- అఫిడవిట్‌లో అంశాలనే అప్పజెప్పిన వైనం
- కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు
న్యూఢిల్లీ : త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్య ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి పౌర స్మృతి పేరుతో మత విద్వేషాలను రగిల్చే యత్నం చేశారు. మంగళవారం భోపాల్‌లో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో న్యాయమంత్రిత్వశాఖ వేసిన అఫిడవిట్‌లోని అంశాలనే మక్కీకి మక్కీగా వల్లెవేశారు. కొద్ది నెలల కిందట సుప్రీం కోర్టులో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన అఫిడవిట్ వివిధ మతాలు, వివిధ తెగలకు చెందిన పౌరులు వివిధ ఆస్తి, వివాహ చట్టాలను పాటించడం జాతి ఐక్యతకు భంగకరమని పేర్కొంది. దానినే మోడీ చిలుక పలుకుల్లా వల్లించారు. సుప్రీం కోర్టు మతానికి, రాజకీయాలకు సంబంధం ఉండరాదని స్పష్టంగా పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులకు ఆయన తనదైన శైలిలో వక్ర భాష్యాలు చెప్పారు. తనకు అనుకూలమైన అంశాలను మాత్రమే తీసుకుని అదే కోర్టు తీర్పు అన్నట్టుగా నమ్మబలికే యత్నం చేశారు. ఇటీవల న్యాయమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన పౌరులకు యుసిసి వుండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుందని, అందుకోసం ప్రయత్నించాలని రాజ్యాంగంలోని 44వ అధికరణ పేర్కొందని చెప్పింది. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి కృషి చేయాల్సిందిగా 2019లో, సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి సూచించింది. 1956లో హిందూ చట్టాన్ని క్రోడీకరించినప్పటికీ తన పౌరులకు యుసిసిని సాధించడంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు విఫలమవడాన్ని ప్రస్తావించింది. 1985లో షా బానో కేసులో ఈ కోర్టు ప్రబోధించినప్పటికీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి చేసిందేమీ లేదని కోర్టు పేర్కొంది. భరణం పొందేందుకు ముస్లిం మహిళలకు గల హక్కును సమర్ధించిన షా బానో కేసు యుసిసి అమలు దిశగా ఒక ముందడుగుగా పరిగణించబడింది.
''ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాల గురించి తెలిపే రాజ్యాంగంలోని 44వ అధికరణలో నాల్గవ భాగం వ్యవస్థాపకులు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని ఆశించారు, భావించారు. కానీ ఇందుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యతీసుకోలేదు.'' అని సుప్రీం కోర్టు జోస్ పాల్ కౌంటినో తీర్పులో వ్యాఖ్యానించింది.
యుసిసి అమలును పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగం కింద రాష్ట్ర ప్రభుత్వానికి గల అధికారాన్ని ఇటీవల సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ నిర్ణయం, యుసిసిపై తన స్వంత కమిటీని వేసేందుకు బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యకు సవాలుగా మారింది.
యుసిసి గురించి నొక్కి చెబుతూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాలను, వ్యాఖ్యలను ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. యుసిసికి సంబంధించిన కార్యాచరణలో జాప్యానికి ప్రతిపక్షాల ఓటు బ్యాంక్ రాజకీయాలే కారణమని విమర్శించారు.
అయితే, ''మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని మిళితం చేయడం'' గురించి కూడా సుప్రీం కోర్టు, ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో హెచ్చరించింది.
''మతాన్ని, ప్రభుత్వ అధికారంతో మిళితం చేయడానికి రాజ్యాంగం అనుమతించదు, పైగా గుర్తించదు కూడా. ఆ రెండు అంశాలు విడివిడిగా వుండాలి. అది రాజ్యాంగ నిషేధం. ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని పాలించినంత కాలమూ ఎవరూ మరో రకంగా చెప్పలేరు. రాజకీయాల్లోకి మతాన్ని ప్రవేశపెట్టడమంటే శరీరంలోకి అనుమతి లేని అంశాన్ని ప్రవేశపెట్టడమే కాగలదు. ఇది, మన రాజ్యాంగ వ్యవస్థను అసమతుల్యం చేస్తుంది.'' అని 1994 నాటి తీర్పు పేర్కొంది.
కేవలం ప్రభుత్వమే కాదు, రాజకీయ పార్టీలు కూడా తమ ఆలోచనా విధానంలో, కార్యాచరణలో లౌకికవాద ధోరణితో వ్యవహరించాల్సి వుందని రాజ్యాంగ ధర్మాసనం నొక్కి చెప్పింది. ''అధికారాన్ని సాధించేందుకు లేదా పంచుకునేందుకు రాజకీయ పార్టీలనేవి ఏర్పడ్డాయి. అదే వారి లక్ష్యంగా వుంటుంది. రాజకీయ పార్టీలు లేకుండా ప్రభుత్వ ప్రజాస్వామ్య స్వరూపాన్ని ఎవరూ ఊహించలేరు. అవి రాజకీయ వ్యవస్థలో, రాజ్యాంగ పథకంలో భాగంగా వున్నాయి. లేదా ప్రజాస్వామ్య సమాజం యొక్క పాలనలో అంతర్భాగంగా వున్నాయి. ప్రభుత్వం తన ఆలోచనా తీరులో, కార్యాచరణలో లౌకికవాదంతో వుండాల్సి రావడం రాజ్యాంగానికి అవసరమైతే, అదే అవసరం రాజకీయ పార్టీలకు కూడా వుంటుంది.'' అని బొమ్మైకేసులో సుప్రీం స్పష్టంగా పేర్కొంది.










