Jun 30,2023 11:14
  • నిర్వాసిత గ్రామాలు, పునరావాస కాలనీల్లో దుర్భర పరిస్థితి
  • ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే గుణపాఠం తప్పదు
  • రెడ్డిగణపవరం సభలో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం : 'ముంపు గ్రామాల్లో తిరిగాం.. పునరావాస కాలనీలను చూశాం.. తాగడానికి నీరు లేదు.. బతకడానికి ఉపాధి లేక పోలవరం నిర్వాసితులు దుర్భర జీవనాన్ని అనుభవిస్తున్నారు' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై చేపట్టిన పోలవరం పోరుకేక పాదయాత్ర గురువారం పదో రోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కొరుటూరు పునరావాస కాలనీలో ప్రారంభమైంది. ములగలంపల్లి, రౌతుగూడెం, రెడ్డిగణపవరం మీదుగా బుట్టాయగూడెం వరకు సాగింది. ఈ సందర్భంగా రెడ్డిగణపవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని విమర్శించారు. నిర్వాసితులను బలవంతంగా తరలించడం దుర్మార్గమన్నారు. వసతులు లేని పునరావాస కాలనీల్లో నిర్వాసితులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, డ్రెయినేజీ వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్న నిర్వాసితులకు కనీస చిరునామా కూడా కరువైందని తెలిపారు. కొందరు నిర్వాసితులు పునరావాస కాలనీలకు వచ్చినప్పటికీ గతంలో నివాసం ఉన్న గ్రామ చిరునామాతో ఉంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన ప్రతి పైసా ముందుగా నిర్వాసితులకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టప్రకారం భూమికి భూమి, పరిహారం, నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతామని నిర్వాసితులు చెప్పడం ప్రభుత్వాలకు చెంప పెట్టని అని అన్నారు. సమస్యలను వెల్లడిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని నీచమైన బెదిరింపులు చేయడం తగదన్నారు. 'నేను కన్నాను.. విన్నాను' అంటూ జగన్‌ చెబుతున్నారని, అయితే పోలవరం నిర్వాసితుల సమస్యలపై కళ్లుండి చూడని కబోదిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం ఇస్తారో.. గోదావరిలో ముంచుతారో తేల్చాలని అన్నారు. కక్కలేక మింగలేక నిర్వాసితులు బాధపడుతున్నారని అన్నారు. సామాన్యులు చెబితే వినపడదా.. కాంట్రాక్టర్ల మాటలే వింటారా అని మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో జగన్‌ నిర్వాసితుల గోడు పట్టించుకోలేదని, బిల్లులు రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని అన్నారు. వేల కోట్ల పోలవరం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబానీ, అదాని భజన చేస్తూ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్లిన రాముడు పుట్టిన గడ్డపై ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 జిల్లాల ప్రజలకు మేలు చేయడానికి లక్షా ఆరువేల మంది నిర్వాసిత కుటుంబాలు సర్వం కోల్పోయాయని తెలిపారు. గతేడాది గోదావరి వరదలకు 196 గ్రామాలు మునిగిపోతే కేవలం 36 గ్రామాలకు వరద ముంపు ఉందని కాకి లెక్కలు చెబుతున్న ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లను మారుస్తూ వేల కోట్లు ఖర్చు చూపుతున్న ప్రభుత్వాలకు సిగ్గులేదన్నారు. కాంటూరు, డ్యామ్‌ డిజైన్లు అన్నీ పనికిమాలిన చెత్తగా అభివర్ణించారు. ముంపునకు గురైన నిర్వాసితులకు రూ.పది వేలు పరిహారం చెల్లిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ మాట తప్పారని ఎద్దేవా చేశారు. భూమికి భూమి ఇవ్వాల్సిన ప్రభుత్వం వివాదాస్పద భూములను నిర్వాసితులకు కట్టబెట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు. భూములకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని మాట తప్పారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని నిర్వాసితులకు సూచించారు. నిర్వాసిత కాలనీలో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారని అన్నారు. మోడీ ఉపాధి చట్టాన్ని తీసివేస్తే ప్రజలు ఇంటికి పంపుతారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పోరుకేక మహాపాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయన్నారు. అధికారం కోసమో.. రాజకీయ లబ్ధి కోసమో కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న సిపిఎం పాదయాత్రను జయప్రదం చేయాలని అన్నారు. జులై 4న నిర్వాసితుల సమస్యలపై నిర్వాసితులంతా విజయవాడ తరలిరావాలని పిలుపునిచ్చారు. 95 శాతం హామీలు పూర్తి చేసినట్లు జగన్‌ చెబుతున్నారని, నిర్వాసితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తి చేయలేదని అన్నారు. ఈ ఆరు నెలల్లో హామీల అమలు పూర్తి చేయకపోతే జగన్‌ ఇంటిదారి పట్టాల్సిందే అన్నారు. ఈ సభకు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌సింగ్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, కె.సుబ్బరావమ్మ, సిపిఎం నాయకులు బి.బలరాం, ఎ.రవి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు ప్రసన్నకుమార్‌, మొడియం నాగమణి, వాణిశ్రీ, పిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.