Apr 16,2023 08:56

చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు గ్లామర్‌తో రాణించాలని కలలు కంటే.. మరికొందరు మాత్రం నటనకు ప్రాధాన్యతనిస్తారు. అలా రెండో కేటగిరీకి చెందినవారే నటి మాళవికా నాయర్‌. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లతోనే కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు మాళవిక. తాజాగా నాగశౌర్యతో 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' చిత్రంలో నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. ఆ వివరాలు తెలుసుకుందాం..!
మలయాళీ నటి మాళవిక నాయర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటీమణుల్లో ఈమె ఒకరు. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఈమె 2012లో మలయాళ చిత్రం 'ఉస్తాద్‌ హోటల్‌' ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించారు మాళవిక. ఆ తర్వాత 2015లో 'ఎవడే సుబ్రహ్మణ్యం' తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'మహానటి', 'కల్యాణ వైభోగమే', 'విజేత', 'ఓరేరు బుజ్జిగా', 'థాంక్యూ' వంటి చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మలయాళం.. తమిళ పరిశ్రమల నుంచి వచ్చినవారు అక్కడి సినిమాలు చేస్తూనే, వీలును బట్టి ఇక్కడా మెరుస్తూ ఉంటారు. కానీ మాళవిక నాయర్‌ మాత్రం అలా కాదు, తెలుగు తెరతో పరిచయమైన దగ్గర నుంచి.. ఆమె మరో మలయాళ సినిమాగానీ.. తమిళ సినిమా గానీ చేయలేదు. పూర్తిగా తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల విడుదలైన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రంలో మరోసారి తన సత్తాను చాటారు. అయితే ప్రస్తుతం 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటిస్తున్నారు.
కథ అవసరాన్ని బట్టే సన్నివేశాలు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ముద్దు సీన్‌పై మాళవిక మాట్లాడుతూ.. 'ముద్దు సీన్‌లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని ఇరికించిన సన్నివేశం కాదు. కథలో భాగమైన, కథకి చాలా అవసరమైన సన్నివేశం.. కథ డిమాండ్‌ మేరకే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. సాధారణ ప్రేమకథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్నిరకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. నటిగా నేను ఎవరనేది నిరూపించే చిత్రమిది. ఇప్పటిదాకా ఒక నటిగా సినిమాలు చేశాను. నటిగా ఏం చేయాలో అంతవరకే చేశాను. కానీ ఇది అన్ని విభాగాల పరంగా నాకు దగ్గరైన సినిమా' అని అన్నారు.

  • నటిగా నా ప్రయత్నం నేను చేస్తా..

'ప్రీ రిలీజ్‌ వేడుకలో డైరెక్టర్‌ బాబీ మీ కళ్లు బాగున్నాయి అని చెప్పడం ఆనందం కలిగించింది. గతంలో కూడా కొందరు దర్శకులు కళ్లు బాగుంటాయి అని ప్రశంసించారు. మా అమ్మ కళ్లు కూడా అలాగే ఉంటాయి. అవే నాకు వచ్చాయి. నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అనుకోవట్లేదు. కథ, పాత్ర నచ్చితే అన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చిన ప్రతి సినిమా చేయడంలేదు. నా మనసుకి నచ్చిన సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని, నటిస్తున్నాను. ప్రస్తుతం 'అన్నీ మంచి శకునములే', 'డెవిల్‌' చిత్రాల్లో నటిస్తున్నా' అని తెలిపారు మాళవిక నాయర్‌.

  • కథ విన్న తరువాతే..

ఓ వైపు చదువును కొనసాగిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు మాళవికా నాయర్‌. 'మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌'తో గత ఏడాది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మాళవిక. 'ఏ సినిమాలో చేయాల్సి వచ్చినా, ముందుగా నేను కథకే ప్రాధాన్యతను ఇస్తాను. నా సినిమాలకి సంబంధించిన నిర్ణయాలను నేనే తీసుకుంటాను. అలా ఈ కథను విన్న తరువాత నేను ఎస్‌ చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు తప్పకుండా మంచిపేరు వస్తుందని భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. అయితే 'వచ్చిన ప్రతి సినిమా చేయాలని అనుకోవడంలేదు. నా మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాను. నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కథ నచ్చితే అన్ని జోనర్ల సినిమాలు చేస్తాను.. ఇక 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ప్రయోగాత్మక సినిమానే. మంచి భావోద్వేగాలు ఉన్నాయి. చూస్తున్నంతసేపూ ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ఏం చేసినా ప్రేక్షకుల వినోదం కోసమే కదా.. ఈ సినిమాలో సహజమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. అవి స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతాయి' అని తెలిపారు.

పేరు: మాళవిక నాయర్‌
ఇతరపేర్లు: మల్లి, అమ్ము
పుట్టిన తేదీ: జనవరి 5, 1998
పుట్టిన ప్రాంతం: ఢిల్లీ
నివాస ప్రాంతం: కేరళ
చదువు: జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌: రైటింగ్‌, రీడింగ్‌, పెయింటింగ్‌
తల్లిదండ్రులు: సేతుమాధవన్‌, సుచిత్రా సేతుమాధవన్‌
తోబుట్టువులు: నిఖిల్‌ సేతుమాధవన్‌