May 07,2023 09:28

కొందరికి స్టార్‌ గుర్తింపు రావాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కానీ కొందరు మాత్రం ఓవర్‌ నైట్‌ స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకుంటారు. అయితే ప్రతి స్టేటస్‌ వెనుకా ఎంతో కష్టం ఉంటుంది. అలా అవకాశాలకు ముందు ఎంత కష్టపడినా.. ఒక్క అవకాశంతో స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకున్న నటి సాక్షి వైద్య.. 'ఏజెంట్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె అంతకు ముందు మోడలింగ్‌ రంగంలో రాణించారు. దీనికన్నా ముందు ఫిజియోథెరపిస్టుగానూ పనిచేశారు. కాగా ఇటీవల విడుదలైన 'ఏజెంట్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. అవేంటో తెలుసుకుందాం..!
సాక్షి వైద్య 'ఏజెంట్‌' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే దీనికి ముందు ఆమె మోడలింగ్‌ చేశారుగానీ, హీరోయిన్‌గా కెమెరా ముందుకు వచ్చింది మాత్రం ఈ చిత్రంతోనే. ఫిజియో థెరపీలో డిగ్రీ చేసిన సాక్షి వైద్య.. ఆపై ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. మోడల్‌గా మంచి పాపులారిటీ సంపాందించుకున్నారు. ఎన్నో ప్రముఖ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. అలాగే 2022లో 'ఇన్వెర్స్‌' అనే హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో సాక్షి వైద్య నటించారు. ఇదే ఆమెకి తొలి సినిమా. మొదటి సినిమాతోనే హాలీవుడ్‌లో ఛాన్స్‌ కొట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సాక్షి వైద్య.. తన రెండో ప్రయత్నంలో 'ఏజెంట్‌'తో ప్రేక్షకులను పలకరించారు. 'ప్రస్తుతానికి వరుణ్‌తో కలిసి 'గాండీవధారి అర్జున' చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి' అని తెలిపారు.

2
  • తెలుగు ప్రజలు మంచివాళ్లు..

'తెలుగు ప్రజలు చాలా మంచివాళ్లు.. ప్రేమను గొప్పగా చూపిస్తారు. సినిమా చూడకుండానే నన్ను మెచ్చుకోవడంతో నాలో ఇంకా కాన్ఫిడెన్స్‌ పెరిగింది. నాకు తెలుగు భాష అసలే తెలియదు. అందులో నేను రాయలసీమ భాషను మాట్లాడాల్సి వచ్చింది. చాలా తెలుగు మూవీస్‌ చూశాను. ఇప్పుడు తెలుగు ట్యూటర్‌ని పెట్టుకొని, క్లాసులకు అటెండ్‌ అవుతూ తెలుగు నేర్చుకొంటున్నాను. 'ఏజెంట్‌' సినిమా రిలీజ్‌ కాకుండానే నాపై ప్రశంసలు కురిపించిన తీరు, అలాగే నన్ను ప్రోత్సాహించిన తీరు చాలా ఆనందాన్ని కలిగించింది' అని సాక్షి వైద్య తెలిపారు.

  • వాళ్ల కష్టం తెలిసొచ్చింది..

'ఇంతకు ముందు సినిమా చూసేటప్పుడు.. స్క్రీన్‌ మీద ఆ సీన్‌ బాగాలేదు. ఆ హీరో బాగా లేడు.. ఆ హీరోయిన్‌ బాగా లేదు అని కామెంట్‌ చేసి.. లైట్‌ తీసుకొనేవాళ్లం. కానీ ఒక్కసారి 'ఏజెంట్‌' సినిమా షూట్‌లో పాల్గొన్న తర్వాత.. యాక్టర్లు, టెక్నీషియన్లు పడే కష్టం నాకు తెలిసొచ్చింది. ఒక లొకేషన్‌ నుంచి మరో లొకేషన్‌, యాక్షన్‌ సీన్లలో వాళ్లు గాయపడటం చూసి.. సినిమా మేకింగ్‌పై మరింత గౌరవం పెరిగింది. ముఖ్యంగా 'ఏజెంట్‌' సినిమాలో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఇక నేను భరతనాట్యం నేపథ్యం నుంచి రావడం వలన డ్యాన్స్‌ స్టెప్స్‌ని త్వరగా నేర్చుకోగలిగాను' అని సాక్షి చెప్పారు. 'ఇక ఈ సినిమాలో నాకు, మమ్ముట్టి గారికి మధ్య సన్నివేశాలు లేవు. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ చాలా అనుభవం ఉన్న వాళ్లు. వాళ్లతో కలిసి ఎలా నటిస్తానా అని మొదట భయపడ్డాను. కానీ వాళ్లందరూ చాలా సాయం చేశారు' అని తెలిపారు.

2
  • నాకే నమ్మబుద్ధి కావట్లేదు..

'నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్‌ కావాలనే ఆలోచన లేదు. కరోనా సమయంలో అలా ఆడిషన్స్‌ ఇవ్వడం ద్వారా యాక్టర్‌ అయ్యాను. యాక్టర్‌గా మారిన తర్వాత చాలా ఎమోషన్స్‌ మనలో కనిపిస్తాయి. చాలా విషయాలు నేర్చుకొంటాం. నిజ జీవితంలో ఆచరించని విషయాలు కూడా నటిగా మారిన తర్వాత పాటిస్తాం. నాకు డ్రీమ్‌ రోల్స్‌ చేయాలనే ఆలోచన ఇంకా రాలేదు. నేను హీరోయిన్‌గా నటించాననే విషయం తలుచుకొంటే నాకే నమ్మబుద్ధి కాదు. నా జీవితం నాకే సర్‌ప్రైజ్‌ అనిపిస్తుంది' అని అన్నారు.

  • నా ఫ్రెండ్స్‌ సలహా మేరకు..

అయితే ఏజెంట్‌ అవకాశం గురించి చెబుతూ.. 'కోవిడ్‌ సమయంలో కాలేజ్‌ కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయింది. నాకు ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేయడం అలవాటు. ఆ సమయంలో సోషల్‌ మీడియా రీల్స్‌చేశాను. అందులో కొన్ని వైరల్‌ అయ్యాయి. నా ఫ్రెండ్స్‌ ఆడిషన్స్‌కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ముంబైలో కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ సమయంలో ఇక్కడ ప్రొడక్షన్‌ మేనేజర్‌ కాల్‌ చేసి, సినిమా గురించి చెప్పారు. మొదట నమ్మలేదు. తర్వాత ముంబైలో ముఖేష్‌ అనే కాస్ట్యూమ్‌ డైరెక్టర్‌.. చాలా పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌, పెద్ద డైరెక్టర్‌, బిగ్‌ కోస్టార్‌, చాలా మంచి అవకాశం అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడిషన్స్‌ ఇచ్చాను. సురేందర్‌ రెడ్డి గారికి నచ్చింది. అలా 'ఏజెంట్‌' ప్రాజెక్ట్‌లోకి వచ్చాను' అని తెలిపారు.

పేరు: సాక్షి వైద్య
ఇతర పేర్లు: మహి, సాక్షి
వృత్తి: నటి, మోడల్‌
పుట్టిన తేదీ: జూన్‌ 19, 2000
పుట్టిన ప్రాంతం: థానే, మహారాష్ట్ర
నివాస ప్రాంతం: ముంబై
చదువు: గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌: ట్రావెలింగ్‌,
ఫొటోగ్రఫీ, నేచర్‌ లవర్‌