- సరైన వైద్యం అందక ఆర్‌టిసి ఉద్యోగుల విలవిల
- ప్రభుత్వం పట్టించుకోవాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ వారి జీవితాల్లో అనారోగ్య చీకట్లు తొలగించే పని మాత్రం జరగడం లేదు. ఆర్‌టిసిలో చాలా కాలంగా ఉద్యోగ రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. అలాగే ప్రభుత్వంలో విలీనం కాకముందు వున్న వైద్య విధానాన్ని పక్కనపెట్టి, హెల్త్‌కార్డులతో కొత్త వైద్య విధానాన్ని తీసుకురావడంతో ఆర్‌టిసి ఉద్యోగులకు సరైన వైద్యం అందక రోగాల బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆర్‌టిసిలో మొత్తం ఉద్యోగుల్లో 92 శాతం మంది రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారని ఇటీవల ఒక నివేదికలో ఆర్‌టిసి పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్‌టిసిలో మొత్తం 56,062 మంది ఉద్యోగులు ఉండాల్సి వుండగా, ఇప్పుడు 49,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లలో కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టకపోవడంతో ఆర్‌టిసిలో ఖాళీల సంఖ్య నెలనెలా పెరిగిపోతోంది. అనారోగ్యంతో మృతిచెందినా, రిటైర్డు అయినా వారి స్థానంలో కొత్త రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగింది. దీంతో ఆర్‌టిసి ఉద్యోగులకు 8 గంటల పని విధానం అనేది అందని ద్రాక్షలా తయారైంది. డ్రైవర్లు, కండక్టర్లు సగటున 10 నుంచి 11 గంటలు పని చేయాల్సి వస్తోంది. డిపోలు, వర్క్‌షాప్‌లలో వుండేవారు కూడా సగటున గంటకుపైబడి అదనంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనిభారానికి తోడు ఆర్‌టిసి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థికపరమైన అంశాలను పక్కన పెట్టేయడంతో.. ఇంటాబయట సమస్యలతో తీవ్ర ఒత్తిడితో వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బిపితో 15,004 మంది, మధుమేహంతో 13,390, ఆస్తమాతో 2,260, కేన్సర్‌తో 261, గుండె జబ్బులతో 2,363, కిడ్నీ వ్యాధితో 606, కంటి జబ్బులతో 3,562, న్యూరో జబ్బులతో 3,276, ఆర్థోతో 4,588 మంది ఉద్యోగులు బాధపడుతున్నారు. ఆర్‌టిసిలోని ఉద్యోగుల కేటగిరి ప్రకారం కండక్టర్లు 14,544 మంది, డ్రైవర్లు 17,795, మెకానిక్‌లు 1,966, ఆర్టీజెన్స్‌లో 949, హెల్పర్లు 1,120, శ్రామిక్‌లు 1,172, ఇతరులు 7,764 మంది కలిపి మొత్తం 45,310 మందికి జబ్బు చేసినట్లు ఆర్‌టిసి నివేదిక పేర్కొంది. మొత్తం 92 శాతం మంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడ్డారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. ఆర్‌టిసి ఉద్యోగులకు ప్రతి జిల్లాల్లో సొంత క్లినిక్‌లతోపాటు, విద్యాధరపురంలో మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక హాస్పిటల్ ఉండేది. ఆర్‌టిసి హాస్పిటల్స్‌లో సరైన చికిత్స లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేసేవారు. హెల్త్‌కార్డులను చాలా హాస్పిటల్స్ నిరాకరిస్తుండటంతో ఇటీవల కాలంలో వైద్యం అందక చనిపోతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇతర ఉద్యోగుల్లా కాకుండా, ఆర్‌టిసి ఉద్యోగుల పని చాలా కష్టతరమైనది. నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. అందుకే వీరిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం వుందని ఆర్‌టిసి ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసి ఉద్యోగుల అనారోగ్య సమస్యలను ప్రత్యేకంగా సమీక్షించాలని కోరుతున్నారు.










