Jul 08,2023 07:14
  •  చెట్లను ధ్వంసం చేసి సారా తయారీ కేంద్రాలు
  •  చోద్యం చూస్తున్న అధికారులు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : విభిన్న జీవ రాశులకు ఆవాసంగా ఉన్న మడ అడవుల సంరక్షణను అధికారులు గాలికి వదిలేశారు. ఈ ప్రాంతంలో వృక్షాల నరికివేత, నాటు సారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. దీంతో, జీవ రాశుల మనుగడ, ప్రకృతి సమతుల్యత ప్రశ్నార్థకమవుతోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యం సుమారు 61 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 36 వివిధ రకాల వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. 300 రకాల జీవజాతులకు ఈ మడ అడవులు ఆవాసం కల్పిస్తున్నాయి. 92 రకాల విదేశీ పక్షి జాతులకు ఇది విడిది కేంద్రంగా ఉంది. కొల్లేరు, పులికాట్‌ సరస్సుల తర్వాత ఆ స్థాయిలో ప్రతి ఏటా అక్టోబరు నుంచి జనవరి మధ్యలో రష్యా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. మైమరపించే ప్రకృతి సౌందర్యంతో పాటు విభిన్నమైన జీవవైవిధ్యం అధిక సంఖ్యలో కలిగిన అభయారణ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ ప్రదేశాన్ని గుర్తించింది. అందంగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుంచి భూమిని రక్షిస్తున్నాయి. సారా మాఫియా ఈ అడవులను ఆవాసంగా చేసుకుంది. వాళ్ల వ్యాపారం కోసం మడ అడవులను ధ్వంసం చేస్తోంది.

  • అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్న విధ్వంసం

కోరంగి అభయారణ్యాన్ని 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. కోరంగి వన్యప్రాణి సంరక్షణకు సరిహద్దులు నిర్ణయిస్తూ 2021లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రక్షిత అడవులు, దానికి అనుసంధానంగా ఉన్న 235.70 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి చేర్చారు. దీనిని ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పర్యవేక్షణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ పనిచేయాల్సి ఉంది. అయితే, క్షేత్ర స్థాయిలో అటవీ, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఇతర ముఖ్య శాఖల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా మడ అడవుల విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్న రొయ్యలు ప్రాసెసింగ్‌ యూనిట్లు వదులుతున్న కాలుష్య నీటితో మడ అడవుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు నాటు సారా తయారీ స్థావరాల కోసం భారీ వృక్షాలను మాఫియా విచ్చలవిడిగా నాశనం చేస్తోంది. సముద్ర తీరం వెంబడి మడ అడవులను ధ్వంసం చేసి ఏర్పాటు చేసిన నాటు సారా తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేస్తున్నా ఈ దందా, చెట్ల నరికివేత మాత్రం ఆగడం లేదు. ఇక్కడ పర్యవేక్షణకు ఒక రేంజర్‌, ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లు, ఏడుగురు బీట్‌ ఆఫీసర్లు ఉన్నా అడవుల ధ్వంసం కొనసాగుతూనే ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • నిరంతరం నిఘా

కోరంగి మడ అడవుల్లో నాటు సారా తయారీపై నిరంతరం నిఘా ఉంచుతున్నాం. అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాం. 2021 నవంబరులో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్సైజ్‌ శాఖాధికారుల సహకారంతో 2.30 లక్షల బెల్లం ఊటను ధ్వంసం చేశాం. అక్రమంగా ప్రవేశించిన ఎనిమిది ఫైబర్‌ బోట్లను సీజ్‌ చేశాం. టూరిజం ద్వారా ఆదాయం పెరిగే విధంగా కృషి చేస్తున్నాం.
- ఎస్‌.వర ప్రసాద్‌, కోరంగి అటవీ శాఖ రేంజ్‌ అధికారి