Mar 19,2023 15:42
  • సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలి అంటే అంత సులువైన పని కాదు. ఇక అవకాశాలు దక్కాలన్నా, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాలన్నా అందం ఒకటే ఉంటే సరిపోదు. దీంతోపాటు అభినయం, పాత్రకు తగ్గ హావభావాలు పలికించే సత్తా ఉండాలి. ఒకవేళ ఏదో రకంగా నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టినా దాన్ని కొనసాగించే శక్తి ఉండాలంటే టాలెంట్‌ తప్పనిసరి. అలా అందం, అభినయం కలగలిసిన నటుల్లో ఒకరే కృతి సనన్‌. ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌కు జోడీగా కృతి నటించిన చిత్రం 'షెV్‌ాజాదా'. ఇది తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అలవైకుంఠపురములో..'కి రీమేక్‌. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలు టీవీ షోల్లో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు..

కృతి సనన్‌ ఒక భారతీయ నటి, మోడల్‌. అనేక పెద్ద కంపెనీల కమర్షియల్‌ యాడ్స్‌లోనూ నటించారు కృతి. ఇక హిందీలోనూ కమర్షియల్‌ యాడ్స్‌కు మోడల్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత మహేష్‌బాబు నటించిన '1 - నేనొక్కడినే' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీలో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన 'హీరో పంతి' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 'బేడియా'లో నటించారు. అనంతరం నాగ చైతన్యతో కలిసి 'దోచెరు' సినిమాలోనూ నటించారు. అయితే తెలుగులో నటించిన రెండు చిత్రాలూ సరైన సక్సెస్‌ అందించలేకపోయాయి. దీంతో బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అక్కడ అక్షరుకుమార్‌, షారుక్‌ఖాన్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈసారి బహుభాషా చిత్రంగా రూపొందుతున్న 'ఆదిపురుష్‌'తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరకానున్నారు.

  • ఆ అవకాశం అందరికీ రాదు..

తాజాగా అభిమానులతో మచ్చటించిన సందర్భంగా కృతి మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌' చిత్రం కోసం తాను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తునట్లు తెలిపారు. 'ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం అందరికీ రాదు. నేను ఇందులో నటించినందుకు గర్వంగా భావిస్తున్నాను. సినిమా చూశాక దేశమంతా అలాగే భావిస్తుంది' అని అన్నారు. ఇక లవ్‌స్టోరీ కథల గురించి మాట్లాడిన కృతి.. తనకు అలాంటి సినిమాలంటే ఇష్టమని తెలిపారు. 'నేను స్వచ్ఛమైన ప్రేమకథను చేయాలనుకుంటున్నాను. ఆ జానర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలకు నేను బాగా సరిపోతానని నా అభిప్రాయం' అని పేర్కొన్నారు.

  • నేనస్సలు సీరియస్‌గా తీసుకోను..

ఓ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి మాట్లాడిన కృతి..'హీరోయిన్‌గా పనిచేయడం అనేది ఒక ఉద్యోగం.. కానీ ఎవరూ కూడా దాన్ని ఉద్యోగంలాగా చూడరు.. సినీ ఇండిస్టీలో నటిగా పనిచేయడం అన్నది ఒక వృత్తిగా కనీసం ఎవరూ చూడరు. అందుకే హీరోయిన్స్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే హీరోయిన్స్‌గా నటించిన చాలామందికి పెళ్లిళ్లు కాలేదు. ఇండిస్టీకి వచ్చిన కొత్తలో చాలామంది ఈ విషయంపై ముందు భయపడతారు. నా కెరీర్‌ ఆరంభంలో నాఫ్రెండ్స్‌ నుంచి కూడా ఇలాంటి కామెంట్స్‌ విన్నాను. హీరోయిన్స్‌ను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు అని చెప్పి నన్ను భయపెట్టాలని చూశారు. కానీ నేను మాత్రం ఈ విషయాలను అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. హీరోయిన్‌గా సక్సెస్‌ కావడంపైనే దృష్టి పెట్టాను. ఇప్పుడు నేను కోరుకున్న కెరీర్‌లో రాణిస్తున్నాను' అంటూ తెలిపారు కృతి సనన్‌.

  • ఆ విమర్శలు బాధించాయి..

ఇక 'ఆది పురుష్‌' సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా టీజర్‌ విషయంలో వచ్చిన ట్రోలింగ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నెగెటివ్‌ కామెంట్స్‌ తనను నిరుత్సాహానికి గురిచేశాయని చెప్పారు. 'సహజంగానే నాకు చాలా బాధ కలిగింది. నెటిజన్స్‌ నుంచి ఇలాంటి కామెంట్స్‌ వస్తాయని ఊహించలేదు. కానీ, మేకర్స్‌ మాత్రం చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. సినీ అభిమానుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా స్వీకరించక తప్పదు. అందుకే మేకర్స్‌ విన్నారు. వచ్చిన కామెంట్స్‌ ఎంతవరకూ వాస్తవమో పరిశీలించారు. అవసరమైన చోట్ల దిద్దుబాట్లు చేశారు' అని చెప్పుకొచ్చారు.


పేరు: కృతి సనన్‌
పుట్టిన తేదీ: జులై 27, 1990
పుట్టిన ప్రాంతం: న్యూ ఢిల్లీ
నివాస ప్రాంతం: ముంబై
చదువు: బీటెక్‌
హాబీస్‌: మెడిటేషన్‌, కుక్కింగ్‌, క్రికెట్‌
తల్లిదండ్రులు: రాహుల్‌ సనన్‌, గీతా సనన్‌
తోబుట్టువులు: నుపుర్‌ సనన్‌