- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వాసిత యువత ఆగ్రహం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తమకు, తమ కుటుంబాలకు ఇప్పటి వరకూ జరిగిన అన్యాయంపై 'పోలవరం పోరుకేక మహా పాదయాత్ర' ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వాసిత యువత ప్రశ్నిస్తోంది. దండుకట్టి పోరాటానికి ముందుకు ఉరుకుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా ఆర్ అండ్ ఆర్‌కు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అండగా నిలుస్తానని ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా వైఎస్.జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. గతేడాది వచ్చిన వరదల సమయంలో బాధితులకు కేవలం రూ.2 వేల నగదు, నాలుగు రకాల కూరగాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ పోలవరం పోరుకేక మహా పాదయాత్ర సాగుతోంది. గత 12 రోజులుగా సుమారు 300 కిలోమీటర్లుకుపైగా దూరం నడిచి రాష్ట్ర రాజధానికి తరలివస్తున్నారు. వారిని 'ప్రజాశక్తి' పలకరించగా తమకు తమ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని, నేడు జరుగుతున్న పోరాటాన్ని, అనుభవాలను వివరించారు. వారి మాటల్లోనే..

కుంజా బొజ్జి,
సున్నం రాజయ్యల స్ఫూర్తితో...
పోలవరం ముంపు మండలాల ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, సున్నం రాజయ్యలు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని 12 రోజులుగా యాత్రలో నడిచి వస్తున్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గిరిజనులకు జరిగే నష్టాన్ని ఆనాడే ఆ మహనీయులు వివరించారు. గత వరదలకు మా ఇల్లు నేలమట్టమైంది. ఇప్పటికీ తేరుకోలేకపోయాం. నాలానే అనేక కుటుంబాలు దయనీయ పరిస్థితుల్లో ఏడాదిగా జీవనం గడుపుతున్నాయి.
-మడకం లక్ష్మణరావు,
అడవి వెంకన్నగూడెం, విఆర్.పురం మండలం
వృద్ధురాలైన అమ్మను ఒంటరిగా వదిలి...
వృద్ధురాలైన అమ్మ ను ఒంటరిగా వదిలి పాదయాత్రలో కలిసి వస్తున్నాను. ఈ యాత్ర గోదావరి నిర్వాసితుల గొంతుక అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా కష్టాల నుంచి బయటపడేందుకే ఈ పోరాటంలో నడిచి వస్తున్నాను. డిఇడి పూర్తి చేసిన నేను వ్యవసాయ కార్మికునిగా పని చేస్తూ అమ్మను పోషించుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్‌సి తీయకపోవడంతో విలీన మండలాల్లో నాలానే అనేకమంది యువత ఉపాధి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది.
-ఎం.దారమ్మ, అడవి వెంకన్న గూడెం, విఆర్.పురం మండలం
ప్రశ్నించేందుకే వచ్చాం
మా న్యాయమైన హక్కుల కోసం ప్రభు త్వాన్ని ప్రశ్నించేందుకు పోలవరం పోరుకేక మహా పాదయాత్ర వేదికైంది. అందుకే మా కుటుంబం నుంచి నాన్న, నేను ఇద్దరం కలిసి యాత్రలో పాల్గొంటు న్నాం. పోలవరం నిర్వాసితులను గతేడాది ముంచేసింది గోదావరి వరద కాదు.. ప్రాజెక్టు వరద. నాడు మా ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం నుంచి వరద సాయం అందలేదు. సుదీర్ఘకాలం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ జీవనం గడపడం లేము.
-గొర్రె ఠాగూర్,
మల్లెతోట, చింతూరు మండలం
మహా పాదయాత్రలో నేను సైతం
సిఎం మాట తప్పారు. నాడు ప్రతిపక్ష నేతగా మా ప్రాంతంలో పర్యటించారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన మాకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అవన్నీ ఉత్తిమాటలుగానే మిగి లాయి. గత వరదలు నాటి దుర్భర పరిస్థితులు మా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కనీసం వరద సాయం కూడా అందలేదు. పోరుకేక మహా పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నేను సైతం అంటూ పాదయాత్రకు కదిలి వచ్చాను.
-సోడి సింగమ్మ,
గూడూరు, చింతూరు మండలం

ప్రభుత్వాన్ని నిలదీస్తాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు మండలాల్లో నివసిస్తున్న యువత భవిష్యత్తు అంధకారంగా మారింది. వారసత్వంగా మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. మిర్చి సాగు చేసుకుంటూ మా కుటుంబం జీవనోపాధి పొందుతుంది. పునరావాసం కల్పించలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి మమ్మల్ని గోదాట్లో ముంచేస్తున్నారు. అడవి నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలి? ఏమి తిని బతకాలి? ఈ ప్రశ్నలు నాలాంటి యువతను వెంటాడుతున్నాయి.
-మడకం నాగమణి,
రేపాక, కూనవరం మండలం
ఎంతవరకైనా పోరాటం
మాకు పరిహారం, పునరావాసం లభించే వరకూ పోరాటాన్ని ఆపేది లేదు. 13 రోజులుగా ఈ యాత్రలో నడిచి వస్తున్నాను. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా, అది గోదావరి ముంపును మించినది కాదు. కేంద్రం, రాష్ట్రం నాటకాలు ఆడుతున్నాయి. హామీలను నెరవేర్చలేదు.
-సోడే సుమన్, బొజ్జరాయి గూడెం, కూనవరం మండలం
రాళ్లు... ముళ్లు.. దాటుకుంటూ
రాళ్లు.. ముళ్లు.. దాటుకుంటూ విజయ వాడకు చేరబోతున్నాం. ఇప్పటివరకు సుమారు 300కుపైగా కిలోమీటర్లు కాలినడకన నడిచాను. మహిళను కావడంతో ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను సైతం తట్టుకుని ముందుకు వెళుతున్నాను. నాలానే వందలాది మంది మహిళలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు.
-పదం నిర్మల,
జగ్గారం గ్రామం, ఎటపాక మండలం
ప్రతి కుటుంబం నుంచీ పోరుకేక
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికీ మాకు పునరావాసం, భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించలేదు. గ్రామాలను ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాల నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ ఇస్తామని చెప్పారు. ఆచరణలో మాట తప్పారు.
-కాకా సాయి భగవాన్, మురుమూరు గ్రామం, ఎటపాక మండలం
గోదాట్లో ముంచేస్తే సహించేది లేదు
పరిహారం, పునరా వాసం చెల్లించ కుండా గోదాట్లో ముంచేస్తానంటే సహించేది లేదు. గోదావరి వరదల కారణంగా నా రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగుకు దూరమైంది. ఆర్థికంగా చితికిపోవడంతో పెట్టుబడి పెట్టే పరిస్థితులు కూడా లేవు. మా భవిష్యత్తు కాంతిరేఖ ఈ పాదయాత్ర.
-కరటం ప్రకాష్,
కొత్తూరు, వేలేరుపాడు మండలం
మా భవిష్యత్తు కోసం పోరాటం
అధికారుల లెక్కల ప్రకారం మా గ్రామం 45వ కాంటూరు పరిధిలో ఉంది. గతేడాది వచ్చిన వరదలకు పూర్తిగా ముంపునకు గురైంది. నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ స్థాయిలో వరద రావడం అదే మొదటిసారి. రెండు వారాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపాం. ప్రతి ఏటా చస్తూ బతకడం కష్టం కదా. ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నాను. కాలేజీకి వెళ్లాలి. మా భవిష్యత్తు కోసం జరిగే పోరాటం కావడంతో మా కుటుంబం మొత్తం యాత్రలో కలిసి వస్తోంది.
-కుంజా కావ్య,
వసంతవాడ, వేలేరుపాడు మండలం
మహాధర్నాలో నిలదీయనున్నాం
ఆదివాసీలను అడవికి దూరం చేస్తే ఎలా బతకగలం. ప్రాజెక్టుతో మా కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 20 ఎకరాల సాగు భూమి కోల్పోతున్నాం. ప్రభుత్వం ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదు. పాలకులను నిలదీసేందుకు జరిగే ఈ పోరాటంలో మా గ్రామం నుంచి అందరం భాగస్వాములయ్యాం.
-పి.నూకరాజు, పాతదాచారం, కుక్కునూరు మండలం
ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం
తరతరాలుగా భూ మిని నమ్ముకుని వ్యవసాయం చేసు కుంటూ మా కుటుంబాలు జీవనోపాధి పొందుతు న్నాయి. ప్రాజెక్టు నిర్మాణంతో ఇల్లు, భూములు కోల్పోతున్నాం. నాపై ఆధారపడి భార్య, పాప, బాబు ఉన్నారు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకే ఈ పోరాటం. దీనిలో నేను భాగస్వామినవడం ఆనందంగా ఉంది.
-మేడిపల్లి బాబు,
మాధవరం, కుక్కునూరు మండలం
ఉరిమే ఉత్సాహంతో...
పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్రలో యువత ఉరికే ఉత్సాహంతో కలిసి వస్తోంది. 13 రోజులుగా వందలాది మంది యువత యాత్రలో భాగస్వామమవడంతోపాటు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమస్యలు ఉన్నప్పటికీ ఈ యాత్రలో మనోధైర్యంతో కలిసి వస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం జరిగే ఈ పోరాటంలో కష్టాలను దాటుకుంటూ ముందడుగు వేస్తున్నారు. 18 సంవత్సరాలలోపు వారు కూడా ఈ యాత్రలో ఉన్నారు. కొంతమంది మహిళలు చిన్నపిల్లలను ఇంటి వద్ద వదిలి ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ పోరాటం ఓ మైలురాయిగా నిలవనుంది.
-మొడియం నాగమణి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
పోరాటంలో యువతదే కీలక పాత్ర
పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. ముంపు మండలాల నుంచి వేలాది మంది యువత తరలివస్తున్నారు. గ్రామాలను ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాలు లెక్కగా తీసుకోవాల్సిన స్థానంలో నోటిఫికేషన్ ప్రక్రియను ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకుంటోంది. దీనివల్ల మిగిలిన మండలాల్లో సుమారు 1500కు పైగా యువత నష్టపోతున్నారు.
-పులి సంతోష్, గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా కార్యదర్శి










