- శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం జరిగేనా ?
- ఇప్పటి వరకూ 1460 అర్జీలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : పోలవరం నిర్వాసితుల మాదిరిగానే ఏళ్లు గడుస్తున్నా శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం దక్కడం లేదు. సుమారు 66 గ్రామాల్లో దాదాపు లక్ష ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు కింద మునిగిపోయాయి. సాగునీరు, విద్యుదుత్పత్తి ద్వారా రాష్ట్రానికి మేలు చేసిన ఈ జలాశయం వల్ల నిర్వాసితులైన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. శ్రీశైలం వద్ద కృష్ణా నదిపై 1963లో జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని కింద సుమారు 66 గ్రామాల్లో లక్ష ఎకరాలు మునిగిపోయాయి. 1200 కుటుంబాలు భూములను కోల్పోయారు. 44 రెవెన్యూ గ్రామాలు, 22 మజరా గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. ప్యాకేజీ కింద ఎకరాకు రూ. ఐదు లక్షల పరిహారం కాని లేదా ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే నిర్వాసితులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపారు. హామీల అమలు కోసం 1982 నుంచి నిర్వాసితులు ఉద్యమాలు చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం 1986లో జిఒ నంబరు 98ను జారీ చేసింది. 1200 మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో 965 మంది అర్హులుగా ప్రకటించి.. 2012లో కేవలం 120 మందికి తాత్కాలిక పద్ధతిలో లస్కర్ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రెండో జాబితాను తయారు చేయించారు. కానీ నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2019 సెప్టెంబరు 9 నుంచి 102 రోజులు నందికొట్కూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. దీక్ష చేపట్టిన 60వ రోజున అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళ్తుండగా కారును అడ్డుకున్నారు. నిర్వాసితులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా అనిల్ కుమార్ అక్కడి నుంచి జారుకున్నారు. దీక్ష కొనసాగితే సమస్య తీవ్రతరం అవుతుందని నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ రంగంలోకి దిగారు. తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత సంఘం నాయకులకు నిమ్మరసం ఇప్పించి దీక్షను విరమింపజేశారు. అయితే ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్యాకేజీకి ఒప్పుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని వైసిపి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయితే నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షల ప్యాకేజీ మూడు సంవత్సరాలకే వస్తాయి. తాజాగా 2022 డిసెంబర్‌లో మంత్రి అంబటి రాంబాబును కలిసి వినతిపత్రం కూడా అందజేశారు.

ఇన్ని అర్జీలు ఎవరూ ఇచ్చి ఉండరు
శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చేలా 1986లో జిఒ 98ను ప్రభుత్వం ఇచ్చింది. న్యాయం చేయాలని ఇప్పటి వరకూ 1460 అర్జీలు వివిధ స్థాయి అధికారులకు ఇచ్చాం.అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయాలి.
- నారాయణ రెడ్డి, శ్రీశైలం నిర్వాసితుల నిరుద్యోగ సంఘం అధ్యక్షులు










