May 14,2023 11:57

నటీనటులు మొదట కమర్షియల్‌ చిత్రాలకు ప్రాధాన్యమిచ్చినా.. కొంత కాలం తర్వాత కథా బలమున్న చిత్రాలు చేసేందుకు ఇష్టపడతారు. ఏ నటీనటులకైనా మంచి గుర్తింపు వచ్చేది కథా బలమున్న చిత్రాలకే.. ప్రస్తుతం అదే ఫార్ములాని అనుసరిస్తున్నారు నటి శ్రియా సరన్‌. ఒకప్పుడు వెండితెరపై తన సత్తా చాటి, అనేక కమర్షియల్‌ చిత్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఆమె దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం సాగించారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం 'మ్యూజిక్‌ స్కూల్‌'. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు..

రెండు దశాబ్దాలుగా నట ప్రయాణం సాగిస్తున్న నటి శ్రియా సరన్‌. గతంలో స్టార్‌ హీరోల సరసన కమర్షియల్‌ చిత్రాల్లో ఆడిపాడిన ఆమె.. ప్రస్తుతం కథా బలమున్న చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు భాషా చిత్రాలతో పాటు ఇంగ్లీష్‌, మలయాళం, కన్నడ భాషలతో పాటు అనేక ఇతర భాషల్లోనూ నటించారు. 2001లో 'ఇష్టం' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 2002లో 'సంతోషం'తో మంచి కమర్షియల్‌ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'శివాజీ','అళగియ తమిళమగన్‌', 'కాంతస్వామి', 'మిషన్‌ ఇస్తాంబుల్‌', 'నువ్వే నువ్వే', 'సంతోషం', 'ఠాగూర్‌' వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. 2007లో అమెరికన్‌-ఇండియన్‌ కో ప్రొడక్షన్‌లో 'ది అదర్‌ ఎండ్‌ ఆఫ్‌ ది లైన్‌' అనే చిత్రంలో ప్రధానపాత్ర పోషించారు. అనేక భారతీయ వాణిజ్య కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ చేశారు. అంతేకాదు ఇటీవల దృష్టిలోపంతో బాధపడే కొందరికి ఉపాధి కల్పించేందుకు స్పాను కూడా ప్రారంభించారు.
అప్పుడు ఛాన్స్‌ వచ్చింది..
'చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే రచనలు, కవితలు రాసేదాన్ని.. దీంతో చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాలుపంచుకునే దాన్ని.. దీంతో డిగ్రీ చేసే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఓ సారి రామోజీ ఫిలింసిటీలో డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడే 'ఇష్టం' సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. అని చెప్పారు శ్రియ.

sriya


మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి..
'గతంతో పోలిస్తే.. సంగీతం నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపించరు. కనీసం 30 శాతం ఇష్టమున్నా సంగీతం, నృత్యాలు బాగా నేర్చుకోవచ్చు. మ్యూజిక్‌ క్లాస్‌లో సైన్స్‌, మ్యాథ్స్‌ హోమ్‌వర్క్‌ చేస్తుంటారు. వాళ్లకే కాదు తల్లిదండ్రులకు కూడా పిల్లలకు పరీక్షల్లో 99 శాతం మార్కులు రావాలని కోరుకుంటారు. పిల్లలపై ఒత్తిడి పెడుతుంటారు. సంగీతం, డ్యాన్స్‌, ఆటలు.. ఇలాంటివి జీవితంలో మీరు ఎలా ఉండాలో నేర్పిస్తాయి. పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుతాయి. మానసిక ఒత్తిడిని తీసేస్తాయి. అనుకున్నది జరగడం లేదనే నిరాశను పోగొడతాయి. కళలను నేర్పించడమే పిల్లలకు మనం ఇచ్చే పెద్ద బహుమతి అనుకోవచ్చు. నా వ్యక్తిగత అనుభవానికి వస్తే చిన్నప్పుడు నేను డ్యాన్సు నేర్చుకున్నాను. సంప్రదాయ నృత్యాల్లో నా ప్రతిభ తెలిశాక మా అమ్మానాన్న నన్ను మరింతగా ప్రోత్సహించారు' అని చెప్పుకొచ్చారు.
నచ్చింది నేర్చుకోనివ్వండి..
'ఈ చిత్రంలో తల్లిదండ్రులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాం. పిల్లల్లో తమదైన ఇష్టాలు ఉంటాయి. ఏ రంగంలో వారికి ఆసక్తి ఉందో తెలుసుకుని ప్రోత్సహించాలి. కోతిని ఈత కొట్టమంటే కొడుతుందా? అలాగే చేపను చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? ఎవరి బలాలు వారికి ఉంటాయి. అది తెలుసుకుని.. ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు చేయగలరు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇవన్నీ ఉన్నవి ఉన్నట్లు చెబితే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే దర్శకుడు పాపారావు ఈ అంశాలకు సంగీతం, వినోదాన్ని కలిపి ఒక కమర్షియల్‌ చిత్రంలా రూపొందించారు.' అన్నారు.

పేరు : శ్రియ సరన్‌ భట్నాగర్‌
పుట్టిన తేదీ : సెప్టెంబర్‌ 11, 1982
పుట్టిన ప్రాంతం : హరిద్వార్‌, ఉత్తరాఖండ్‌
నివాస ప్రాంతం : ముంబై
చదువు : బిఎ
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, రీడింగ్‌
భర్త : ఆండ్రీ కోస్చివ్‌
పిల్లలు : రాధా
తల్లిదండ్రులు : పుష్పేందర్‌ సరన్‌, నీరజా సరన్‌
తోబుట్టువులు : అభిరూప్‌ సరన్‌