూటింగ్‌ చేయగలిగాం. మూడు వందల మంది యూనిట్‌ సభ్యుల మధ్య ఇటీవలే సెట్‌ సాంగ్‌ను షూట్‌ చేశాం. కనీస జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అవరోధాల్ని అధిగమిస్తూ సాఫీగా షూటింగ్‌లను చేసుకోవచ్చనే ధైర్యం వచ్చింది. చాలా మంది జాగ్రత్తల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నేను సెట్స్‌లో ఉంటే మాస్క్‌ ధరించకుండా ఎవరైనా కనిపిస్తే అస్సలు సహించను. మాస్క్‌ ధరించాల్సిందేనని వారికి చెబుతుంటా. రక్షణ చర్యల విషయంలో నేను జాగ్రత్తగా ఉంటా.