Jan 10,2023 20:48
  •  కూలి పెంపుదల జిఒ విడుదల చేయాలని నిరసన

ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ : కూలి పెంపుదల జిఒను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు, గూడూరు స్టాక్‌ పాయింట్ల వద్ద ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లరు హమాలీలు అర్ధనగంగా నిరసన తెలిపారు. కర్నూలులో సివిల్‌ సప్లరు హమాలీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ మాట్లాడుతూ..లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు సంబంధించి ఇస్తున్న రూ.23ను రూ.25కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అయితే అందుకు సంబంధించిన జిఒను విడుదల చేయలేదని తెలిపారు. జిఒను విడుదల చేయాలని రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిఒను విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గొడౌన్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, రిటైర్డ్‌ అయిన హమాలీలకు పెన్షన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కర్నూలులో ఆ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు శివ , గూడూరులో ఆ యూనియన్‌ జిల్లా కోశాధికారి రాజశేఖర్‌ అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సివిల్‌ సప్లరు హమాలీలు, గూడూరులో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.