Oct 03,2020 12:59
ఫేస్‌బుక్‌కు దూరంగా సెలబ్రిటీలు

ప్రపంచంలోనే సోషల్‌ మీడియా ప్రసిద్ధి చెందిన వేదికగా పేరు తెచ్చుకొంది. 24 గంటలపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని కొందరు ప్రముఖులు నిర్ణయించుకున్నారు. అసలేమైంది? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుందాం!
ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వేదికగా ద్వేషపూరిత ప్రచారాలు, తప్పుడు సమాచారాలు ఎక్కువైపోతున్నాయి అనేది వాస్తవం. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్నా సోషల్‌ మీడియా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపధ్యంలో కొందరు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు. వారిలో కిమ్‌ కర్దేషియన్‌, టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో, సచా బారన్‌ కోహెన్‌, కాటీ పెర్రీ, మైఖేల్‌ బిజోర్డాన్‌ వంటి స్టార్స్‌ అంతా కలిసి 'స్పాట్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌' (Spot hate for profit) నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు ప్రకటించారు. 24 గంటల పాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎటువంటి పోస్టింగులూ చేయమని చెప్పారు. సెప్టెంబర్‌ 15న వారు ఎలాంటి పోస్టింగులు చేయలేదు. వీరిలో కిమ్‌ కర్దషియన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 188 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 'ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తప్పుడు సమాచారాన్ని అనుమతిస్తుంటే నేను మౌనంగా కూర్చోలేను' అంటూ కిమ్‌ కర్దషియన్‌ చెబుతున్నారు. ఈ రెండు వేదికల్లో మార్పు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
సెలబ్రెటీలతో పాటు పలు సంస్థలు యాడ్స్‌ నిలిపివేసి ఫేస్‌బుక్‌ మీద నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంలో, పలు వివాదాస్పద ఘటనల విషయంలో తప్పుడు వార్తలు, అబద్ధ ప్రచారాలు సోషల్‌ మీడియాలో మరీ శృతి మించుతున్నాయి. అందుకే ఇప్పుడు సెలెబ్రిటీలంతా నిరసనకు దిగారు.