Jul 05,2023 11:37

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, విజయవాడ : 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' రాష్ట్ర రాజధాని ప్రాంతం విజయవాడలో హోరెత్తింది. నగరంలో ఎర్ర సైన్యం కదం తొక్కింది. ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, ఎర్ర జెండాలు, మెడలో ఎరుపు, ఆకుపచ్చ కండువాలతో మంగళవారం సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. తలపై కొమ్ములు, చేతిలో డోలు వాయిద్యాలు, ఆదివాసీల తలపాగాలతో గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చేసిన నృత్యాలతో ముందుకు సాగింది. సోమవారం సాయంత్రం విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌కు చేరుకున్న పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్ర 15వ రోజు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో ముగిసింది. తొలుత పాదయాత్ర బృందంలోని 351 మందికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు కండువాలను కప్పి పాదయాత్రను ప్రారంభించారు. విజయవాడ నగరంతోపాటు ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల నుండి సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున డాబాకొట్ల సెంటర్‌కు చేరుకుని ఈ యాత్రకు స్వాగతం పలికాయి. మెడలో ఎర్ర, పచ్చ కండువాలు ధరించి, చేతిలో పార్టీ జెండాలు చేబూని ఎంతో క్రమశిక్షణాయుతంగా సాగింది. యాత్ర అగ్రభాగాన యాత్ర రథసారథి వి.శ్రీనివాసరావు, వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారామ్‌, సిహెచ్‌.బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి తదితర నేతలు ఉన్నారు. నేతలను వందలాది మంది బృందం సభ్యులు, పార్టీ శ్రేణులు అనుసరించారు. పోలవరం వల్ల సర్వం కోల్పోతున్న గిరిజనుల బాధలు, పాలకుల విధానాలు తెలిపే పాటలతోపాటు ప్రజానాట్య మండలి కళాకారులు యాత్రకు ఊపునిచ్చేలా డిజె సౌండ్‌తో వివిధ రకాల పాటలను పాడుతూ ముందుకు సాగారు. ఎర్ర జెండా రెపరెపలతో యాత్ర సాగింది. ఈ యాత్ర డాబాకొట్లు సెంటరు, సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌, బుడమేరు వంతెన, ముత్యాలంపాడు గవర్నమెంట్‌ ప్రెస్‌, సత్యనారాయణపురం భగత్‌సింగ్‌ రోడ్డు, ఫుడ్‌ జంక్షన్‌, ఘంటసాల సంగీత కళాశాల, దుర్గాపురం, సాంబమూర్తి రోడ్‌, డిమార్ట్‌ మీదుగా సభాస్థలి అయిన అలంకార్‌ సెంటరులోని ధర్నా చౌక్‌కు చేరింది. బుడమేరు వంతెన వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి వి.శ్రీనివాసరావు, ఎపి విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ తదితర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫుడ్‌ జంక్షన్‌ సెంటర్లో రేలా రేలా అంటూ ఆదివాసీ గిరిజన మహిళలతో కలిసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు తలపై కొమ్ములు ధరించి చేసిన నృత్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నగరంలో మొత్తం 4.5 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కదలింది. ఎక్కడికక్కడే ఘన స్వాగతం లభించింది. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దారి పొడవునా రోప్‌వే ద్వారా పాదయాత్ర సాగినంత దూరం పార్టీ నాయకులు, కార్యకర్తల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి మహా పాదయాత్ర చూడలేదని నగర వాసులు వ్యాఖ్యానించడం కనిపించింది.
 

                                                            ఆద్యంతం ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు

విజయవాడ నగరంలోని ధర్నా చౌక్‌లో మంగళవారం పోలవరం నిర్వాసితుల పోరు కేక మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సభ 3 మూడు గంటల వరకూ సాగింది. నేతల ప్రసంగాలు ఆద్యంతం అకట్టుకున్నాయి.
 

                                                                    భారీగా తరలి వచ్చిన ప్రజానీకం

బహిరంగ సభకు ఎన్‌టిఆర్‌, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల నుంచి సిపిఎం, ప్రజా, కార్మిక, ఉద్యోగ, యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. గిరిజనులు తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్‌లు, లారీలు, ఆటోల్లో తరలి వచ్చిన వేలాది ప్రజలతో ధర్నా చౌక్‌ రోడ్డు కిక్కిరిసిపోయింది.