Jul 01,2023 10:59
  • 2022-23లో రూ.17.55 లక్షల కోట్ల లోటు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రతిసారీ రాష్ట్రాలు చేసే అప్పులపై సుద్దులు చెప్పే కేంద్రం మాత్రం భారీ స్థాయిలో అప్పులు చేస్తోంది. ఆదాయం కన్నా వ్యయం భారీగా నమోదుకావడం, అరదులో పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉండడం కూడా సుస్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా రిజర్వ్‌బ్యాంకు నుంచి వచ్చిన పత్రాలు గమనిస్తే.. 2022- 23 ఆర్థిక సంవత్సరంలోనే కాదు... తాజాగా ఆర్థిక సంవత్సరంలోని తొలి నెల్లో కూడా అప్పుల కుప్పగానే కనిపిస్తోంది. 2022-23లో రూ.24 లక్షల కోట్లు వరకు ఆదాయం సమకూరింది. వ్యయం మాత్రం ఏకంగా రూ.42 లక్షల కోట్ల వరకు ఉండడం గమనార్హం. దాదాపు రూ.17 లక్షల కోట్ల వరకు లోటుగా రిజర్వ్‌బ్యాంకు చూపించింది. ఈ మొత్తాన్ని రుణాల రూపేణా సమీకరించి పలు అవసరాలకు ఖర్చు చేసినట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ద్రవ్య లోటు, ఆదాయ లోటు కూడా ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రూ.1.33 లక్షల కోట్లు లోటుగా నమోదైంది. ఈ తొలి నెల్లోనే మొత్తం ఆదాయం రూ.1.70 లక్షల కోట్లు రాగా, వ్యయం రూ.3.04 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. దీంతోనే భారీ లోటు కనిపించింది. ఒకవైపు కేంద్ర ఆర్థికశాఖ ద్వారా, మరోవైపు కాగ్‌, ఇంకొకవైపు రిజర్వ్‌బ్యాంకు వంటి కేంద్ర సంస్థల ద్వారా రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం జరుగుతోంది. అప్పులు తగ్గించుకోవాలంటూ ప్రతినెలా రిజర్వ్‌బ్యాంకు, కాగ్‌ల నుంచి రాష్ట్రాలకు లేఖలు అందుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం చేస్తున్న అప్పులు మాట ఏమిటంటూ రాష్ట్రాల ఆర్థికశాఖ అధికారుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవు తున్నప్పటికీ, బాహాటంగా కేంద్రానికి చెప్పలేని పరిస్థితి అధికారుల్లో నెలకొంది.
 

కేంద్ర ఆర్థిక వార్షిక వివరాలు (రూ.కోట్లలో)
విభాగం 2022-23 2023-24 (ఏప్రిల్‌)
ఆదాయం 24,31,913 1,70,501
వ్యయం 41,17,232 3,04,096
ఆదాయ లోటు 11,10,546 55,780
ద్రవ్యలోటు 17,55,319 1,33,595