- టిఎఫ్‌సిసి నూతన అధ్యక్షుడు దిల్‌రాజు
తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చేలా కృషిచేస్తామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టిఎఫ్‌సిసి) నూతన అధ్యక్షుడు దిల్‌రాజ్ (వెలమకుశ వెంకటరమణారెడ్డి) చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఎఫ్‌సీసీ ఎన్నికల్లో ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్‌పై 17 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాసు, కాకినాడ శ్రీనివాస్, కొల్లి రామకృష్ణ, కార్యదర్శిగా దామోదరప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు (2023-25) పదవిలో కొనసాగనుంది. ఈ విజయం అనంతరం దిల్‌రాజు స్పందిస్తూ ఇవి రాజకీయ ఎన్నికలు కావని.. సినిమా అనేది వ్యాపారమని ఇక నుంచి అందరం కలిసి పని చేసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీ మేరకు మొదటిగా నిర్మాతలకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ)లో కేవలం నిర్మాతల మండలి మాత్రమే ఉంటుందన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో నాలుగు విభాగాలు ఉంటాయన్నారు. తెలుగు పరిశ్రమ పూర్తిగానూ, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో, ప్రొడ్యూడర్స్ ఉంటారన్నారు. అందరం సమన్వయంతో పనిచేయటం ద్వారా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తామన్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత తెలుగు పరిశ్రమ స్థాయికి ఎదిగిందన్నారు. మరింత ఖ్యాతి రావటానికి నిర్మాతల మండలిగా కృషిచేస్తామన్నారు. పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా సినిమా నిర్మాతలకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు వచ్చేలా కృషిచేస్తామన్నారు. తెలుగు సినిమాల్లో ఇటీవలకాలంలో చిన్న సినిమాల్లో కొత్త ట్రెండ్ వస్తోందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించటానికి ఇప్పటికే ఐదుగురితో కమిటీని నిర్ణయించామన్నారు. త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాబోయేకాలంలో మరిన్ని కొత్త తరహా సినిమాలు వచ్చేలా కృషిచేయటానికి కృషిచేస్తామన్నారు. ఆ దిశలో కొత్తగా పరిశ్రమలోకి వచ్చే నిర్మాతలు, దర్శకులు, హీరోలు, రచయితలు ఇలా అందరినీ ప్రోత్సహించటానికి కృషిచేస్తామన్నారు.