ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో ఓ క్యారెక్టర్‌తో కామెడీ.., యాక్షన్.., ఎమోషన్ పండించిన గొప్ప నటుడు మనోజ్ బాజ్‌పాయ్. అయితే ఇంతగా పేరుతెచ్చుకున్న ఆయన ప్రస్థానం అంత సాఫీగా ఏమీ సాగలేదు.. ఎన్నో ఆటుపోట్లు.. కొడుకు డాక్టర్ కావాలన్నది ఆయన తండ్రి కల.. యాక్టర్ కావాలన్నది కొడుకు సంకల్పం. అందుకే ఆ రైతు కొడుకే మనందరికీ వెర్సటైల్ యాక్టర్ మనోజ్‌బాయ్ గా సుపరిచితుడయ్యాడు. ఏడేళ్లకే చదువుల పేరిట హాస్టల్ బాట పట్టిన మనోజ్.. తాను చిన్ననాట సీనియర్ల ర్యాగింగ్‌కీ.. ర్యాగింగ్ పేరిట వేధింపులకీ గురైనవాడే. ఒక మ్యాగజైన్‌లో నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూ పరోక్షంగా మనోజ్ బాజ్పాయ్లోని నటుడిని తట్టిలేపింది. ఆ కాంక్షే బలపడి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు దరఖాస్తు చేసుకునేలా చేసింది. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన మనోజ్ జర్నీ.. ఎప్పటికప్పుడు పునర్ జీవితాన్ని నిర్మించుకునే ఓ ఫినిక్స్ పక్షి తరహాలో కనిపిస్తుంటుంది. 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలు..
మనోజ్ బాజ్‌పాయ్ గురించి ప్రత్యేకించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. రామ్ గోపాల్‌వర్మ 'సత్య' నుంచి.. ఆ మధ్య అల్లు అర్జున్ 'వేదం' వరకూ పలు తెలుగు సినిమాల్లో నటించి, మెప్పించారు. ఇక ముఖ్యంగా మనోజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. అయితే 1993లో షికస్ట్ అనే సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యారు. తర్వాత 1994లో తిగ్మాన్షూ ధూలియా అనే స్క్రీన్ రైటర్, క్యాస్టింగ్ డైరెక్టర్ తన డొక్కు స్కూటర్‌పై ఢిల్లీ వీధుల్లో మనోజ్ బాజ్‌పాయ్ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. చారు షాపులో ఉన్న మనోజ్‌ని కలిసి బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఛాయ్ పడితే ఎలా ఉంటుందో అలాంటి వార్తే చెప్పారు. శేఖర్‌కపూర్ తను తీయబోతున్న 'బ్యాండిట్ క్వీన్' సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడన్నదే ఆ వార్త! మొత్తమ్మీద తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న మనోజ్ బాజ్‌పాయ్ జీవితంలో 1993 నుంచి 1997 వరకూ ఓ గడ్డుకాలంగా.. దినదినగండంగా గడిచిన పరిస్థితి. ఆ తర్వాత 1998లో రాంగోపాల్ వర్మ 'సత్య' మనోజ్ జీవిత చరిత్రనే తిరగరాసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులోనూ 'ప్రేమకథ', 'హ్యాపీ', 'పులి', 'వేదం', 'సికిందర్', 'డయల్ 100', 'మిస్సింగ్' వంటి చిత్రాల్లో నటించారు.
- దర్శకులకు ఫోన్ చేసి పని అడుగుతా..
నేను ముంబైకి పని కోసం వచ్చా.. అందుకే ఇప్పటికీ దర్శకులకు ఫోన్ చేసి, పని అడుగుతానని ఓ సందర్భంలో మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. 'ఒక రాజ్ బబ్బర్, ఓ ఓంపురి వంటి నటులంతా వచ్చిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు దొరికితే.. నేను ఆశించిన రంగంలో స్థిరపడవచ్చనుకున్నా.. కానీ అంత ఈజీగా సీటు దొరికుంటే కథ ఇప్పటిలానే ఉండేదో, కాదో ఊహించలేం కానీ.. అందులో రిజెక్టైన ప్రతిసారీ కసి పెరిగింది. అయితే ఆ కసిలోంచి డెస్పరేషన్ లెవల్స్‌కు చేరుకున్నా.. ఒకానొక దశలో ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకునే స్థితికి చేరుకున్నా... ఆ సమయంలో నన్ను బాగా గమనించిన స్నేహితులు.. కనీసం ఒక్కసారి కూడా ఒంటరిగా వదిలేందుకు సిద్ధపడలేక పోయారని' ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు మనోజ్. ఇదే విషయాన్ని ఓ ఛానల్‌లో ప్రసారమవుతున్న షోలో అభిమానులతో పంచుకున్నారు.
- మూడుసార్లు అనర్హుడై.. నేడు ఫ్యాకల్టీగా..
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు తను మొదటిసారి సెలక్ట్ కాకపోవడం మనోజ్ తీవ్ర వేదనకు గురయ్యారు. ఎలాగోలా స్నేహితుల రూపకంగా మనోజ్ తను మళ్లీ వీథి నాటకాలు వేసుకోవడంలో బిజీ అయ్యారు. అలా కాలం గడుస్తున్న సమయంలో మరోసారి ఎన్‌ఎస్డీకి అప్లై చేశారు. కానీ మళ్లీ తిరస్కరణే ఎదురైంది. అప్పుడు ది ఫ్రీ బర్డ్స్ కలెక్టివ్ పేరుతో నటన, దర్శకత్వ శాఖల్లో ట్రైనింగ్ ఇచ్చే బారీజాన్‌తో పరిచయం ఏర్పడింది. బారీజాన్ ఢిల్లీలోని ప్రముఖ థియేటర్ యాక్షన్ గ్రూప్ వ్యవస్థాపకులు కూడాను! ఆ పరిచయంతో చిన్నాచితకా వేషాలతో తన బతుకుచిత్రం నడిచేది. అయినా ఫోకసంతా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు దక్కించుకోవడం కోసమే! అలా మూడోసారీ ఎన్‌ఎస్డీకి దరఖాస్తు చేసుకున్నారు మనోజ్ బాజ్‌పారు. కానీ మళ్లీ అక్కడ నటనలో తర్ఫీదు పొందేందుకు అనర్హుడయ్యారు మనోజ్ బాజ్‌పాయ్. కానీ మూడుసార్లు ఎన్‌ఎస్డీలో తిరస్కరణకు గురైన మనోజ్ ఏకంగా.. అదే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాల్గోసారి నటనలో తర్ఫీదిచ్చే ఫ్యాకల్టీ పోస్టునే అందుకునే స్థాయికెదిగారు. కాగా.. మనోజ్ చివరగా 'గుల్మోహర్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో 'డెస్పాచ్, సూప్, జోరమ్' చిత్రాల్లో నటిస్తున్నారు.
పేరు: మనోజ్ బాజ్‌పాయ్
వృత్తి: నటుడు, ప్రొడ్యూసర్
పుట్టిన తేదీ: ఏప్రిల్ 23, 1969
పుట్టిన ప్రాంతం: బేవాల్, పశ్చిమ చెంపారన్, బీహార్
నివాస ప్రాంతం: ముంబై, చదువు: ఎంఏ
జీవిత భాగస్వామి: నేహా ఆకా షబానా రాజా
పిల్లలు: అవా రాయల్ బాజ్‌పారు
తల్లిదండ్రులు: రాధాకాంత్ బాజ్‌పారు, గీతా బాజ్‌పారు
తోబుట్టువులు: సుజిత్‌కుమార్, కామినీ శుక్లా, పూనమ్ డూబే, గరీమా