ప్రజాశక్తి - భీమవరం/రాజోలు :ప్రస్తుతమున్న మద్యం పాలసీని రద్దు చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. గతంలో టిడిపి ప్రభుత్వం అమలు చేసిన అనేక బిసి సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా 26 వేల మందిపై అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. యువగళం పాదయాత్ర శుక్రవారం 208వ రోజు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సాగింది. కలగంపూడిలో శెట్టిబలిజ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని, కుల వృత్తులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఉపాధి హామీ కోపం తాడిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు ఆరు నెలలే చెల్లుబాటులో ఉంటున్నాయని, టిడిపి అధికారం చేపట్టాక శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాన్ని అందించే ఏర్పాటు చేస్తామన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టిడిపి అంటే బిసి.. బిసి అంటే టిడిపి అని అన్నారు. 208వ రోజు పాదయాత్ర కలగంపూడి నుంచి ప్రారంభమై చించినాడ మీదుగా వశిష్ట గోదావరి వంతెనపైకి చేరింది. శుక్రవారం రాత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం దిండి వద్ద టిడిపి నాయకులు భారీ కొబ్బరి కాయల దండతో స్వాగతం పలికారు. మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ పాల్గన్నారు. పాదయాత్ర దిండి నుండి శివకోటి, రాజోలు, సోంపల్లి మీదుగా పొదలాడకు చేరింది.










