Mar 26,2023 08:28

టాలీవుడ్‌లోని యువ నటుల్లో చాలా మంది టాలెంటెడ్‌ హీరోలు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో భిన్న స్వభావం. వీరిలోనూ చాలా మంది సమాజం పట్ల.. తమ చుట్టుపక్కల వారిపట్ల.. బాధ్యతను, సానుభూతిని, ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటివారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మంచు కుటుంబం నుంచి వచ్చిన మనోజ్‌. ఓ వైపు హీరోగా తన సినీ కెరీర్‌పై దృష్టి పెడుతూనే అవసరమైన సమయంలో సమాజానికి తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. అయితే మనోజ్‌ గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మహిళల పట్ల తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, అందరి మన్ననలూ పొందుతున్నారు. ఇంతకీ మనోజ్‌ ఏమన్నాడు? ఎవరి గురించి అన్నాడో తెలుసుకుందాం..!
మంచు మనోజ్‌కుమార్‌ మోహన్‌బాబు కుటుంబం నుండి విష్ణు తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిన్ననాటి నుండి సినీ వాతావరణంలో పెరిగిన మనోజ్‌ సహజంగానే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి నటించిన చిత్రాల్లో బాల్య నటుడిగా కొన్నింటిలో నటించారు. 'మేజర్‌ చంద్రకాంత్‌' తో తొలిసారి వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత చేసిన 'పుణ్యభూమి నా దేశం' చిత్రంతో ప్రశంసలు అందుకున్నారు. 2004లో 'దొంగ దొంగది' చిత్రంతో హీరోగా కెరీర్‌ మొదలుపెట్టారు. అయితే కమర్షియల్‌ విజయాన్ని చూడటానికి 2010 వరకూ ఆగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం 'నేను మీకు తెలుసా' తో ప్రేక్షకులను ఆకర్షించారు. ఇక 2009లో వచ్చిన 'ప్రయాణం' చిత్రంతో మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'బిందాస్‌' చిత్రంతో అన్ని వర్గాల మన్ననలూ పొందారు. 'వేదం'లో వివేక్‌ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి, అబ్బురపరిచారు.

manoj
  • అందరి జీవితాల్లో ఒక ఫేజ్‌ వస్తుంది..

ఇటీవల తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో మోహన్‌బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా మనోజ్‌ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్‌ అయ్యారు. 'ఆడపిల్ల ఓడిపోతే లోకమే ఓడిపోతుంది. జీవితంలో గెలుపోటములు సహజం.. మనం చేసే ప్రయాణాన్ని అనుభూతి చెందాలి. అందరి జీవితాల్లో ఒక ఫేజ్‌ వస్తుంది.. గాఢాంధకారంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు.. ధైర్యంగా ముందుకు సాగాలి' అని సూచించారు. తన జీవితంలోనూ అలాంటి ఓ ఫేజ్‌ వచ్చిందని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ తనకు అండగా నిలబడిందన్నారు. ఆ టైమ్‌లో పాటలు రాసుకుంటూ, మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తూ గడిపానన్నారు మనోజ్‌.

  • ఆ వెలుతురు పేరే మౌనిక..

'నేను సినిమా చేసి ఆరేళ్లు అవుతోంది. అయినా నాకు ప్రేక్షకులు ఇంతమాత్రం ప్రేమ తగ్గించకుండా ఇస్తున్నారు. ఎన్ని జన్మలు ఎత్తితే ఇది దక్కుతుంది? నేను చీకట్లో ఉన్నప్పుడు మా కుటుంబం అండగా నిలబడింది. అప్పుడు ముందుకు వెళ్దామని అనుకుంటున్న టైమ్‌లో ఓ వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అప్పుడే నాకు అర్థమైంది ఏది దూరం పెట్టానో. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని.. నాకు మౌనికతో పాటు కొడుకు కూడా అలా అదృష్టంలా వచ్చాడు. ఇక నాకు సినిమాలు, సామాజిక సేవ అంటే ఇష్టం. అందుకే మళ్లీ మూవీస్‌ చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి. తను ఏం చేయాలనుకున్నా నేను మద్దతుగా ఉంటా. అందరూ అంటుంటారుగా ప్రతి పురుషుడి గెలుపు వెనకాల స్త్రీలు ఉంటారు అని.. ఆడవారి విజయం వెనుక కూడా పురుషులు ఉండాలని నేను భావిస్తున్నాను. అదే నేను ఫాలో అవుతాను' అని మనోజ్‌ ఎమోషన్‌ కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు విని, ఆయన భార్య మౌనిక కన్నీళ్లు పెట్టుకున్నారు. 'మహిళలు గెలిస్తేనే మనం గెలిచినట్లు!' అని మనోజ్‌ చెప్పుకొచ్చారు.

  • ఆమెకు నా మద్దతు ఇస్తా..

manoj

మనోజ్‌కు మొదట్నుంచీ సేవా దృక్పథం ఎక్కువే. తనకు ఫలానా సాయం కావాలని ఎవరైనా ఆయన్ను సంప్రదిస్తే కచ్చితంగా చేసేవారనే మంచి పేరుంది. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఎంతో మందికి తన వంతుగా సాయం చేయడం.. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌లోనే ఉండిపోయిన ఎంతో మంది కూలీలు, సామాన్య ప్రజలను వారి స్వగ్రామాలకు తరలించారు. ఇదంతా తన సొంత డబ్బులతోనే మనోజ్‌ చేశారు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ 'నేను, మౌనిక ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాం. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక మాత్రం వుంది. అయితే మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే నా పూర్తి మద్దతు తనకు ఇస్తాను. ఇక నేను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాను. త్వరలోనే ''వాట్‌ ది ఫిష్‌'' సినిమా పూర్తి కావొస్తోంది' అని చెప్పుకొచ్చారు.

పేరు : మంచు మనోజ్‌
పుట్టిన తేదీ: మే 20, 1983
పుట్టిన ప్రాంతం: చెన్నరు
నివాస ప్రాంతం: హైదరాబాద్‌
చదువు: బి.ఎ
భార్య : భూమా మౌనిక
తల్లిదండ్రులు : మంచు మోహన్‌బాబు, మంచు నిర్మల
తోబుట్టువులు : లక్ష్మి మంచు, విష్ణు మంచు