May 26,2022 06:40

ఎవరైనా ఎత్తుగా ఉంటే, వారిని ఒంటె లేదా కొంగ అని పిలుస్తారు. నల్లగా ఉంటే కర్రి వాడు అని నిందిస్తుంటారు. కాస్త ఎత్తు తక్కువ ఉన్నవారు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇక వికలాంగులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాటల్లో చెప్పనవసరం లేదు. వీరే కాకుండా తెల్ల వెంట్రుకలు ఉన్నవారు లేదా జుట్టు ఊడిపోయిన వారు నిత్యం ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. లావుగా ఉన్న వారిని కూడా కొందరు పనిగట్టుకుని హేళన చేస్తుంటారు. ఇక స్త్రీలు ఎదుర్కొనే ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భార్య మాట వింటే కొంగు చాటు కృష్ణుడని, డబ్భు ఖర్చు పెట్టకపోతే పిసినారి అని ఇలా ఎవరో ఒకరిని ఏదో ఒక పేరుతో కొందరు విమర్శిస్తూనే వుంటారు. శరీర తీరును బట్టి రకరకాల విమర్శలు ఎదుర్కొనే వారు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మన్యూనతకి గురౌతున్నారు. ఇలా చేయడాన్ని బాడీ షేమింగ్‌ అంటారు. ఇటీవల ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో కొంత మంది బాడీ షేమింగ్‌కు గురై ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఆస్ట్రేలియా వంటి దేశాలలో మనుషులను ఇతర జంతువులతో పోల్చితే అదో పెద్ద నేరం. మన దేశంలో బాడీషేమింగ్‌ కు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేకంగా చట్టాలు ఏమి లేవు. స్త్రీలు, పిల్లలు మరియు నిమ్న వర్గాల వారి హక్కులని కాపాడటానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ బాడీ షేమింగ్‌ అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూనే వుంటున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఇటువంటి ధోరణులు పెరుగుతున్నాయి. ఇక కులాల వారీగా ఇతరులకు ఇబ్బంది కల్గించే కొన్ని సామెతలు ప్రచారంలో ఉన్నాయి. వారి ఆకారాలు, స్వరాలను గేలిచేస్తూ మాట్లాడడం చూస్తూనే వున్నాం.
ప్రతి వ్యక్తిలో ఏదో లోపం ఉంటుంది. కానీ ఆ లోపాన్ని వారికి పదే పదే గుర్తు చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏ మాత్రం సభ్యత అనిపించుకోదు. చిన్ననాటి నుంచి ఎదుటివారి పట్ల సహానుభూతిని పెంచడానికి తగ్గ కృషి ఇంటి నుంచే మొదలు కావాలి. మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులకు వివరించాలి. విద్యాలయాల్లో వీటికి సంబంధించిన కౌన్సెలింగ్‌ తరగతులని ఏర్పాటు చేయాలి. తద్వారా కొంత వరకైనా ఇటువంటి ధోరణులు తగ్గుతాయి.

- యం.రాం ప్రదీప్‌
సెల్‌ : 9492712836