Oct 31,2020 23:04

బుల్లితెరలో 'కార్తీక దీపం' సీరియల్‌లో మనస్పర్థల కారణంగా విడిపోయిన తల్లిదండ్రుల మధ్య నలిగిపోయే చిన్నారి పాత్రలో శౌర్య అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. అయితే శౌర్య బుల్లితెరపై ఎంత హుషారుగా కనిపిస్తుందో అంతే చలాకీగా బయటా ఉంటుంది. వయసులో చిన్నదైనా తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపన పడుతూనే ఉంటుంది. ఈ మధ్య శౌర్య చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభించింది.


శౌర్య అసలు పేరు గ్రంధి క్రితిక. ఐదేళ్ల వయస్సు నుంచే సీరియళ్లలో నటిస్తోంది. తెలుగులో గీతాంజలి సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఇప్పటివరకూ సుమారు 15 సీరియళ్లలో నటించింది. వాటిలో అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ లాంటి సీరియళ్లలో నటించినా కార్తీక దీపం క్రితికకు మంచి గుర్తింపు తెచ్చింది. డాక్టర్‌ బాబు, దీప క్యారెక్టర్‌కు ఎంత ఇమేజ్‌ ఉందో శౌర్య పాత్రకు అంతే ఉంది. సీరియళ్ల ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈ మధ్య పలు చిత్రాల్లోనూ క్రితిక నటించింది.
సోషల్‌ మీడియాలో క్రితిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తను నటించే షూటింగ్‌ లొకేషన్లను, ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ పద్యాలు, ఎన్టీఆర్‌ డైలాగులు చెబుతూ తన అభిమానులను అలరించింది. ఈ మధ్య ఒక నెటిజన్‌ తన భార్య పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పమని క్రితికను కోరారు. 'శుభాకాంక్షలు తప్పకుండా చెబుతాను. అయితే ఒక కండిషన్‌. కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకుల అవసరమున్న ఒక కుటుంబానికి వెయ్యి రూపాయలతో మీకు తోచిన సహాయం చేయండి. ఆ ఫోటోలను నాకు పంపండి. నేను తప్పకుండా మీ భార్యకు శుభాకాంక్షలు చెబుతా!' అని చెప్పింది. అంతే ఆ అభిమాని క్రితిక చెప్పినట్లే సాయం చేసి, ఫోటోలు పంపారు. వెంటనే క్రితిక ఆ అభిమాని భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, సహాయం చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. క్రితికకు, అభిమానికి మధ్య జరిగిన సంభాషణను ఆమె స్క్రీన్‌షాట్‌ తీసి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. క్రితిక చేసిన పనికి నెటిజన్లంతా ఫిదా అయ్యారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. 'నేను చేసిన చిన్న పనిని కూడా గుర్తించి, ప్రోత్సహించిన అభిమానులకు ధన్యవాదాలు!' అంటూ క్రితిక మెసేజ్‌ చేసింది.


క్రితిక వయస్సు చిన్నదే కానీ మనస్సు మాత్రం చాలా పెద్దది. తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూంటుంది. అంతేకాదు క్రమం తప్పకుండా ప్రతి నెలా తన సంపాదనలో కొంత వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇస్తుంది. 'ప్రతి నెల మొదటి, చివరి వారాలు మాత్రమే షూటింగ్‌ల్లో పాల్గొంటాను. మిగతా సమయాన్ని చదువుకు కేటాయిస్తా. షూటింగుల్లో ఏమాత్రం తీరిక దొరికినా.. ఆ సమయాన్ని చదువుకు కేటాయిస్తా. చదువులో 85 శాతం కన్నా ఎప్పుడూ తక్కువ మార్కులు రాలేదు!' అంటోంది క్రితిక. ఆమెలాగా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఆలోచిస్తే కరోనా కష్టకాలంలో కొందరి కడుపైనా నిండుతుంది కదా!