కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తగలడం కామనే. అయితే చిత్ర పరిశ్రమలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండిస్టీలో ఈ రకమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో చిన్న లోపాన్నో.. మరో విషయాన్నో తీసుకుని దానిపై నెగిటివిటీని ప్రచారం చేయడం, దానిద్వారా పాపులర్ అవ్వాలనుకోవడం పరిపాటి. అయితే సీనియర్ నటులతోపాటు అప్‌కమింగ్ నటులూ ఎక్కువగా ఈ నెగిటివిటీ బారిన పడుతున్నారు. అలాంటి బాధితుల్లో ఒకరు యువ నటుడు కిరణ్ అబ్బవరం. అయితే ఆ నెగిటివిటీ చూపేవారే తన ఎదుగుదలకు స్ఫూర్తి అని, ఏదైనా అనుకుంటే అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్లాలని తాజా చిత్రం 'మీటర్' ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పడం విశేషం. ఆ విషయాలేంటో తెలుసుకుందాం..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ నటుల్లో ఒకరు కిరణ్ అబ్బవరం. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్న నటుడు కిరణ్. కాగా 2019లో వచ్చిన 'రాజావారు రాణిగారు' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు కిరణ్. ఇది మంచి విజయం సాధించడంతో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ లవ్ ప్లస్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఎస్‌ఆర్ కళ్యాణ మండపం', 'సమ్మతమే', 'సెబాస్టియన్ పిసి', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక తాజాగా ఏడాది ప్రారంభంలో 'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ మరో చిత్రాన్ని క్యూలో పెట్టేశారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'మీటర్'. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ యువ హీరోపై నెగెటివిటీ ఒక పెద్ద అలలాగా పొంగుతుంది. కిరణ్ ఎన్ని మంచిపనులు చేసినా, ఎంత పద్ధతిగా మాట్లాడినా, ఎంత గొప్పగా నటించినా తన సినిమాలకు సంబంధించి నెగటివ్ కామెంట్స్ చేస్తూ సినిమాలు ఫ్లాప్ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది యూజర్స్. కాగా దీని వెనకాల ఉన్నది ఎవరనేది మాత్రం తెలియదు. అయితే 'హిట్స్, ఫ్లాప్స్ అనేవి ప్రతి నటుడి జీవితంలో కామన్ అని, వాటి గురించి పెద్దగా బాధపడకుండా ముందుకు వెళ్లిపోతుంటా' అని చెబుతున్నారు కిరణ్.
- ఉద్యోగంలో సంతృప్తి లేకే సినిమాల్లోకి..
తాజా చిత్రం 'మీటర్' ప్రీ రిలీజ్ సందర్భంగా వరంగల్ నిట్‌లో ఏప్రిల్ 7 నుంచి స్ప్రింగ్ స్ట్రీమింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ముందస్తు వేడుకల్లో భాగంగా మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సందర్భంగా నటుడు కిరణ్ మాట్లాడుతూ 'రాయలసీమ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. బెంగళూరు, చెన్నరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో సినిమా రంగంలోకి వచ్చాను. తొలుత లఘు చిత్రాల్లో నటించాను. సినిమాలో నటించే విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేదు. తొలి చిత్రం విడుదలయ్యాకే ఇంట్లో వారికి తెలిసింది' అని చెప్పుకొచ్చారు.
- ఎందుకూ పనికిరావు అన్నవారే..
ప్రస్తుతం మీటర్, రూల్స్ రంజన్‌తో పాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు కిరణ్. ఈ మూడూ సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగల్ ఇచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా కొత్త సినిమా ప్రారంభమైంది. కాగా తాను చదువుకునే రోజుల్లో తనని 'అందరూ వరస్ట్ స్టూడెంట్ అనే వారని, వరస్ట్ ఈజ్ ది బెస్ట్ అని నిరూపించుకున్నాను. ఎందుకూ పనికిరావు అన్నవారే తనకు స్ఫూర్తి అంటున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో విషయం ఉంటుంది. ఏదైనా అనుకుంటే అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్లాలి' అంటూ స్ఫూర్తి సందేశమిచ్చారు కిరణ్.
- నా మీటర్లో నేను వెళతాను..
తాజా చిత్రం 'మీటర్' గురించి మాట్లాడుతూ 'మీటర్ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్. నాకు చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. అందువల్ల అలాంటి సినిమాలు పడినప్పుడు నేను ఇష్టంతో చేయడం వల్ల ఈజీగా చేసినట్టు ఆడియన్స్‌కి అనిపిస్తూ ఉంటుంది. హీరో పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఇందులోని హీరో తండ్రి డ్రీమ్. ఆ విషయంలో హీరో తండ్రికి ప్రామిస్ చేస్తాడు. కానీ అతనికి పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. అందువల్ల అతను ఏం చేశాడనేది పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌తో నడుస్తుంది. ఇది చిన్న సినిమా కాదు. హీరో ప్రతి విషయాన్ని మీటర్‌తో ముడిపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ''నా మీటర్లో నేను వెళతాను.. నన్నెవ్వడూ ఆపలేడు'' అన్నట్టుగా ఉంటుంది. అందువల్లనే ఈ టైటిల్‌ను సెట్ చేయాల్సి వచ్చింది' అని చెప్పారు.