Jun 23,2023 21:50

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :చిరు ధాన్యాలు సాగు చేసే రైతులకు బంగారు భవిష్యత్తు ఉందని, పుష్కలమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని సిఎసిపి (వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్‌) చైర్మన్‌ ప్రొఫెసర్‌ విజరుపాల్‌ శర్మ అన్నారు. వాటిని పండించే రైతులకు అన్ని విధాలుగా సహకరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌ రబీ పంటల ధరల విధాన రూపకల్పనలో భాగంగా విశాఖపట్నం వేదికగా ది పార్కు హోటల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్‌ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు శుక్రవారం జరిగింది. సదస్సులో ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వ్యవసాయ కమిషన్ల ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గన్నారు. సదస్సులో సిఎసిపి చైర్మన్‌ విజరు పాల్‌ శర్మ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను భేరీజు వేసుకొని, ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను, ప్రతినిధుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ధరలను నిర్ణయించేందుకు కేంద్రానికి సిఫార్సులు చేస్తామని తెలిపారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, స్థానిక మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నివేదిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. సాధారణ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు మళ్లేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మిల్లెట్లు పండించే రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల తరుపున స్థానిక డిమాండ్లను రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌.నాగిరెడ్డి ధరల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పంటల సాగులో అవుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయించాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో సరైన విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, లేదంటే రైతులు, ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఆయన ఆన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.