Jun 11,2023 13:24

కొంతమంది నటీనటులకు ఆరంభంలోనే సక్సెస్‌, ఫేమ్‌ వెతుక్కుంటూ వస్తాయి. మరికొంత మంది విషయంలో మాత్రం పాపులారిటీ, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఒక హీరోయిన్‌గా ఒక స్టేజ్‌ దాటాకే వస్తుంది. ఈ రెండో కేటగిరీలోకి వచ్చే నటే హనీ రోజ్‌ వర్గీస్‌. వాస్తవానికి హనీ 2005లోనే కెరియర్‌ను స్టార్ట్‌ చేశారు. కానీ క్లిక్‌ కావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఇక ఇటీవల మమ్ముటీతో నటించిన 'మోన్‌స్టర్‌' చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. వెంటనే బాలయ్యతో నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా విజయవంతం కావడంతో రేంజ్‌ మారిపోయింది. కాగా తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, ట్రోలింగ్‌కి గురయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..!

పేరు : హనీ రోజ్‌ వర్గీస్‌
ఇతర పేర్లు : దవానీ, పొన్ను
పుట్టిన తేదీ : సెప్టెంబర్‌ 5, 1991
పుట్టిన ప్రాంతం : మూలమట్టం, ఇడుక్కి జిల్లా, కేరళ
చదువు : బిఎ
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, కుక్కింగ్‌, స్టిచ్చింగ్‌
తల్లిదండ్రులు : థామస్‌ వర్గీస్‌,
రోస్‌ వర్గీస్‌

నీ రోజ్‌ వర్గీస్‌ ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ చలనచిత్ర నటి. ఆమె తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. 14 సంవత్సరాల వయస్సులో 2005లో 'బారు ఫ్రెండ్‌' అనే మలయాళ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ చిత్రం 'ముదల్‌ కనవే' (2007), తెలుగు చిత్రం ఆలయం (2008) తో ఇతర పరిశ్రమల్లోకి ప్రవేశించారు. 2012లో విడుదలైన 'త్రివేండ్రం లాడ్జ్‌' సినిమా హనీ రోజ్‌కి మంచిపేరును సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో హనీ రోజ్‌ పాత్ర పేరు ధ్వని నంబియార్‌, ఈ సినిమా హిట్‌ అయ్యిందని తెలుసుకొని, తన స్క్రీన్‌ పేరును ధ్వనిగా పెట్టుకోవాలనుకున్నారు. కానీ 'అంజు సుందరికల్‌' సినిమా చేసేటప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హనీ రోజ్‌ 'దైవతింటే సొంతం క్లీటస్‌', 'మై గాడ్‌', 'కనల్‌', 'ఇట్టిమణి', 'మేడ్‌ ఇన్‌ చైనా', 'బిగ్‌ బ్రదర్‌', 'సర్‌ సి.పి' లాంటి చిత్రాల్లో నటించారు.
 

                                                                         అప్పట్లోనే తెలుగులో..

'ఆలయం' అనే సినిమాతో 2007లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నటి హనీ. శివాజీ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కి డిజాస్టర్‌ అయ్యింది. అలాగే ఆ తరువాత కూడా వరుణ్‌ సందేశ్‌తో ఒక సినిమా చేశారు. కానీ అది వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు. మరలా 18 ఏళ్ళ తర్వాత హనీ రోజ్‌కి తెలుగులో 'వీరసింహారెడ్డి'లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు.
 

                                                                      పెళ్లి అంటే బాధ్యత..

సినిమా ఆఫర్ల సంగతేమో కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. టాప్‌ యాడ్స్‌ బ్రాండ్స్‌ అయితే ఆమె వెనకాలే క్యూ కట్టేశాయి. ఇటీవల విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్‌కు వెళ్లిన హనీ అక్కడ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 'పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత.. వివాహ బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేసేందుకు సిద్ధమని'.. అంటూ చెప్పుకొచ్చారు.
 

                                                                   మంచి చెడులు రెండూ ఉంటాయి..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'యాక్టింగ్‌ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అందుకే 2005లోనే నేను ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చాను. సినిమాలు తప్ప నాకు మరో ప్రపంచం లేనట్టు ఉన్నాను. ఇక సామాజిక మాధ్యమాల్లో మంచి చెడులు రెండూ ఉంటాయి. అయితే కొన్ని ట్రోల్స్‌ నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మనసు నొప్పిస్తాయి. నా శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లు వాగుతుంటే ఎంతో బాధేసేది. ఇప్పుడిప్పుడే అలాంటివాటిని పట్టించుకోవడం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ టీవీ షోకు వెళ్లినప్పుడు అక్కడ నన్ను బాడీ షేమింగ్‌ చేస్తూ మాట్లాడారు. అది విని షో యాంకర్‌ పగలబడి నవ్వింది. మహిళా యాంకరే నా మీద వస్తున్న కామెంట్లు విని, నవ్వడం నాకస్సలు నచ్చలేదు. పైగా ఓ కమెడియనే నా బాడీ గురించి ఏదేదో వాగాడు. ఇలా బాడీ షేమింగ్‌ చేస్తుంటే దాన్ని టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు' అని చెప్పుకొచ్చారు హనీరోజ్‌.