Jun 30,2023 10:39
  • సిబ్బంది కొరతే కారణం.. వైద్యాధికారుల ఖాళీలు అధికం : ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆందోళన

న్యూఢిల్లీ : భారత్‌లోని జైళ్ళలో ఖైదీల మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌హెచ్‌ఆర్‌సి) 2000 ఏడాది నుంచి ప్రతి ఏడాదీ చివరలో భారతీయ జైళ్లలో సంభవించే మరణాలపై సమాచారాన్ని ప్రచురిస్తుంది. ఇది జైళ్లలో మరణాలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న ఏకైక సమాచారం. అయితే ఇలాంటి మరణాలకు అడ్డుకట్ట వేయటంలో ప్రభుత్వాలు మాత్రం తగిన శ్రద్ధను చూపటం లేదు. మరణాలను ఆపటం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) పలు సలహాలను, సూచనలను చేసింది. ఖైదీల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో వైద్యాధికారులు, సిబ్బంది కొరతను లేవనెత్తింది. నిఘాను పెంచాలని సూచించింది.
 

                                                               మానసిక ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యలు

సహాజ, అసహజ మరణాల కింద ప్రతి ఏడాదీ భారతీయ జైళ్లలో 1800 మంది చనిపోతున్నారు. 2021లో ఈ సంఖ్య పెరిగి 2116కు చేరింది. భారతీయ జైళ్లలో భయంకరంగా పెరుగుతున్న ఈ మరణాలకు అడ్డుకట్ట వేయటం కోసం 21 పేజీలతో కూడిన సలహాలతో ఎన్‌హెచ్చార్సీ ముందుకొచ్చింది. ఈ సలహా ఖైదీల స్వీయ-హానీ, ఆత్మహత్యాయత్నాలను తగ్గించే మార్గాలపై దృష్టి పెడుతుంది. జైళ్లలో జరిగే ఆత్మహత్యలు.. వైద్యపరమైన, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఉత్పన్నమవుతున్నాయనే విషయాన్ని నొక్కి చెప్పింది. జైళ్లలో సిబ్బంది సంఖ్యను పెంచాలనీ, సిబ్బందికి తగిన శిక్షణను ఇవ్వాలని కోరింది. జైలులో ఉన్న వ్యక్తులను ప్రవేశస్థాయిలో పరీక్షించాలనీ, జైళ్లలో ఆత్మహత్యలను తగ్గించడానికి సహకార ఫ్రేమ్‌వర్క్‌తో పాటు 'అధిక ప్రమాదం' ఉన్న ఖైదీల పర్యవేక్షణకు ఇది సూచించింది. కాగా, ఇదే సలహాను ఎన్‌హెచ్‌ఆర్‌సి 2014లోనూ ఇచ్చింది. అయితే, దశాబ్ద కాలంలో ఈ మరణాలు తగ్గుముఖం పట్టకపోవటం గమనార్హం. దీంతో ఈ సారి మరింత సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేయాలన్న ఒత్తిడి కమిషన్‌పై పెరిగింది.
 

                                                                  ఉన్న సిబ్బందిపై పని భారం

ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇచ్చిన సలహాలో ప్రధానమైనది సిబ్బంది కొరత. 2021 ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1319 జైళ్లలో వైద్య అధికారుల కోసం మొత్తం మంజూరైన స్థానాల సంఖ్య 3,497గా ఉన్నది. దీంతో సగటున రోజువారీన ఒక్క వైద్య అధికారికి 122 మందికి పైగా ఖైదీలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, ప్రస్తుతమున్న మెడికల్‌ అధికారుల సంఖ్య 2080 కాగా.. ఒక్కో ఆఫీసర్‌కు 276 మంది ఖైదీల ఆరోగ్య సంరక్షణను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దీంతో అధికారులు, సిబ్బందిపై పని భారం పెరుగుతున్నది.
 

                                                                 బయటి ఆస్పత్రులకు ఖైదీలు

జైళ్లలో వైద్యాధికారులు లేకపోవటంతో ఖైదీలను తరచూ బయటి ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం.. 2021లో 4,36,732 మంది ఖైదీలను బయటి ఆస్పత్రులకు తీసుకెళ్లారు. జైలులో సంభవించే మరణాలలో దాదాపు అన్నీ సహజ మరణాలుగా పేర్కొనబడుతున్నాయి. మొత్తం ఖైదీలలో 9,180 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆత్మహత్యలను ఎదుర్కోవడానికి మరిన్ని సిసిటివిలు, ఖైదీలపై 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్చార్సీ సూచించింది.