Jul 19,2023 07:29
  •  రేషనలైజేషన్‌కు లింక్‌
  •  నిరాశలో వ్యవసాయ అనుబంధరంగాల ఉద్యోగులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధరంగాల ఉద్యోగుల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రభుత్వం వీరి బదిలీలకు రేషనలైజేషన్‌కు లింక్‌ పెట్టడంతో ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొంత కాలం బదిలీల ప్రక్రియ నిలిచిపోయినట్లేననే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఫలితంగా వ్యవసాయ అనుబంధరంగాలకు చెందిన అగ్రికల్చర్‌, హార్టికల్చల్‌, సెరీ కల్చల్‌, ఫిషరీష్‌, యానిమల్‌ హజ్‌బెండరీ అసిస్టెంట్లకు సంబంధించిన బదిలీలకు ప్రక్రియ నిలిచిపోవడంతో ఆయా ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. తమ తోటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యిందని తమకు మాత్రమే రేషనలైజేషన్‌తో లింక్‌ పెట్టడంతో బదిలీల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో? ఒక వేళ బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే పక్షంలో ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొని ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వ్యవసాయ విస్తీర్ణం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం, మరి కొన్ని ప్రాంతాల్లో విస్తీర్ణం తక్కువగా ఉండటంతో సిబ్బంది కొన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని సర్దుభాటు చేయకుండా బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తే పాలన గాడి తప్పే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తే పని భారం ఉన్న సచివాలయాలకు సిబ్బందిని సర్ధుబాటు చేయడం, పని భారం తక్కువగా ఉన్న సచివాలయాలకు సిబ్బందిని కుదించే ప్రక్రియ తొలుత చేపట్టాలని ప్రభుత్వం, గ్రామ వార్డు సచివాలయాల శాఖ భావిస్తోంది. ఇది ఇలా ఉంటే సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం జాయిన్‌ అయిన వారు, కుటుంబాలకు దూరంగా ఉన్న వారు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు బదిలీల కోసం సుమారుగా 1500 మంది ఉంటారని ఓ అంచనా.

రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే బదిలీలు : గ్రామ వార్డు సచివాలయాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్ జైన్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగుల బదిలీలు రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే ఉంటాయని గ్రామ వార్డు సచివాలయాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజరుజైన్‌ తెలిపారు. బదిలీల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.