- రేగిడి మండలంలో ఏనుగులు హల్ చల్..
- భయందోళనలో ప్రజలు
- ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులు..
- గ్రామంలో 144 సెక్షన్
ప్రజాశక్తి-రేగిడి : విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని సరసనా పల్లి గ్రామం పైలవారి తోటలో ఏనుగులు శుక్రవారం తిష్ట వేశాయి. మండలంలో ఏనుగులు హల్ చల్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు తహసిల్దార్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. గత వారం రోజుల నుంచి వంగర మండలం పలు గ్రామాల్లో ఏనుగులు సంచరించడంతో గురువారం రాత్రే రేగిడి మండలంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. 8 ఏనుగులు గుంపులు, గుంపులుగా వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. అలాగే ఆయా గ్రామాల సమీపంలో ఉన్న కొన్ని తోటల్లో ఉన్న షెడ్డులను, పురిపాకలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏనుగులులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు హల్ చల్ విషయాన్ని ఆర్డీవో అప్పారావు తెలుసుకొని రేగిడి తహసిల్దార్ టీ.కళ్యాణ చక్రవర్తికి నరసనాపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించి రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో వీఆర్వో, వీఆర్ఏలను అప్రమత్తం చేసి గ్రామాల్లో టామ్ టామ్ వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగులు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని గ్రామస్థాయి అధికారులకు సూచించారు. ఏనుగులు మండలం దాటినంతవరకు ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు కోరారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రావలసి ఉంది.










