- రూ. 175 కోట్లను పట్టించుకోని సర్వశిక్షా అభియాన్
- మిగిలిన వాటిని వదిలేసి కొత్త టెండర్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు అందిస్తున్న జగనన్న విద్యాకానుక కిట్లు(జెవికె)ల్లో అవినీతి చోటు చేసుకుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా పాఠశాలల్లో ఉన్న విద్యార్ధుల సంఖ్య కంటే ఎక్కువ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. విద్యార్ధులకు అందించిన తరువాత మిగిలిన కిట్లను పట్టించుకోకుండా సమగ్రశిక్షా అభియాన్ మరలా కొత్త విద్యాసంవత్సరానికి టెండర్లను పిలిచింది. 2021-22, 2022-23 విద్యాసంవత్సరాల్లో రూ.175కోట్ల విలువైన 9,28,824 కిట్లు ఏమయ్యాయో తెలియడం లేదు.
వైసిపి ప్రభుత్వం విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒకటి, ఆరో తరగతి విద్యార్ధులకు డిక్షనరీలు, బ్యాగ్, బెల్ట్, యునిఫారం, వర్క్‌బుక్స్‌ను జెవికె కిట్ల రూపంలో అందిస్తున్న విషయం తెలిసిందే. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తోంది. 2020-21లో 39,70901 కిట్లను రూ.655.60కోట్లతో విద్యార్ధులకు అందించింది. 2021-22 విద్యాసంవత్సరానికి 47,32,061 జెవికె కిట్లకు టెండర్లను పిలిచింది. దీనికోసం రూ.789.21కోట్లను ఖర్చు చేసింది. ఒక్కొ కిట్ సరాసరి రూ.1667.79లు చొప్పున కొనుగోలు చేసింది. అయితే 2021-22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్ధుల సంఖ్య 45,60,041 మాత్రమే. ఈ విద్యాసంవత్సరం 1,72,020 కిట్లు మిగిలి వున్నాయి. వాటి విలువ రూ.28.67కోట్లు. వీటిని ఏం చేశారో అధికారులు చెప్పడం లేదు. మిగిలిన కిట్లను కొత్త విద్యా సంవత్సరం 2022-23లో సర్దుబాటు చేయలేదు. 2021-22లో చేరిన విద్యార్ధులతో పాటు అదనంగా 5శాతం అంటే 2,28,002 కలుపుకుని 47,88,043 కిట్లను 2022-23 విద్యాసంవత్సరానికి కొనుగోలు చేసింది. ఈ ఏడాది సరాసరి ఒక్కొ కిట్టును రూ.2006ల చొప్పున రూ.960,48,89,384 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్ధులు 40,31,239 మాత్రమే. ఈ ఏడాది కూడా కొనుగోలు చేసిన కిట్లలో 7,56,804 మిగిలాయి. వీటి విలువ సుమారు రూ.151,81,48,824 కోట్లు.ప్రస్తుత విద్యాసంవత్సరం గతేడాది చేరిన విద్యార్ధుల సంఖ్యకు అదనంగా 5శాతం కలుపుకుని 4,23,7487 కిట్లను కొనుగోలు చేయాల్సిన విద్యాశాఖ 43,101,65 కిట్లను కొనుగోలు చేసింది. వీటికోసం రూ.1042.53కోట్లను ఖర్చు చేసింది. ఒక్కొ దానికి సరాసరి రూ.2418లు ఖర్చు అయింది. గత విద్యాసంవత్సరంలో ఇచ్చిన కిట్లు నాణ్యత లేవు. బూట్లు, బ్యాగులు విద్యార్ధులకు ఇచ్చిన రెండు నెలల్లోనే పాడయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టెండర్‌దారుల నుంచి 6,13,003 బ్యాగులను సమగ్రశిక్షా రీప్లెస్ చేయించింది. కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది కిట్ల నాణ్యత కోసమని కేంద్ర సంస్థ అయిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మొత్తం ప్రాజెక్టు ధరలో 0.5శాతం అంటే రూ.5.59కోట్లను అప్పగించింది. మిగులుతేలిన 9.28 లక్షల కిట్ల లెక్క అధికారులు ఇప్పటికైనా తేల్చుతారో లేదో !











