బాలీవుడ్ స్టార్ హీరోయిన్! సౌత్ ఫిల్మ్ ఇండిస్టీలో కూడా.. క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మనీషా కోయిరాలా.. 'ఒకే ఒక్కడు'లో ''నెల్లూరి నెరజాణా..'' అంటూ తెలుగు ఆడియెన్స్‌నే కాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన నటి. అయితే ఉన్నట్టుండి సడెన్‌గా ఫిల్మ్ ఇండిస్టీకి దూరమయ్యారు. అయితే తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. కాగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం..!
ఒకప్పుడు అందాల తారగా పాపులర్ అయిన మనీషా కోయిరాలా జీవితంలోనూ అనేక స్ట్రగుల్స్ ఉన్నాయి. 1990లో తన నటనతో సత్తా చాటిన ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొని, తిరిగి నిలబడ్డారు. 'బొంబాయి' చిత్రంతో దక్షిణాది సినీ ప్రియులకు చేరువైన నటి మనీషా కొయిరాలా. ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్ చిత్రాల్లో నటించి, మెప్పించారు. మనీషా కొయిరాలాను అలనాటి నటి నర్గీస్‌తో పోలుస్తారు. 1991లో 'సౌదాగర్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఎ లవ్ స్టోరీ', 'అగ్ని సాక్షి', 'ఇండియన్', 'గుప్తా', 'కచ్చే ధాగే', ' కంపెనీ', 'ఏక్ చోటీసి లవ్ స్టోరీ', 'మన్' వంటి చిత్రాల్లో నటించారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల కాలంలో మనీషా హిందీలో 'డియర్ మాయా', 'లస్ట్ స్టోరీస్', 'సంజు', 'ప్రస్థానం', 'మాస్కా', 'షెహజాదా' వంటి చిత్రాల్లో నటించారు. ఇక 2002లో రజనీకాంత్‌తో కలిసి చేసిన 'బాబా' సినిమా తర్వాత ఆమె సౌత్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఓ వైపు వైవాహిక జీవితం నిలబడలేకపోవడం, మరోవైపు క్యాన్సర్ బారిన పడటంతో దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయ్యింది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని, నిలదొక్కుకున్నారు. మళ్లీ నటిగా బిజీ అయ్యారు. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు.
- స్కూల్ డేస్‌లోనే నటించే అవకాశం..
స్కూల్ టైమ్ నుంచే నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే నేపాలీ సినిమాలో నటించే అవకాశం పొందాను. 1991లో వచ్చిన 'సౌదాగర్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. తమిళ చిత్రం 'బాంబే'తో నటిగా ఫ్రూవ్ చేసుకున్నా. ఇక తమిళంలో నేను చేసిన ఆఖరి పెద్ద సినిమా 'బాబా'. ఆ రోజుల్లో అది భారీ వైఫల్యాన్ని చవిచూసింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తీరా చూస్తే సినిమా ఫ్లాప్. దాంతో దక్షిణాదిలో నా కెరీర్ ముగిసిపోయిందని భావించాను. చివరికి అదే జరిగింది. 'బాబా' కంటే ముందు అక్కడ నేను కొన్ని మంచి చిత్రాల్లో నటించాను.. పేరు తెచ్చుకున్నాను. కానీ 'బాబా' తర్వాత నాకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. ఇక ఎలాంటి ప్రచారం లేకుండా ఇటీవల ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేసినప్పడు మంచి విజయాన్ని అందుకుంది. అది చూసి నేను ఆశ్చర్యపోయా. రజనీకాంత్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపించింది' అని మనీషా వివరించారు.
- వెర్రిదాన్ని అని తిట్టారు..!
అనంతరం 'బొంబాయి' రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. 'మొదట్లో ''బొంబాయి'' చేయకూడదనుకున్నా. కెరీర్ ఆరంభంలోనే తల్లి పాత్రలు చేయవద్దని ఎంతోమంది నన్ను హెచ్చరించారు. కానీ, సినిమాటోగ్రాఫర్ అశోక్‌మెహతా మాత్రం నన్ను తిట్టారు. 'మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఆయన సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నావంటే నిజంగానే నువ్వొక వెర్రిదానివి' అని ఆయన కేకలు వేశారు. ఆ మాటలు నన్నెంతో కదిలించాయి. వెంటనే అమ్మతో కలిసి చెన్నరుకు వెళ్లి, సినిమాలో భాగమయ్యా. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ ఆనందిస్తున్నా' అని పేర్కొన్నారు.
- ఎన్నో కలలు కన్నా..
తాజాగా తన వైవాహిక జీవితానికి సంబంధించి మనీషా కోయిరాలా స్పందించారు. నేపాల్‌కి చెందిన మనీషా కోయిరాలా ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని వివాహం చేసుకున్నారు. 2010లో వివాహం జరగ్గా, ఆరు నెలలకే విభేదాలు ప్రారంభమయ్యాయట. గొడవల నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు పోరాడి, చివరకు ఆమె విడాకులు తీసుకున్నారు. 2012లో తన భర్త సామ్రాట్ దహల్‌తో విడిపోయారు మనీషా. అయితే 'పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా. అది ఎప్పటికీ నెరవేరలేదు. అవి కలలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదు. నేను మాత్రమే కాదు, వైవాహిక బంధంలో సంతోషంగా లేకుంటే, విడిపోవడమే ఏకైక మార్గం' అని తెలిపారు.
- క్యాన్సర్‌తో పోరాడి..
ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారితో పోరాడి, జయించారు నటి మనీషా కోయిరాలా. ఆ సమస్య నుంచి ఆమె బయటపడి ఆరేళ్లు అవుతోంది. క్యాన్సర్ తనకు జీవితంలో ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పిందని చెబుతున్నారు ఈ నేపాలీ నటి. 'రచయిత్రి నీలమ్ కుమార్ సహకారంతో ఓ పుస్తకం రాశా. ఈ పుస్తకానికి ''హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్'' అనే టైటిల్ పెట్టా. ఈ పుసక్తాన్ని ముంబయిలో ఆవిష్కరించా. క్యాన్సర్ తనకొక కొత్త కానుక ఇచ్చిందని.. అయితే ఈ కానుక మరొకరికి రాకూడదని' అనుకుంటున్నట్లు తెలిపారు.
పేరు: మనీషా కొయిరాలా
ఇతరపేర్లు: మను, మాన్యా
వృత్తి: నటి, సోషల్ యాక్టివిస్ట్
పుట్టిన తేదీ: ఆగస్టు 16, 1970
పుట్టిన ప్రాంతం: ఖాట్మండు, నేపాల్
నివాస ప్రాంతం: ఢిల్లీ
చదువు: ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా
తల్లిదండ్రులు: ప్రకాష్ కొయిరాలా, సుష్మా కొయిరాలా
తోబుట్టువులు: సిద్ధార్థ్ కొయిరాలా
హాబీస్: ట్రావెలింగ్