Jun 28,2023 09:58
  • పలు నగరాల్లో రూ.100 దాటిన టమాట
  • పచ్చి మిరప, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం ధరలూ పైపైకే
  • కోడి గుడ్డు రూ.ఏడు పైమాటే

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు సలసల మండుతున్నాయి. ప్రతి ఇంటా సాధారణంగా వినియోగించే అన్ని రకాల కూరగాయలు కిలో రూ.100కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే టమాట ధర రూ.100కు మించిపోయి కిందకు దిగనంటోంది. క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం ధరలు సైతం కొండెక్కాయి. ఒక ఉల్లి మాత్రమే ఊరటనిస్తోంది. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్‌, కొల్‌కతా, ముంబయి ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ కూరల ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా ఆషాఢం మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో కూరగాయల ధరలు బాగా తగ్గిపోతాయి. కానీ ఈ ఏడాది మాత్రం కూరగాయలు సామాన్యులకు పెనుభారంగా మారుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో కురవాల్సినంతగా వర్షాలు పడకపోవడం, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో బిపర్‌జోరు తుఫాను కారణంగా పైర్లు దెబ్బతినడం వల్ల సరుకు తగ్గిపోవడం ఆషాడంలో కూరగాయల ధరాఘాతానికి ప్రధాన కారణంగా మార్కెట్‌ నిపుణులు తెలియజేస్తున్నారు.
 

                                                                         విజయవాడలో ..

రాష్ట్రంలో సైతం పచ్చి మిరప, టమాట ధరలు ఆకాశాన్నంటాయి. విజయవాడ మార్కెట్‌లో మంగళవారం నాడు కిలో పచ్చి మిర్చి ధర రూ.120, అల్లం రూ.220, టమోటా కిలో రూ.50 నుంచి మేలు రకం టమాట రూ.100 వరకు పెరిగాయి. వంకాయ, బెండకాయ, క్యారెట్‌ తదితర కూరగాయల ధరలు కూడా రూ.80 వరకు పలికాయి.
 

                                                                           బెంగళూరులో..

శ్రీ కర్ణాటకలోని కోలార్‌ టోకు ధరల ఎపిఎంసి మార్కెట్‌లో 15 కిలోల క్రేట్‌ టమాటాల ధర ఈ నెల 26న రూ.1100 పలికింది. ఆ మరుసటి రోజు 27న రూ.1500కు ఎగబాకింది. గతేడాది బీన్స్‌ ధరలు ఆకాశాన్నంటడంతో రైతులు టమాట బదులుగా బీన్స్‌ సాగు వైపు మళ్లారని, దీంతో టమాట మార్కెట్‌లోకి రావాల్సినంత రావడం లేదని కోలార్‌కు చెందిన రైతు ఒకరు తెలిపారు. వర్షాలు కూడా తగినంత మోతాదులో కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయయని, దీంతో టమాట ఉత్పత్తి తగ్గిపోయి మార్కెట్‌కు రావడం లేదని, డిమాండ్‌ పెరిగి ధరలు పెరిగిపోయాయని సదరు రైతు విశ్లేషించారు. సాధారణ పరిస్థితులతో పోలిస్తే కేవలం 30 శాతం సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి కర్ణాటక మార్కెట్‌కు కూరగాయలు వస్తాయి. ఈ ఏడాది వరదల కారణంగా ఆ రాష్ట్రాల నుంచి కూడా సరుకు నిలిచిపోయింది.

  • కర్ణాటకలోని దాదాపు అన్ని నగరాల్లోనూ టమాట కిలో రూ.100, బీన్స్‌ రూ.120 నుంచి రూ.140, మేలిరకం క్యారెట్‌ రూ.100, క్యాప్సికం రూ.80 నుంచి రూ.100, కోడి గుడ్డు ఒకటి రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతున్నాయి.
  • పాల ధర కూడా అన్ని ప్రధాన నగరాల్లో లీటరు రూ.5 చొప్పున పెరిగే వీలుంది. కర్ణాటక పాత సమాఖ్య (కెఎంఎఫ్‌) ఇప్పటికే లీటర్‌కు రూ.5 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే నందిని పాల ధర లీటర్‌ రూ.5 చొప్పున పెరిగేవీలుంది.
  • కూరగాయలు, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఇలా అన్ని ధరలూ నింగినంటితో హోటళ్లలో కూడా ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగే అవకాశముంది. కొద్ది రోజులు వేచిచూసి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని బృహత్‌ బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ (బిబిహెచ్‌ఎ) ప్రకటించింది.

                                                                మధ్యప్రదేశ్‌లోనూ మంటలు

మధ్యప్రదేశ్‌లోనూ ప్రధాన మార్కెట్లలో కూరగాయల ధరలు మండుతున్నాయి. బుర్హాన్‌పూర్‌ వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌లో కొన్ని వారాల కిందట కిలో రూ.50 పలికిన కూరగాయలు ఇప్పుడు రూ.100 దాటేశాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సగటున కిలో రూ.30కి విక్రయించిన టమాట ఇప్పుడు కిలో రూ.100 నుంచి రూ.150 కి ఎగబాకాయి. అలాగే మిరపకాయలు కూడా కిలో రూ.100కు చేరాయి.

  • రాజస్థాన్‌లోని ముహాన మండిలోనూ పరిస్థితి ఇలానే ఉందని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. టమాట, అల్లం ధరలు ఆకాశన్నంటాయి. ముహాన మార్కెట్‌లో టమాట కిలో రూ.60 నుంచి రూ.65 పలుకుతోంది. అల్లం కిలో రూ.190 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. నిమ్మకాయలు, కాకర కాయల ధరలు కూడా బాగా పెరిగిపోయాయని ముహాన కూరగాయల టోకు వ్యాపారుల సంఘం అధ్యక్షులు రాహుల్‌ తవార్‌ తెలిపారు.