Jun 21,2023 21:18

ధాన్యం తరలిస్తున్న రైతులు

ప్రజాశక్తి - జామి: ఖరీఫ్‌ ధాన్యం రవాణా, కళాసీ ఛార్జీల్లో అక్రమాల కథ కంచికేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రవాణా, కళాసీ ఛార్జీల చెల్లింపులో భారీఅవినీతి చోటు చేసుకుందని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. దీనిపై స్పందన కార్యక్రమాల్లో అనేక ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి, రైతులకు కళాసీ ఛార్జీలు చెల్లించాలని, రవాణా ఛార్జీల నమోదు ప్రక్రియపై విచారణ చేయాలని ఆదేశించారు. ఇది జరిగి నెల రోజులు కావస్తున్నా... ఒక్కరైతుకూ కళాసీ ఛార్జీలు చెల్లించిన పాపాన పోలేదు. పైగా ఫిర్యాదులు చేసిన రైతులు.. పిఎసిఎస్‌లకు వెళ్లి అడిగితే... తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న వైనం. ఇక రవాణా ఛార్జీల వ్యవహారంపై జరుగుతున్న విచారణ కథ కంచికేనని రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 2021-22 ఖరీఫ్‌ ధాన్యాన్ని ఆర్‌బికెలు, పిఎసిఎస్‌లు, పిపిసిల ద్వారా కొనుగోలు చేశారు. సుమారుగా 4.12 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. హమాలీ, రవాణా ఛార్జీలు కింద క్వింటాకు రూ.52 వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ముందుగా రైతే భరించాలని అధికారులు చెప్పడంతో రైతులే ఖర్చు చేసిన పరిస్థితి. అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం ఈ మొత్తాన్ని కొనుగోలు ఏజెన్సీలుగా ఉన్న పిఎసిఎస్‌, పిపిసిలకు జమ చేసింది. హమాలీ ఛార్జీల కింద 2021-22 కు గానూ రూ.12.06 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, పరపతి సంఘాలకు రూ.9.45 కోట్లు విడుదల చేసింది. ఈ సొమ్మును తక్షణమే రైతుల ఖాతాలకు జమ చేయాలని గత నెల 26వ తేదీన జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంత వరకు రైతులకు చెల్లించిన పాపాన పోలేదు. రవాణా ఛార్జీలకు సంబంధించి కొనుగోలు ఏజెన్సీలు నమోదు చేసిన పోర్టల్‌ ఆధారంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ అయినా, వాటిని పట్టించుకున్న నాథులే లేరని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • రూ.23 కోట్ల అక్రమాలపై ఎందుకీ ఉదాసీనత?

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి హమాలీ, రవాణా ఛార్జీలకు సంబంధించి సుమారుగా రూ.23 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేశామని, వాటిని రైతులకు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, ఫలితం లేకపోవడం గమనార్హం. ఆర్‌బికెల్లోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ నమోదు జరిగింది. రైతుల ధాన్యాన్ని వారి సొంత రవాణా వాహనం ద్వారా మిల్లుకు చేర్చారు. కానీ జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగా రైతుల వాహనాలు నమోదు చేసి, మెజారిటీ ధాన్యం ఏజెన్సీల వాహనాలు రవాణా చేసినట్లు నమోదు చేశారు. అంటే ఆదిలోనే తప్పు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల విచారణ అదేశాలు బుట్టదాఖలు అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి వెనుక పెద్దల హస్తం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఉదాసీనత నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.

  • రైతులకు తక్షణమే చెల్లించాలి

ప్రభుత్వం మాట విని హమాలీ, రవాణా ఛార్జీలు రైతులే భరించారు. తీరా ఆ డబ్బులు రైతులకు అందలేదు. ఇప్పటికైనా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల్లో బాగంగా రైతులకు తక్షణమే హమాలీ ఛార్జీలు చెల్లించాలి. రవాణా ఛార్జీల అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా విచారణ చేపట్టాలి. బినామీ వాహనాలు నమోదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- బి రాంబాబు,

  • ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శిత్వరలోనే హమాలీ ఛార్జీలు చెల్లిస్తాం

గత ఖరీఫ్‌ సీజన్‌కి సంబంధించి హమాలీ ఛార్జీలు త్వరలోనే చెల్లిస్తాం. ఇప్పటికే అన్ని సంఘాలకు ఆదేశించాం. అయితే ప్రభుత్వం నుంచి సంఘాల నిర్వహణకు నిధులు విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో రైతులకు చెల్లిస్తాం.
- రమేష్‌, జిల్లా సహకార అధికారి