ఇటీవల కొంతకాలం నుంచి చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సూపర్‌హిట్ చిత్రాలు మళ్లీ థియేటర్లో రిలీజ్ అయ్యి, ప్రేక్షకులతో పూనకాలు పెట్టిస్తున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం ఓ హీరోయిన్‌కు బాగా అచ్చొచ్చింది. ఒకప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలు చేసి.. నెమ్మదిగా కనుమరుగైపోయి.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కొనసాగిస్తున్న నటి.. భూమిక చావ్లా. ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి చిత్రాల బ్లాక్ బస్టర్ హిట్లు ఈమె ఖాతాలోనే ఉన్నాయనే సంగతి మరోసారి గుర్తుచేస్తున్నాయి. కాగా భూమిక చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 23 ఏళు ్ల అవుతుంది. అయితే తాజాగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన 'కిసీ కా భారు కిసీ కీ జాన్'లో కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమెను గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..
చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక చావ్లా. తెలుగు చిత్రాలతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న భూమిక ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది భాషలనే ఇష్టపడతారు భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. 'యువకుడు' (2000) తో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి వివిధ భారతీయ చిత్ర పరిశ్రమల్లో పనిచేశారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, భోజ్ పురి, పంజాబీ, మలయాళ భాషల్లో ముప్పైకి పైగా చిత్రాల్లో నటించారు. ఖుషి, తేరే నామ్, మిస్సమ్మ, గాంధీ, మై ఫాదర్, సత్యభామ చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. అయితే చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి భిన్నంగా కనిపించా లని తపించేవారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్స్‌లో నటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'ఖుషి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జునతో 'స్నేహమంటే ఇదేరా', వెంకటేశ్‌తో 'వాసు', చిరంజీవితో 'జై చిరంజీవా', మహేశ్‌తో 'ఒక్కడు', జూనియర్ యన్టీఆర్‌తో 'సింహాద్రి' వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసును చూరగొన్నారు. అనంతరం హిందీ చిత్రసీమ వైపు అడుగులేశారు. మధ్యలో తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు.
- సెకండ్ ఇన్నింగ్స్‌లో..
నటిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 2007లో నిర్మాత భరత్ ఠాకూర్‌ని వివాహం చేసుకున్నారు భూమిక..ఆ తర్వాత హీరోయిన్ రోల్స్‌కి గుడ్‌బై చెప్పారు. వివాహం తర్వాత 'తకిట తకిట' చిత్రాన్ని నిర్మించారు. అందులో ప్రత్యేక పాత్రలో నటించారు. రీఎంట్రీ అనంతరం అక్క, తల్లి, వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరిస్తున్నారు. 'ఎం.సి.ఎ', 'రూలర్', 'యూటర్న్', 'సవ్యసాచి', 'పాగల్', 'సీటిమార్' వంటి సినిమాల్లో కనిపించారు. ఆ మధ్య విడుదలై, విజయవిహారం చేసిన 'సీతారామం' లోనూ భూమిక ముఖ్యపాత్రలో కనిపించారు. తాజాగా సల్మాన్‌ఖాన్ హీరోగా 'కిసీ కా భారు కిసీ కీ జాన్'లో కీలకపాత్ర పోషించారు.
- అలాంటి మాటలు ఎంకరేజ్ చేయను..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అవకాశాల విషయంపై స్పందించిన ఆమె..'పార్టీలకు వెళ్తే తప్పా మంచి రోల్స్ రావా? అలాంటి మాటలను నేను ఎంకరేజ్ చేయను. ఫిల్మ్ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది భ్రమ మాత్రమే. నా కోసమే పాత్రలు రాసి, నా కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలామంది ఉన్నారు' అని చెప్పుకొచ్చారు. 'ఇక షూట్ టైమ్‌లో నేను కాస్త రిజర్వ్‌గా ఉండేదాన్ని. షాట్ గ్యాప్‌లో పుస్త కాలు చదువుతుంటాను. ఇప్పటికీ అంతే అనుకోండి! ఒకవేళ పుస్తకాలు అంతగా చదవకపోయినా.. సెట్లో అందరితో కలివిడిగా ఉండటం తక్కువే! నేను ప్రైవసీ కోరుకుంటా' అని చెప్పారు భూమిక.
- పేరుపెట్టి పిలిస్తే చాలన్నారు..
'తేరేనామ్' సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్గా నటించిన భూమిక ఇప్పుడు 'కిసీ కా భారు కిసీ కీ జాన్' సినిమాలో సోదరి పాత్రలో నటించారు.. ఈ సందర్భంగా 'తేరేనామ్' నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 'తేరేనామ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో సల్మాన్‌ను సల్మాన్భారు అంటూ పిలవడంతో అభిమానులు చాలా విమర్శించారని, అయితే సల్మాన్ మాత్రం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని, తనను పేరు పెట్టి పిలిస్తే చాలని చెప్పారని తెలిపారు. సార్ అని పిలిచినా అలా కూడా వద్దంటూ వారించారని' భూమిక గుర్తుచేసుకున్నారు. కాగా 'కిసీ కా భారు కిసీ కీ జాన్'లో వెంకటేష్ భార్యగా, సల్మాన్‌ఖాన్‌కు సోదరిగా నటించారు.
- ఆ పాత్రల కోసం చాలాసార్లు ప్రయత్నించా..
రకరకాల పాత్రలు పోషించిన ఈ నటికి పూర్తిస్థాయి కామెడీ పాత్రలో కనిపించాలని ఉందంటున్నారు. 'ఫుల్‌లెంగ్త్ కామెడీ పాత్రల కోసం నేను చాలాసార్లు ప్రయత్నించాను! కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. యాక్షన్ సినిమాలకూ నేను న్యాయం చేయగలననే అనుకుంటాను. థ్రిల్లర్ మూవీస్ చేయడం ఇష్టం' అని చెబుతున్నారు భూమిక.
పేరు: భూమిక చావ్లా
ఇతరపేర్లు: రచనా చావ్లా, గుడియా
పుట్టిన తేదీ: ఆగస్టు 21, 1978
పుట్టిన ప్రాంతం: న్యూఢిల్లీ
చదువు: గ్రాడ్యుయేషన్
భర్త: భరత్ ఠాకూర్
తల్లిదండ్రులు: కల్నల్ ఏఎస్ చావ్లా, బాలి చావ్లా
తోబుట్టువులు: మాన్వి దంగ్
హాబీస్: రైటింగ్, రీడింగ్, ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ