Mar 12,2023 14:30

తొలి సినిమాతోనే క్రేజ్‌ కొట్టేసిన తారల్లో ఒకరిగా శ్రీలీలను చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీలీలలో మరో కోణం కూడా ఉంది. అదే సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల.. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపారు. ఆడి, పాడి వారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. శ్రీలీలలోని ఈ మంచి లక్షణాన్ని చూసి తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు..!
టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్‌ అవుతూ కెరీర్‌ టర్న్‌ చేసుకునే పనిలో ఉన్నారు. తొలుత కొన్ని కన్నడ సినిమాలతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన శ్రీలీల 'పెళ్లి సందడి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం రవితేజతో 'ధమాకా' సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. అందం, అభినయంతో ఆకర్షించడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసూ దోచుకుంటున్నారు. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల.. అక్కడి ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రేక్షకులను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

  • ఆ నిర్ణయం మీచేతుల్లోనే..

'గొప్ప కలలతో ఉన్న నా చిన్న సమూహం. గొప్ప మనసులతో ఉన్న నా చిన్నారులు. వాళ్లు ఎంత గొప్పవాళ్లో.. కలిసే వరకూ మీకూ తెలియదు. కలలు, కథలు, డ్యాన్స్‌, పాటలు, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం.. ఇలా ఈరోజు ఎంతో ఆనందంగా గడిపాను. వాళ్లందరికీ ప్రేమను పంచాలనే ఉద్దేశంతో అక్కడ అడుగుపెట్టాను. వాళ్ల అమాయకపు చూపులు, బోసి నవ్వుల్లో నేను తడిసి ముద్దయ్యాను. ఇలాంటి క్షణాలను అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడిది అందరికీ సాధ్యమవుతుంది!! ఇతరులకు సాయం చేయాలని చాలా మందికి ఎన్నో సందర్భాల్లో అనిపిస్తుంది. కాకపోతే, ఎలా చేయాలి? ఎవరికి సాయం చేయాలి? అనేదానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది' అని తెలిపారు.

  • విరాళాలు కాదు.. ప్రేమను పంచండి..

'గూగుల్‌లో సెర్చ్‌ చేసి మీ చుట్టూ ఉన్న ఇలాంటి ఎంతోమంది చిన్నారులను మీరు కలుసుకోవచ్చు. ఈ పోస్ట్‌ పెట్టి.. భారీ విరాళాలు ఇవ్వమని నేను కోరుకోవడం లేదు. కానీ, మీ జీవితంలో ఎంతో విలువైన సమయం, ప్రేమ, ఆప్యాయతను ఇవ్వాలని కోరుతున్నా. వీటినే వాళ్లు కోరుకునేది. వారం లేదా నెలకు ఒక్కసారైనా వాళ్లతో కలిసి భోజనం చేయండి. ఇది కేవలం కడుపు మాత్రమే నింపదు. ఆనందంతో హృదయం నిండిపోతుంది. అలాంటి మనసుతోనే మొదలుపెడుతున్నా. ఏదైనా అనాథాశ్రమాన్ని మీరు సందర్శిస్తే.. ఫొటోలు తీసుకుని ''హియర్‌ ఫర్‌ యూ'' అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా నాతో షేర్‌ చేసుకోండి' అని శ్రీలీల పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల మదిని గెలుచుకుంది. చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీలీలను అందరూ మెచ్చుకుంటున్నారు.

  • అనాథ పిల్లలను దత్తత తీసుకుని..

ఆమె వయస్సు ప్రస్తుతం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకునే సమయానికి ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలే. ఇంత చిన్న వయస్సులో ఇంత గొప్ప ఆలోచనలు కోటి మందిలో ఒక్కరికో, ఇద్దరికో మాత్రమే వస్తాయి. వారిలో శ్రీలీల కూడా ఒకరిగా ఉండడం ఎంతో అభినందనీయం. కేవలం ఇదొక్కటే కాదు, గతంలో ఆమె కర్ణాటకలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారట! ఇక ఆమె గురు, శోభిత అనే ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకొని, పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆమె షూటింగ్‌ కోసం ఒక అనాథాశ్రమానికి వెళ్లారంట. అక్కడ వీళ్లిద్దరిని చూసి.. ఎంతో జాలి వేసి, వెంటనే దత్తత తీసుకొని ఇంటికి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలీలనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

  • గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లోనూ..

రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే చాలామంది స్టార్లు భాగమయ్యారు. ఇందులో శ్రీలీల పాల్గొని, మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆ మధ్య తెలిపారు. ఆ తర్వాత హీరోయిన్స్‌ శాన్వి శ్రీవాస్తవ్‌, అనుపమ పరమేశ్వరన్‌లకు ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఇచ్చారు. వారితో పాటు తన అభిమానులు, ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలను నాటాలని శ్రీలీల తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఖాతాలో మహేష్‌బాబు, రామ్‌ కొత్త చిత్రాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. పవన్‌కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అనే మూవీలో కూడా శ్రీలీలకు ఛాన్స్‌ వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్ళబోతున్న ఈ సినిమా సెట్స్‌లో ఆమె జాయిన్‌ కానున్నారట!

పేరు : శ్రీలీల
పుట్టిన తేదీ : జూన్‌ 14, 2001
పుట్టిన ప్రాంతం : డెట్రాయిట్‌, అమెరికా
నివాస ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక
చదువు : ఎంబిబిఎస్‌ ఫైనల్‌ ఇయర్‌
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, రీడింగ్‌
తల్లిదండ్రులు : సుభాకర్‌ రావు ఎస్‌, స్వర్ణలత
తోబుట్టువులు : శ్రీకర్‌, శ్రీదీప్‌