Jul 13,2022 20:13

వందేళ్లలో జులైలో రికార్డు స్థాయి వరద
50 లక్షల క్యూసెక్కుల వరకూ విడుదల చేసేలా అమరిక
మొదటి సీజన్‌లో సమర్థవంతంగా పని చేయడంపై అధికారుల హర్షం
ప్రజాశక్తిా పోలవరం :
జాతీయ స్థాయిలో అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి విడుదలలో స్పిల్‌వే వ్యవస్థ మొదటి సీజన్‌లోనే సమర్థవంతంగా పనిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ స్పిల్‌ వేలో అతి పెద్దవైన 48 హైడ్రాలిక్‌ గేట్లు అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్‌ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌ ఛానల్‌ మీదుగా దిగువకు విడుదల చేశాయి. పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలో ఉంది. స్పిల్‌వేలోని ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. హైడ్రాలిక్‌ పద్ధతిలో పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన గేట్లన్నింటినీ ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థవంతంగా ఉందని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. వరద నీటిని సులువుగా ఆరు కిలోమీటర్ల మేర అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌, పైలెట్‌ ఛానల్‌ మీదుగా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
వందేళ్లలో గోదావరికి రికార్డు స్దాయి వరద
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ మొదట్లోనే గోదావరి నదికి భారీ వరదలు రావడం వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచారు. స్పిల్‌వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. స్పిల్‌వేలో గతేడాది వరదల సమయానికే 48 గేట్లకుగానూ 42 రేడియల్‌ గేట్లు, వాటిని ఎత్తడానికి 84 హైడ్రాలిక్‌ సిలిండర్లనూ ఏర్పాటు చేశారు. 24 పవర్‌ ప్యాక్‌ సెట్లను స్పిల్‌వేపై అమర్చి గేట్లను ఆపరేట్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టులో రేడియల్‌ గేట్లతో పాటు డెడ్‌ స్టోరేజీ లెవెల్‌లో రివర్‌ స్లూయిజ్‌ గేట్లు ఏర్పాటు చేశారు. మొత్తం పది రివర్‌ స్లూయిజ్‌ గేట్లు, వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20 హైడ్రాలిక్‌ సిలిండర్లు, వాటిని ఆపరేట్‌ చేయడానికి పది పవర్‌ ప్యాక్‌ సెట్లు ఉన్నాయి. స్పిల్‌ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్‌ స్లూయిజ్‌ గేట్‌ ద్వారానే విడుదల చేస్తారు. వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈ గేట్ల ద్వారానే విడుదల చేశారు. రిజర్వాయర్‌లో డెడ్‌ స్టోరేజీ ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు తాగు, సాగునీరు అందించడానికి ఈ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు.
ఎక్కువ వరద నీరు విడుదల చేసే గేట్లు
చైనాలోని త్రీగార్జెస్‌ డ్యామ్‌ను 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే విధంగా డిజైన్‌ చేయగా, పోలవరం స్పిల్‌వేలో అమర్చిన 48 రేడియల్‌ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయగలిగేలా డిజైన్‌ చేసి పూర్తి చేశారు. 96 హైడ్రాలిక్‌ సిలిండర్లు, వాటిని ఆపరేట్‌ చేయడానికి 24 పవర్‌ ప్యాక్‌ సెట్లు ఏర్పాటు పూర్తి చేశారు. ఒక్కో పవర్‌ ప్యాక్‌ సెట్‌ సాయంతో రెండు గేట్లను ఆపరేట్‌ చేయవచ్చు. వందేళ్ల చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్‌వేను, గేట్లను డిజైన్‌ చేశారు. ఒక్కో రేడియల్‌ గేటు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 300 మెట్రిక్‌ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిల వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో రేడియల్‌ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లు ఆపరేట్‌ చేసే సమయంలో సాంకేతిక సమస్య వచ్చినా లేదా గేట్లకు ఏవైనా అడ్డుపడినా ముందుగా స్టాఫ్‌ లాగ్‌ గేట్లను దించి అడ్డంకులను, లేదా సాంకేతిక సమస్యలను పరిష్కరించి తరువాత రేడియల్‌ గేట్లను ఆపరేట్‌ చేసేందుకు పోలవరం ప్రాజెక్టులో ఐదు సెట్ల స్టాఫ్‌ లాగ్‌ గేట్లను ఏర్పాటు చేశారు. 17 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో వీటిని డిజైన్‌ చేశారు.