కెరీర్‌లో ఎంతో సక్సెస్ అయినా కూడా ఒక సమయం తర్వాత సడెన్‌గా స్క్రీన్ మీద కనిపించకుండా మాయమైపోతారు కొందరు హీరోయిన్లు.. ఇది తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. ఇతర భాషల ఇండిస్టీల్లో కనిపిస్తుంది. అలా కనుమరుగైన చాన్నాళ్లకు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించిన నటీమణులూ చాలామంది ఉన్నారు. నటనమీదున్న ఇష్టమే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమనేది వాస్తవం.. తాజాగా ఒక తమిళ సీనియర్ నటి కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమే శ్రియారెడ్డి. తాజాగా పవన్ కల్యాణ్ 'ఓజీ'లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన ఆసక్తికర విశేషాలు..
పేరు : శ్రియారెడ్డి
పుట్టిన తేదీ : నవంబర్ 28, 1983
పుట్టిన ప్రాంతం : చెన్నరు
చదువు : గ్రాడ్యుయేషన్
భర్త : విక్రమ్ క్రిష్ణ
పిల్లలు : అమాలియా రెడ్డి
తల్లిదండ్రులు : భరత్ రెడ్డి, గీతాంజలి రెడ్డి
శ్రియారెడ్డి.. ఈ పేరు వినగానే హీరోయిన్ ఎవరో చాలామంది ప్రేక్షకులకు టక్కున గుర్తురాకపోవచ్చు. ఎందుకంటే ఆమె సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. కెరీర్ మొత్తంలో కమర్షియల్‌గా సక్సెస్ అయిన సినిమాల కంటే కథాపరంగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలే ఎక్కువ. విశాల్ హీరోగా తెరకెక్కిన 'తిమిరు' చిత్రంలో శ్రియా విలన్‌గా నటించారు. ఈ చిత్రం 'పొగరు' అనే టైటిల్‌తో తెలుగులో అనువాదం అయ్యింది. ఇందులో శ్రియా నటనను ఇప్పటికీ చాలామంది లేడీ విలన్స్ ఇన్సిపిరేషన్‌గా తీసు కుంటున్నారు. ఆ తర్వాత 'అమ్మ చెప్పింది' సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేసి, విశాల్ సోదరుడ్ని పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమైపోయారు.
దాదాపు దశాబ్దం పాటు ఇండిస్టీలో ఉన్నా.. శ్రియా నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇక తమిళంతో పోల్చుకుంటే తెలుగులో తను చేసిన సినిమాలు కేవలం రెండే. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ల సినిమాలతో రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'సలార్'లో శ్రియా ఒక కీలకపాత్ర పోషించారు. తాజాగా పవన్ కల్యాణ్‌తో యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న 'ఓజీ' చిత్రంలో శ్రియారెడ్డి కూడా నటిస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. కాగా ఇటీవల 'సుజల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.
ఆకట్టుకునే ఆఫర్‌లు రాలేదు..
'కాంచీవరం సినిమా తర్వాత పెళ్లి చేసుకుని నటించడం మానేశాను. నటనకు స్వస్తి చెప్పాలనే నిర్ణయం తీసుకోకపోయినా ఆకట్టుకునే ఆఫర్‌లు రాలేదు. ఇక రచయిత్రి పాత్రలు ఉన్న సినిమాలు చేశా. ఆ తర్వాత అవీ కుదరలేదు. ఇక వివాహం తర్వాత, విక్రమ్, విశాల్‌లను సంప్రదించడానికి దర్శకులు భయపడ్డారు. మా ఆఫీసులో చుట్టూ తిరిగే కొంతమంది తరచూ ''మేడమ్ ఈజ్ నాట్ రీచ్బుల్'' అని ప్రతికూల సమాధానం పొందారు. నేను చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని గ్రహించాను' అని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు బాగా సన్నిహితంగా ఉండే సుహాసిని మణిరత్నం 'నీ కలలను అనుసరించు. నీ నటనను వదిలిపెట్టవద్దు, తర్వాత మీరు పశ్చాత్తాపపడతారు' అని ఒప్పించినట్లు తెలిపారు.
ఫిట్‌నెస్ ఉన్మాదిని..
'స్నేహితుల సలహా మేరకు కుటుంబం, నిర్మాణ వ్యాపారాలను చూసుకోవడం ప్రారంభించాను. కానీ నా మనసు ఎప్పుడూ నటనపైనే ఉంది. అదృష్టవశాత్తూ చాన్నాళ్లకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఇక నేను మాజీ టెస్ట్-క్రికెటర్ కుమార్తెను కావడంతో పాఠశాల స్థాయి నుంచి అథ్లెటిక్‌గా ఉన్నాను. అందుకే 'నేను ఫిట్‌నెస్ ఉన్మాదిని' నా జీవితం కూడా ఫిట్‌గా ఉండాలనుకుంటా. నా కుమార్తె అమాలియాను ప్రసవించిన రోజు 20 నిమిషాలు నడిచాను అంటే నమ్ముతారా? కేవలం మూడు నెలల్లో నేను తిరిగి ఫిట్ అయ్యాను. మా కుటుంబంలో ఆరుగురికీ ఫిట్‌నెస్ పాఠాలను అందిస్తాను' అని చెప్పారు.