- యూనిట్‌కు మరో రూ.1.20 పైసలుకుపైగా వడ్డన !
- రూ.2000 కోట్ల ట్రూఅప్ భారం పడే ప్రమాదం
- ఒక బిల్లులో రెండు ట్రూఅప్‌లు, రెండు ఎఫ్‌పిపిసిఎలు
- వచ్చే నెల నుండి అమల్లోకి వచ్చే అవకాశం
- కునారిల్లుతున్న పరిశ్రమలు
- యూనిట్లను తమిళనాడు, కర్ణాటకకు మార్చుకునే ఆలోచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ భారాల దెబ్బకు పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఇప్పటికే ఒక ట్రూఅప్‌తోపాటు రెండు ఎఫ్‌పిపిసిఎ (ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్) విధిస్తున్న ప్రభుత్వం కొత్తగా మరో ట్రూఅప్‌కు సిద్ధమవుతోంది. అంటే రెండు ట్రూఅప్‌లు, రెండు పర్చేజ్డ్ అడ్జస్ట్‌మెంట్ భారాలు పడనున్నాయి. 2014తోపాటు ఈ ఏడాది ఏప్రిల్ నెల అడ్జస్ట్‌మెంట్‌ను కూడా వసూలు చేస్తున్న ప్రభుత్వం రాబోయే రెండు మూడు నెలల్లో యూనిట్‌కు మరో రూ.1.20 పైసలు భారం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సామాన్యులతోపాటు, పరిశ్రమల యజమానులూ ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరుపైసల నుండి రూ.0.96 పైసలకు పెంచి దాన్ని రూపాయి నికరం చేయడంతో 1.70 లక్షల యూనిట్లువాడే పరిశ్రమలపై రూ.1.70 లక్షల అదనపు భారం పడుతోంది. ఇది కాకుండా 2014-19 ట్రూప్ అప్ కూడా వసూలు చేయడం మరో భారం. చాలదన్నట్లు ఎప్పటి ఖర్చులు అప్పుడే వసూలు చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన సూచనల్లో భాగంగా 2021, 2023కు సంబంధించి పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్ ఛార్జీలు ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారు. అంటే సాధారణ బిల్లు కాకుండా మూడు రకాల అదనపు భారాలు మోపారు. డ్యూటీతో కలిపితే నాలుగోది. కస్టమర్, ఫిక్స్‌డ్ ఛార్జీలు అదనం. ఇప్పుడు కొత్తగా 2019 నుండి 2022 వరకూ మరో ట్రూ అప్ వసూలు చేసేందుకు అవసరమైన కసరత్తులు పూర్తయ్యాయి. ఇది సుమారు రూ.2000 కోట్లపైబడి మోపే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని ఈ ఏడాది ఆగస్టు నెల బిల్లు నుండి వసూలు చేసే అవకాశం ఉందని, కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
- బిల్లుల్లోనూ తకరారు
ప్రస్తుతం విద్యుత్‌శాఖ కిలోవాట్ అవర్ (కెడబ్ల్యుహెచ్) కింద కొనుగోలు చేస్తోంది. దీన్ని వినియోగదారులకు కిలో వోల్ట్ యాంపియర్ (కెవిఏహెచ్) కింద సరఫరా చేస్తోంది. దీనివల్ల యూనిట్ల వినియోగం పెరుగుతుంది. గతంలో పరిశ్రమలకు కిలోవాట్ అవర్ కింద సరఫరా చేసే వారని, ఇప్పుడు కిలోవోల్ట్స్ యాంపియర్ అవర్ కింద సరఫరా చేస్తుండటం వల్ల అదనపు బిల్లులు పడుతున్నాయని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవర్ ఫ్యాక్టర్ భారం కూడా ఎక్కువగా పడుతోందని చెబుతున్నారు. గతంలో లాగ్, లీడ్ ఉండేవని కంపెనీకి సరఫరా అయ్యే విద్యుత్ కేటాయింపునకు మించి పెరిగితే ఆటోమేటిక్‌గా బిల్లు పడేదని చెబుతున్నారు. ప్రస్తుతం పరిశ్రమ నడవని సందర్భంలో సప్లయి అదనంగా వస్తే దానికి కెపాసిటర్లో రికార్డు చేసి బిల్లు వేస్తున్నారని, వాడని విద్యుత్‌కూ బిల్లు కట్టాల్సి వస్తోందని యజమానులు వాపోతున్నారు.
- అదనపు భారం ఇలా
ప్రస్తుతం విజయవాడలో ఓ పరిశ్రమ నెలకు 1.70 లక్షల యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తోంది. దీనికి యూనిట్‌కు రూ.5.91 పైసలు చొప్పున రూ.10,04,700 బిల్లు వచ్చింది. అలాగే 1440 కిలోవాట్స్‌కు కనెక్షన్‌కు వాట్‌కు రూ.475 చొప్పున సుమారు రూ.6,84,000 బిల్లు వచ్చింది. మొత్తం నెల బిల్లు రూ.16,88,700 కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్‌కు రూపాయి పెంచడంతో రూ.1.70 లక్షలు అదనపు భారం పడింది. పవర్‌ఫ్యాక్టర్ లీడ్‌ను(మెయింటెయిన్ చేయాల్సిన సరఫరా కంటే ఎక్కువ) కూడా రికార్డు చేయడంతో రూ.4,80,000 అదనంగా బిల్లు వేశారు. దీంతో పరిశ్రమల యజమానులు రాష్ట్రంలో నడపలేకపోతున్నామని, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు యూనిట్లు మార్చుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు.
- పరిశ్రమలపై ఒత్తిడి
ప్రస్తుతం పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ముందుగానే ఖర్చు తదితర అంశాలను లెక్కకట్టి పెద్దపెద్ద కంపెనీలతో అగ్రిమెంటు చేసుకుంటారు. అయితే ఇప్పటికిప్పుడు పడుతున్న ట్రూఅప్, పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్, పవర్ ఫ్యాక్టర్, కిలోవోల్డ్ అవర్ వంటివేమీ వాటిల్లో ఉండవు. గతంలో ఉన్న ఖర్చుల ఆధారంగా అగ్రిమెంటు చేసుకున్న పరిశ్రమ యజమాని అదే ధరకు తయారు చేసి ఒప్పంద సమయంలోపు అందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అగ్రిమెంటు చేసుకున్న సంస్థలు జరిమానాలు విధిస్తాయి. పాత లెక్కల ప్రకారం వస్తువులు తయారు చేస్తే యజమానులు నష్టపోవడం తప్ప మరొకటి ఉండదు. ఒక అగ్రిమెంటుకు రూ.4 లక్షలు మిగులుతాయనుకుంటే అదనపు కరెంటు బిల్లులే రూ.5 లక్షలు ఉంటున్నాయి. అదనంగా చేతిలో డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










