Jul 03,2023 10:46

ముంబయి : ఎన్‌సిపిని చీల్చి, ఎన్డీయే పంచన చేరిన అజిత్‌ పవార్‌ అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచారు. షిండే నేతృత్వంలోని శివసేన, బిజెపి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవిని తాజాగా చేపట్టిన ఈ 63 ఏళ్ల నాయకుడు ఇంతకుముందు కూడా ఇలానే పార్టీలో చీలిక తీసుకోచ్చారు.. అప్పుడు కూడా ఇలానే బిజెపి ప్రభుత్వంలో డిప్యూటీ సిఎంగా చేరారు. ఆ తర్వాత మద్దతు ఉపసంహరించుకుని తిరిగి సొతం పార్టీకి వచ్చారు.
 

                                                                            అజిత్‌ నేపథ్యం

అజిత్‌ తండ్రి అనంతరావు పవార్‌. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్‌ సినిమాల వైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబారు శరద్‌ పవార్‌ మార్గాన్ని అనుసరించి సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఏర్పడిన పివి నరసింహారావు ప్రభుత్వంలో.. శరద్‌ పవార్‌ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల అజిత్‌ మహారాష్ట్రలో పార్టీ వ్యవహారాలను చూసేవారు. లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి.. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సుధాకర్‌రావు నాయక్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వరుసగా ఆరు సార్లు బారామతి స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
           శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు చూశారు. 1999లో శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ను వీడి ఎన్‌సిపి స్థాపించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌-ఎన్‌సిపి పొత్తు పెట్టుకున్నాయి. విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రి కాగా, అజిత్‌ కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండే హయాంలోనూ అజిత్‌ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత పథ్వీరాజ్‌ చవాన్‌ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నీటిపారుదల శాఖను నిర్వహించినప్పుడు ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.
 

                                                                            పదేపదే అలకలు..

శరద్‌ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆమె ఎంపీ గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్‌ పవార్‌ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్‌ రాజకీయ వారసుడు అజిత్‌ అని అందరూ భావించారు. అయితే, 2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు అజిత్‌ సంచలన ప్రకటన చేశారు. శరద్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఇందుకు కారణంగా పేర్కొన్నారు. 2019లో ఇలాగే ఎన్‌సిపి అధినేతపై తిరుగుబాటు ప్రకటించి..ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతత్వంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలికారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే 4 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేసి.. మద్దతు ఉపసంహరించుకున్నారు. సొంత పార్టీ ఎన్‌సిపికి తిరిగొచ్చిన అజిత్‌ పవార్‌.. ఇలా చేయడం తిరుగుబాటు కాదని అప్పట్లో సమర్థించుకున్నారు. శరద్‌ కుమార్తె సుప్రియా సూలే పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తుండడం అజిత్‌ ఇబ్బందిగా మారిందని.. తనకు, తన కుమారుడు పార్థ్‌కు పార్టీలో సముచిత స్థానం ఉండదేమోనన్న ఉద్దేశంతోనే అజిత్‌ బిజెపి పంచన చేరారన్న విశ్లేషణలు వచ్చాయి. మెజారిటీ లేనందువల్ల 2019లో నాలుగు రోజులకే బిజెపి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత..కాంగ్రెస్‌ ఎన్‌సిపి-శివసేన పార్టీల కూటమి 'మహా వికాస్‌ అఘాడీ' అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వంలో కూడా అజిత్‌ డిప్యూటీ సీఏంగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ అజిత్‌ పవార్‌ ఎన్‌సిపి వీడుతున్నట్లు.. 40 ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారని ఊహాగానాలు వినిపించాయి. వీటిని ఖండించిన పవార్‌.. తాను ఎన్‌సిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు శరద్‌ పవార్‌ పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ప్రకటించగా.. ఎన్‌సిపి అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందని చర్చ జరిగింది. కానీ తర్వాత శరద్‌ పవార్‌ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో శరద్‌పవార్‌, సుప్రీయా సూలే పాల్గొనడం, పార్టీలో సుప్రీయా క్రియాశీలకంగా ఉన్నారన్న అసంతృప్తితోనే మళ్లీ ఇప్పుడు అజిత్‌ మరోమారు బిజెపి పంచన చేరారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.