Aug 03,2023 08:03
  • పోరాటాలకు కార్మికులు సిద్ధం

బెర్లిన్‌ : పాసింజర్‌ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌లో కార్మికులు, కంపెనీ యాజమాన్యంతో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున కోతలు విధించాలని, పని పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. వేసవి శలవులు ముగిసేలోగా తన ప్రణాళికలను అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది. వర్క్స్‌్‌ కౌన్సిల్‌తో కలిసి పనిచేస్తున్న విడబ్ల్యు యాజమాన్యం పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణకు, విస్తృత స్థాయిలో ఉద్యోగాల్లో కోతలకు సన్నద్ధమవుతోంది.
ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు బాగా క్షీణించడంతో కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. టెస్లా నుండి, చైనా, ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థల నుండి బలమైన పోటీ వున్న నేపథ్యంలో అమ్మకాలు బాగా పడిపోయాయి. దీనికి తోడు, ఇన్వెస్టర్ల నుండి కూడా తమ లాభాలను ప్రస్తుతమున్న మూడు శాతం నుండి 9శాతానికి పెంచాలని డిమాండ్‌ వస్తోంది. దీంతో, కార్మిక శ్రమ శక్తిని దారుణంగా దోపిడీ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఈ దిశగా ఇటీవలి వారాల్లో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. విడబ్ల్యు బ్రాండ్‌ భవితవ్యం పణంగా పెట్టబడుతోందని విడబ్ల్యు కంపెనీ బాస్‌ థామస్‌ షెఫర్‌ ప్రకటించారు. ఇది తుది మేల్కొలుపు అని, ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే పరిస్థితి చేయి దాటుతుందని హెచ్చరించారు. ఈ బ్రాండ్‌ లాభదాయకంగా వుండాలంటే ఉత్పత్తి క్రమాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సి వుందన్నారు.